4న సీఎం కేసీఆర్ రాక..

Sun,March 24, 2019 12:41 AM

- సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ
- శ్రేణులను సిద్ధం చేస్తున్న టీఆర్‌ఎస్
- కనీవినీ ఎరగనిరీతిలో జనసమీకరణ
- నామా గెలుపే ధ్యేయంగా ప్రణాళిక

ఖమ్మం, నమస్తే తెలంగాణ : రాజకీయ రణరంగం ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ నామినేషన్ల దాఖలకు ఒక్క రోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ తరుపున ఖమ్మం లోక్‌సభ నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీలో నిలుస్తారో తెలియలేదు. రేణుకచౌదరికి టికెట్టు ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన కొందరు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్‌లలో జరిగిన బహిరంగ సభలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5.30గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ పీజీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగసభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం మహబూబాబాద్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొని సాయంత్రానికి ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా ఈ బహిరంగసభ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని 7శాసనసభ నియోజకవర్గాల నుంచి కనీవినీ ఎరగని రీతిలో జన సమీకరణ చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. ఖమ్మం, మహాబూబాబాద్ పార్టమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఖమ్మంలో వైసీపీ, మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలుచుకున్నాయి. ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాల్లో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో రెండు స్థానాలు ఆ పార్టీ ఖాతాలోకి వచ్చాయి. మరో కొద్ది రోజుల్లో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం, మహాబూబాబాద్ స్థానాలను గెలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాన్ని రచించారు. ఈ నేపథ్యంలోనే యువనేత, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఖమ్మం, మహాబూబాబాద్ రావాల్సి ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున కేటీఆర్ పర్యటన వాయిదా వేయడం జరిగింది.

భారీ జనసమీకరణ...
ఖమ్మంలో ఏప్రిల్ 4న నిర్వహించే బహిరంగసభను అత్యంత కీలకంగా నాయకులు బావిస్తున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ జన సమీకరణ చేయాలని నాయకులు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాపై ఉన్న అభిప్రాయాన్ని మార్చే దిశగా బహిరంగ సభను నిర్వహించాలని జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒకే స్థానాన్ని మాత్రమే టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మిగిలిన 9చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఖమ్మం జిల్లాలోని 5నియోజకవర్గాలలో ఖమ్మంలో మాత్రమే పువ్వాడ అజయ్‌కుమార్ గెలుపొందారు. ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో వైరా నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములు నాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే విధంగా పాలేరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, సత్తుపల్లి నుంచి గెలుపొందిన తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరుపున గెలుపొందిన వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలో మధిర, అశ్వారావుపేట మినహ 5నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నందున ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలుపు నల్లేరుపై నడకల ఉండనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 4వ తేదీన ఖమ్మం వస్తునందున టీఆర్‌ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సహంతో కథన రంగంలోకి దూకుతున్నారు.

నియోజకవర్గాలలో సన్నాహక సమావేశాలు...
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఖమ్మం లోక్‌సభకు పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ పరిధిలోని అన్ని కేంద్రాలలో సన్నాహక సమావేశాలను నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం ఖమ్మం నియోజకవర్గ సమావేశం నిర్వహించగా ఆదివారం పాలేరు నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ తరువాత కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాలలో కూడా ఈ సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పరుగులు పెడుతున్నారు. సీఎం పాల్గొనే సభను విజయవంతం చేసి ఖమ్మం జిల్లా ఖ్యాతిని చాటేలా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.

436
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles