జయ జయ రామా.. జానకి రామా..!

Fri,April 12, 2019 01:09 AM

- కనుల పండువగా ధ్వజపట భద్రక మండల లేఖనం
- నేడు అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం
- రాములోరి కల్యాణానికి మరో మూడు రోజులే గడువు

భద్రాచలం, నమస్తే తెలంగాణ: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అర్చకులు ధ్వజపట భద్రక మండల లేఖనం నిర్వహించారు.. స్వామివారికి ఏకాంత స్నపనం చేపట్టారు.. జీయర్ మఠం వరకూ ఊరేగింపు నిర్వహించి అక్కడ గరుడ పటాన్ని చిత్రీకరించారు.. భక్తుల జయ జయ ధ్వానాల నడుమ తిరిగి గర్భగుడికి తీసుకొచ్చి శ్రీసీతారామచంద్రస్వామివారికి చూపించారు.. యాగశాలలో గరుడాదివాసం, గరుడ జపం, గరుడ హోమం, మహాకుంభ ప్రతిష్టాపన గావించారు..!

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14వ తేదీన శ్రీసీతారాముల కల్యాణం, 15న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకలకు మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్వామివారి కల్యాణం నిర్వహించే మిథిలా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. రామాలయంతో పాటు పరిసరాలను ముస్తాబు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకస్వాములు ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి సర్వం సిద్ధం చేసుకున్నారు. మరో మూడురోజులు గడువు మాత్రమే మిగలడంతో తుది ఏర్పాట్లపై అధికారులు సన్నద్ధమయ్యారు.

కనుల పండువగా ధ్వజపఠ భద్రక మండల లేఖనం..
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ధ్వజపట భద్రక మండల లేఖనం వేడుకను వైభవంగా నిర్వహించారు. ఉదయం రామాలయంలో స్వామివారికి ఏకాంత స్నపనం గావించారు. సాయంత్రం భాజాభజంత్రీలు, సన్నాయి మేళాల నడుమ జీయర్‌మఠం వద్దకు ఊరేగింపు జరిపారు. అక్కడ అర్చకస్వాములు గరుడ పటాన్ని చిత్రీకరించారు. ఈ పటాన్ని భక్తుల జయజయ ధ్వానాల నడుమ తిరిగి గర్భగుడికి తీసుకొచ్చి శ్రీసీతారామచంద్రస్వామివారికి చూపించారు. యాగశాలలో గరుడాదివాసం, గరుడ జపం, గరుడ హోమం, మహాకుంభ ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు కనుల పండువగా నిర్వహించారు. కాగా, శుక్రవారం అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, బలిహరణం, హన్మంతవాహనంపై తిరువీధిసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో తాళ్లూరి రమేష్‌బాబు తెలిపారు.

346
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles