కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారులు

Sat,April 13, 2019 06:18 AM

మామిళ్లగూడెం: పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో పనిచేసేందుకు జిల్లాలోని ఖాళీగా ఉన్న గ్రామపంచాయతీ కార్యదర్శుల పోస్టులను అధికారులు శుక్రవారం భర్తీ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియకు అభ్యర్థులు పెద్దఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వం గ్రామాలలో పరిపాలన బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతీ గ్రామానికి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండాలనే నిబంధనలతో 485 పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2018లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్షలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ, రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. డిసెంబర్ నెలలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించే సమయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వడం ఆలస్యమైంది. దీంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నాలుగు నెలలుగా పోస్టింగ్‌ల కోసం ఎదురు చూశారు. ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ఉద్యోగాల ఖాళీలను భర్తీచేసింది. ఇందులో భాగంగానే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగిసి నూతన పాలకవర్గాలు బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో గ్రామపంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. గత పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం గ్రామ పరిపాలనా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు గ్రామ కార్యదర్శుల నియామకాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. అందులో భాగంగానే న్యాయస్థానానికి నియామక ప్రక్రియ, అర్హత మార్కులను వివరించడంతో పాటు ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నియమనిబంధలను అనుసరించి ఎంపిక చేశామని, నివేదిక అందించడంతో సంతృప్తి చెందిన న్యాయస్థానం నియామకాలకు అనుమతినిచ్చింది. దీంతో జిల్లాలో 485 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ శుక్రవారం జరిగిన పోస్టింగ్ కౌన్సిల్‌లో 436 మందికి మాత్రమే నియామక పత్రాలను అధికారులు అందజేశారు. పూర్తి పారదర్శకంగా జరిగిన ఈ కౌన్సెలింగ్ మరో 49 మంది అభ్యర్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారు. ఆ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల లోపాలు, ఇతర కారణాలతో వారిని కౌన్సెలింగ్‌కు పిలవలేదని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిగిలిన పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఈ పోస్టింగ్ ప్రక్రియలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హనుమంత్ కొడింబా, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

231
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles