కేసీఆర్ పథకాలే శ్రీరామ రక్ష..

Wed,April 10, 2019 01:02 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలకు సుపరిచితుడు, అందరికీ తెలిసిన వ్యక్తి, అన్నా... అని పిలిస్తే ఆదుకునే సహృదయుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రముఖ వ్యాపారవేత్తగా పరిచయం ఉన్న రవి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని, కుల, మతాలకు అతీతంగా అందరితో ఆప్యాయంగా ఉంటారని పేరుంది. అలాంటి నాయకుడు రెండు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే విషయం ఆ ఎన్నికల్లో నిరూపితమైంది. దీంతో వద్దిరాజు ప్రజా అభిప్రాయం మేరకు నడుచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంలో పాలుపంచుకునే ఉద్దేశ్యంతో గులాబీ గూటిలో చేరారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో ఉన్న తన అనుచరులు, అభిమానులందరూ ఆయనతో కలిసి అడుగులో అడుగు వేసేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో ఖమ్మం, వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచార పర్వంలో దిగారు. ఈ క్రమంలో వద్దిరాజు రవిచంద్రతో నమస్తే తెలంగాణ ముఖాముఖి....

నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులు కావాడానికి గల కారణాలు ఏమిటి?
వద్దిరాజు : నా రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ పార్టీతో జరిగిన మాట వాస్తవమే. కాంగ్రెస్‌ను జనం ఆదరించే పరిస్థితిలేదు. కారణం.. ఇదే విషయం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. ఈ పరినామామం నాలాంటి నూతన రాజకీయనాయకులకు ఇబ్బంది కరమే. నేను పోటీచేసిన వరంగల్ తూర్పులో గెలిచిన అభ్యర్థి తరువాత స్థానం దక్కడం ప్రజలకు నామీదున్న అభిమానానికి నిదర్శనం కాగా రాష్ట్రంలో ప్రజలందరూ టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారు. ఆ పార్టీలోకి వెళ్లకపోతే గ్రామాల్లో జనాలు, నాయకులను నిలదీస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కృషి పట్టుదల, దూరదృష్టి, కార్యసాధన తీరు నన్ను ఆకర్శించింది. 14 ఏండ్లు తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిన తీరు, తెలంగాణను సాధించి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపిన తీరు నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అందుకే నేను కూడా టీఆర్‌ఎస్‌లో భాగస్వామినై కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాను.

నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ మీపై ఉంచిన బాధ్యతేమిటి.?
వద్దిరాజు : పెద్దసారు సీఎం కేసీఆర్ అశీర్వాదం.. యువనేత రామన్న (కేటీఆర్)ల ప్రోత్సాహం.. వల్లే నేను టీఆర్‌ఎస్‌లో చేరాను. కీలకమైన ఎన్నికల తరుణంలో పెద్దలు కేసీఆర్ నాకు గులాబీ కండువా కప్పారు. నాపై పెద్ద బాధ్యత పెట్టారు. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలలో బీసీలు, దళితులు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలను నాకున్న సంబంధాలు, క్యాడర్, పరిచయాలతో పార్టీ అభ్యర్థుల గెలుపుకుదోహదపడాలని అధినేత కేసీఆర్ ఆదేశించారు. టీఆర్‌ఎస్ సుప్రీం సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్యూచర్ ఆఫ్ తెలంగాణ యువనేత రామన్న (కేటీఆర్) ప్రోత్సాహంతో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం.

నమస్తే తెలంగాణ : కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం ఏమిటి.?
వద్దిరాజు : ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోని రికార్డు సాధించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను అనేక రాష్ర్టాలు పేరు మార్చి కాపీ కొడుతున్నాయి. సంక్షేమ పథకాలన్ని ప్రజలకు చేరుతున్నాయి కనుకనే తెలంగాణ ప్రజలు రెండవసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారు. అది కూడా అత్యధిక మెజార్టీని అందించారు. ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్‌లు రాకుండా చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి వేగంగా జరుగుతుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జట్‌స్పీడ్ వేగంతో ముందుకు సాగుతుంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండు కళ్లలా కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఆయన అభివృద్ధిలో పాలుపంచుకునే లక్ష్యంతోనే టీఆర్‌ఎస్‌లో చేరడం జరిగింది. కేసీఆర్ పథకాలు అద్బుతమైనవి.

నమస్తే తెలంగాణ : ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఏమిటి?
వద్దిరాజు : ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను. ఆ ఉద్దేశ్యంతోనే గులాబీ పార్టీలో చేరాను. కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ అభివృద్ధికి కృషి చేస్తా. బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా కొనసాగుతాను. ఇప్పటికే వేల కోట్లతో రెండు జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సాగునీటి రంగ అభివృద్ధికి కేసీఆర్ వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఉదహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం ఒక అద్భుతం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతుల ఆశలు పూర్తిగా ఫలిస్తాయి. రెండు పంటలు సాగు చేసుకోవచ్చు. దీనితో పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి పుష్కలంగా మంచినీళ్లు అందుతాయి.

నమస్తే తెలంగాణ : రెండు జిల్లాలోని మీ అభిమానులు టీఆర్‌ఎస్‌లో ఎప్పుడు వస్తున్నారు.?
వద్దిరాజు : ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఉన్న నా అభిమానులు, నా అనుచరులు మొత్తం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వారి అభిప్రాయం మేరకే నేను చేరాను. ఎన్నో ఏండ్ల నుంచి నా వెంటే ఉన్న ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ వ్యాపారులందరూ టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి వరంగల్‌లోని అనేక ప్రాంతాలలో ఉన్న నా అనుచరులందరూ టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా నామా నాగేశ్వరరావు విజయానికి శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలోని టీఆర్‌ఎస్ అభ్యర్థులు అఖండ మెజార్టీతో భారీ విజయం సాధిస్తారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. నా భవిష్యత్ మొత్తం టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతుంది. సీఎం కేసీఆర్ ఏది ఆదేశిస్తే అదే చేస్తాను.

నమస్తే తెలంగాణ : నామా మెజార్టీతో ఎంత రావచు?
వద్దిరాజు : ఖమ్మం లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు దాదాపు లక్ష ఓట్లపైగా మెజార్టీని సాధిస్తారు. నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన ఓట్లు అన్ని టీఆర్‌ఎస్‌కే పోల్ అవుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ప్రజలు ఓట్లు వేస్తారు. మరో 5 ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారు కనుక జిల్లాలో జరిగే అభివృద్ది ముందుకు పోవాలన్నా, సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా టీఆర్‌ఎస్ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని ప్రజలను కోరుతున్నా. మనకు మేలు చేసే నాయకులను గెలిపించుకుంటే ప్రజలకు సేవ చేస్తారు. స్థానికంగా ఉండని వ్యక్తులకు ఓట్లు వేస్తే వాటి వల్ల ఏమి ఉపయోగం ఉంటుందో ప్రజలు ఆలోచించాలి. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసే నామాను గెలిపించుకోవాలి.

314
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles