దివ్యాంగులకు సౌకర్యాలు భేష్..

Fri,April 12, 2019 01:07 AM

ఖమ్మం వ్యవసాయం : పార్లమెంట్ ఎన్నికలలో దివ్యాంగుల కోసం కల్పించిన సౌకర్యాలు సత్ఫలితాలను ఇచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో దివ్యాంగులు ఓటింగ్‌లో ఉత్సాహం, ఆసక్తితో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గత నెల రోజుల నుంచి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఓటు నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఇందు కోసం స్వయంగా దివ్యాంగులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా వారితో ర్యాలీలు సైతం నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో స్వయంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్ సైతం పాల్గొనడం జరిగింది. ఏఏ పోలింగ్ బూత్‌లలో ఎంతమంది ఉన్నారో ముందుగానే వివరాలు సేకరించిన అధికారులు, అందుకు అనుగుణంగా అంగన్‌వాడీ ఆయాలు, ఆశా కార్యకర్తలు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను నియమించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దివ్యాంగ ఓటర్లు 31,255 మంది ఉన్నారు. వీరికి తోడు గర్భిణీ, వృద్ధులు మరో 50వేలకు పైగానే ఉన్నారు.

పోలింగ్ బూత్‌లకు స్వయంగా రాలేని దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేశారు. ఉచిత రవాణ సౌకర్యం, తమ కోసం ప్రత్యేక సహాయకులను ఏర్పాటు చేయడం పట్ల దివ్యాంగులు, వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో దివ్యాంగులకు అందుతున్న సేవలు స్వయంగా పర్యవేక్షణ చేసేందుకుగాను జిల్లా స్త్రీ శిశు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి ఆర్ వరలక్ష్మీ పర్యవేక్షణ చేశారు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్బంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి దివ్యాంగ ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి అమలు చేయడం జరిగిందన్నారు.

219
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles