నేడే పోలింగ్..

Thu,April 11, 2019 12:35 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్త్తయ్యాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. అంతకు గంట ముందు మాక్ పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది, ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ స్టేషన్‌లకు తరలివెళ్లారు. వారికి కేటాయించిన ఎన్నికల సామగ్రి, ఈవీఎంలను వెంట తీసుకుని ప్రత్యేక బస్సులలో పోలింగ్‌స్టేషన్‌కు వెళ్లారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 23 మంది పోటీ చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేంద్ర పారామిలటరీ దళాలు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో 15లక్షల 13వేల 94 మంది ఓటర్లు ఉండగా, వీరిలో మహిళా ఓటర్లు అత్యధికంగా 7లక్షల 73వేల 503 మంది కాగా 7లక్షల 39వేల 525 మంది పురుష ఓటర్లు 66 మంది ఇతరులు, 715 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 35,485,80 సంవత్సరాలపైబడిన వయోవృద్ధ ఓటర్లు 14,799, గర్భవతి ఓటర్లు 5,392, బాలింతలు 5,730 ఓటర్లు ఉన్నారు.

7 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 1,798 పోలింగ్ కేంద్రాలు, 955 లోకేషన్లు, 171 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగ ఓటర్లకుగాను 1,112 వీల్‌చైర్లను ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. 4,340 బ్యాలెట్ యూనిట్లు, 2,143 కంట్రోల్ యూనిట్లతో పాటు 2,266 వీవీప్యాట్‌లను వినియోగిస్తున్నారు. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున నోటాతో కలిపి 24 మంది అభ్యర్థులకు రెండు బ్యాలెట్ యూనిట్‌లను వినియోగిస్తున్నారు. మొత్తం 157 రూట్లకు సెక్టోరల్ అధికారులను కేటాయించడంతో పాటు 267 మంది సూక్ష్మ పరిశీలకులను వినియోగిస్తున్నారు, 461 కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్, 960 కేంద్రాలలో ఆఫ్‌లైన్ రికార్డింగ్, 887 కేంద్రాలలో వీడియోగ్రాఫీ ప్రక్రియను చేపట్టారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు గాను 7,930 మంది సిబ్బందిని కేటాయించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇప్పటికే 11,200 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలటరీ దళాలతో పాటు, పోలీసు బలగాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లను సమగ్ర ప్రణాళికతో సిబ్బందిని కేటాయించారు. గ్రామాలలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. పోలీంగ్ కేంద్రానికి వంద మీటర్ల ఆంక్షలకు లోబడి ఉండాలని ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైన ఈవీఎంలు మొరాయిస్తే ప్రత్యామ్నాయంగా వినియోగించుకునేందుకు అధిక సంఖ్యలో ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు.

దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు..
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో నేడు జరిగే ఎన్నికల్లో 35,485మంది దివ్యాంగ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ బూతుకు వెళ్లి ఓటు వేసే సమయంలో దివ్యాంగులు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. జిల్లాలో దివ్యాంగ ఓటర్లకు గాను 1112 వీల్‌చైర్స్‌ను ఏడు నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంచారు. వీరు నేరుగా పోలింగ్ బూతుకు వెళ్లి ఓటు వేయవచ్చు. ఇంటి వద్ద నుంచి దివ్యాంగులను పోలింగ్ స్టేషన్‌కు తీసుకువచ్చేందుకు అధికారులు ఉచిత వాహనాలను సిద్ధం చేశారు. వీరి కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. వికలాంగులు త్వరగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

మొత్తం 1,798 పోలింగ్ స్టేషన్‌లు..
జిల్లావ్యాప్తంగా 1,798 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో 324, పాలేరులో 274, మధిరలో 255, వైరాలో 232, సత్తుపల్లిలో 280, కొత్తగూడెంలో 253, అశ్వారావుపేటలో 183 పోలింగ్‌స్టేషన్‌లు ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని పోలింగ్ సిబ్బంది ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల ఆవరణ నుంచి ఎన్నికల సామగ్రిని, ఈవీఎంలను తీసుకుని పోలింగ్ స్టేషన్‌లకు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

12 రకాల కార్డులలో ఏ ఒక్కటి ఉన్నా చాలు..
ఓటరు స్లిప్‌తో పాటు ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో పోలింగ్ కేంద్రానికి తీసుకొని రావాలి. భారత ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డులు ఓటరు గుర్తింపు (ఎపిక్) కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, పాస్‌బుక్, పాన్‌కార్డు, స్మార్ట్‌కార్డు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు, ఆరోగ్యబీమా పథకం స్మార్ట్‌కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, పార్లమెంట్, శాసనసభ మండలి, శాసనసభ్యులు అధికార గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డును ఫొటో ఓటరు స్లిప్పులతో పాటు ఓటరు ఓటు వినియోగించుకునే సమయంలో తమతో కలిగి ఉండాలి. పైన తెలిపిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా పోలింగ్ అధికారులకు చూపించాలి.

రూ. 23,22,060 నగదు పట్టివేత..
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తీసుకువెళ్తున్న నగదును పట్టుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 23లక్షల 22వేల 60 సీజ్ చేశారు. దీంతో పాటు 14 లక్షల 60వేల 108 లీటర్లు మద్యంను, 72 బెల్ట్ షాపులను సీజ్ చేశారు. 252 బైండోవర్ కేసుల్లో 11,200 మందిని బైండోవర్ చేశారు. లైసెన్సుడ్ అయుధాలు డిఫాజిట్ చేశారు.

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్
పాల్వంచ రూరల్: పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి దేవాలయాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ బుధవారం దర్శించుకుని పూజలు చేశారు. తొలుత అర్చకులు కమిషనర్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయం తరుపునుంచి అర్చకులు కమిషనర్‌కు ఆశ్వీరవచనాలు పలికి శేష, వస్త్ర, ప్రసాదాలను అందజేశారు. వీరివెంట ఉప కమిషనర్ టీ.రమేష్‌బాబు ఉన్నారు. శ్రీదేవి వసంత నవరాత్రి ఉత్సవాలు బుధవారానికి ఐదోరోజుకు చేరుకున్నాయి. బుధవారం అర్చకులు అమ్మవారికి నిత్యపూజలతో పాటు ప్రత్యేకమైన లక్షకుసుమార్చన ఘనంగా నిర్వహించారు. వసంతరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఈవో శ్రీనివాస్, చైర్మన్ కోడిబాలశౌరి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

265
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles