75.16 శాతం..!

Sat,April 13, 2019 06:20 AM

-రాష్ట్రంలోనే అత్యధిక ఓటింగ్..
-ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు
-సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు తరలిన ప్రజలు
-పట్టణాల్లో మందకొడిగా, పల్లెలో చైతన్యంతో ఓటు
-పెరిగిన ఓటింగ్ శాతంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం
-ఫలించిన జిల్లా అధికారుల ప్రయత్నాలు
ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం పార్లమెంట్ పరిధిలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే నియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. వేసవికాలం కావడంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, పొలీసు అధికారులు తీసుకున్న పటిష్టమైన చర్యలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 75.16శాతం పోలింగ్ నమోదైంది. దీంతో రాష్ట్రలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదుకావడంతో జిల్లా అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రశంసలు అందాయి. మధ్యాహ్నం ఎండ వేడిమి తట్టుకోలేక ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. సాయంత్రం 3 గంటల తరువాత ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలకే ముగించాల్సి ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ ముగిసిన సమయానికి శాసనసభ నియోజకవర్గాల వారీగా పోలింగ్ నమోదు శాతం భారీగా ఉంది. ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో 65.63, పాలేరులో 82.87శాతం, మధిరలో81.40 శాతం, వైరాలో79.15 శాతం, సత్తుపల్లిలో77.84, కొత్తగూడెం నియోజకవర్గంలో66.77, అశ్వారావుపేట నియోజకవర్గంలో 77.72, శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 82.87 శాతం పోలింగ్ నమోదుకాగా, అతితక్కువగా ఖమ్మం నియోజకవర్గంలో 65.63 శాతం పోలింగ్ నమోదు అయింది.

వృద్ధులు, వికలాంగులు, యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దివ్యాంగుల పోలింగ్ శాతం పెంచడం కోసం భారత ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించడంతో వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా మహిళల కోరకు ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ శాతం పెరిగెల చర్యలు తీసుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల ఆధికారులు ప్రజల్లో తీసుకువచ్చిన చైతన్యంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం విశేషం. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 17 నియోజకవర్గాల పరిధిలో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా పోలింగ్ నమోదు కావడంతో ఎన్నికల సంఘం నుంచి జిల్లా అధికారులకు ప్రశంసలు అందాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ఈవిఎమ్‌లను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలలోని ఈవీఎంలను ఖమ్మం సమీపంలోని కౌంటింగ్ కేంద్రమైన విజయ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు.

ఎండకు బయటికి రాని ఓటర్లు...
మాడలు మండే విధంగా ఎండలుండటంతో ఓటర్లు ఉదయాన్నే అధిక సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం జరిగింది. ఆ తరువాత మధ్యాహ్న సమయంలో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. తిరిగి సాయంత్రం 3 గంటల తరువాత ఓటర్ల రాక ప్రారంభమైంది. మ్మం జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు మందకొడిగా కొనసాగింది. మధ్యాహ్నం తరువాత ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు 8.2శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 గంటలకు 24.2 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 41.65 శాతం, 3 గంటలకు 54.80 శాతం, 5 గంటలకు 67.92 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్‌లలో క్యూలైన్లో ఉన్నవారికి అవకాశం కల్పించడంతో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది.

పెరిగిన ఓటింగ్ శాతంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం..
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గ్రామీణ ఓటర్లు చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండ వేడిని కూడా లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పట్టణాలలో విద్యాధికులు అధికంగా ఉన్నప్పటికీ తమ ఓటు హక్కును వినియోగించుకోపోవడం హాస్యాస్పదంగానే చెప్పవచ్చును. ఓటు విలువ పట్ల పల్లె ప్రజల్లో ఉన్న చైతన్యం పట్టణ ప్రజలకు లేదనే భావించవచ్చు. తెలంగాణ రాష్ట్రం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి బాసటగా నిలిచేందుకు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఓటింగ్‌శాతం నమోదు కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం ఏర్పడింది. మెజార్టీ భారీగానే వస్తుందని నిఘావర్గాలు నివేదికతో టీఆర్‌ఎస్ నాయకులు ఆనందంతో ఉన్నారు.

302
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles