నూతన చరిత్రకు సీఎం కేసీఆర్ శ్రీకారం..

Sun,April 14, 2019 01:51 AM

వైరా, నమస్తే తెలంగాణ, ఏప్రిల్13: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ 16 స్థానాల్లో ఘన విజయం సాధించి నూతన చరిత్రను సృష్టించబోతుందని ఖమ్మం పార్లమెంటు టీఆర్‌ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. వైరాలోని వాసవీ కల్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి నామ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు తనను ఆశీర్వదించారన్నారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అన్నదమ్ముల్లా కలిసిమెలసి పనిచేయడం శుభపరిణామమన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఓటర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలు భారతదేశ చర్రితనే మలుపు తిప్పనున్నాయని స్పష్టం చేశారు. గడిచిన 70 సంవత్సరాల్లో భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశాభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. పోరాడి సాధించిన రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ర్టాలు ఈర్ష్య పడేవిధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు.

సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి గుమ్మానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేరవేసిందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. దేశంలో ప్రాంతీయ పార్టీలకే ప్రజలు పట్టం కట్టనున్నారని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు మాట్లాడుతూ.. తనకు నామినేషన్‌ల ముందు వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారని చెప్పారు. అయితే వైరా నియోజకవర్గంలో రెండు శక్తులను కూడగట్టుకొని ముందుకు సాగానన్నారు. 20 రోజుల్లోనే టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసిమెలసి కేసీఆర్ ఆదేశించిన నామ నాగేశ్వరరావు గెలుపు కోసం సైనికుల్లా పనిచేశారన్నారు. కుటుంబంలోనే చిన్న చిన్న విబేధాలు ఉండటం సహజమన్నారు. అలాంటిది పలు పార్టీల నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి నాయకులు, కార్యకర్తలు వలస రావడం వలన అభిప్రాయ బేధాలు ఉండటం సహజమన్నారు. వీటన్నింటిని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరిచి ఎన్నికల్లో కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారన్నారు. నామ నాగేశ్వరరావుకు వైరా నియోజకవర్గంలో సుమారు 10వేల మెజారిటీ వస్తుందని తనను ఫోన్‌లో అడిగిన కేసీఆర్‌కు చెప్పానన్నారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమన్నారు. ఓట్ల ప్రక్రియ ముగిసిందని కౌంటింగ్ ప్రక్రియ ముగిస్తే ఎంపీగా నామ ధ్రువీకరణ పత్రం తీసుకోవడమే ఆలస్యమన్నారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేశారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల మాట్లాడుతూ తాను, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ సమన్వయంతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లామన్నారు. ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తుళ్ళూరి బ్రహ్మయ్య పాల్గొన్నారు.

264
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles