వైద్యవృత్తి అత్యంత పవిత్రమైనది

Sun,March 24, 2019 12:38 AM

ఖమ్మం క్రైం, మార్చి 23 : వైద్యవృత్తి అత్యంత పవిత్రమైనదని, అటువంటి వైద్యవిద్యను పూర్తిచేసి సమాజంలోకి అడుగుపెడుతున్న మీరు మంచి వైద్యులుగా పేరు తెచ్చుకొవాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మమత వైద్య కళాశాలలోని పువ్వాడ ఆడిటోరియంలో నిర్వహించిన మెడికల్, డెంటల్, నర్సింగ్ కశాశాలలు సంయుక్తంగా నిర్వహించిన స్నాతకోత్సవ, స్పోర్ట్స్‌డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. ఉదయం 11గంటలకు కళాశాల ఆడిటోరియంకు చేరుకున్న ఆయన తొలుత వైద్యవిభాగ గ్రాడ్యుయేట్లు, పీజీల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జరిగిన వైద్య డిగ్రీపట్టాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్నీ రంగాలలో కెల్లా వైద్యరంగం అత్యంత మహోన్నతమైనదని, ఎంతో కృషి పట్టుదలతో మాత్రమే దీనిని సాధించగలమన్నారు.వైద్యరంగ ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు ప్రతి విద్యార్ధి తప్పక కృషిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ రోజు వైద్యవిద్య పూర్తిచేసుకుని పట్టాలు పొందుతున్న విద్యార్ధుల జీవితంలో ఎంతో అమూల్యమైన రోజుగా ఆయన అభివర్ణించారు. డాక్టర్ కోర్సు పూర్తిచేసుకున్నాం...ఇక అంతా అయిపోయిందనుకోవడం పొరపాటు అవుతుందన్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని పూర్తిచేశారని, ఇప్పుడు వాటిని విస్తరించే దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. చదువుకున్న చదువు నేర్చుకున్న వైద్యం సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం, వైద్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను తెలుసుకుంటూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల కల నేరవేర్చిన వారిగా మిగిలిపోతారని, ఇక్కడితో ఆగకుండా నిరంతర విద్యార్ధిగా కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు వివిధ అంశాలపై పరిశోధనాత్మక ప్రయోగాలు నిర్వహించి కొత్త ఒరవడిని సృష్టించాలన్నారు.

ఏ విషయాన్ని అయినా క్షుణ్నంగా తెలుసుకున్నప్పుడే అయా విషయాలపై స్పష్టత వస్తుందన్నారు.రానున్న కాలంలో వైద్యరంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని వాటిని సైతం సులువుగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అనంతరం మమత వైద్యవిద్యా సంస్ధల చైర్మెన్ పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ...సమాజానికి ఎంతో విలువైన, అమూల్యమైన వైద్యులను అందించే అదృష్టం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.గత 20 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్ధానంలో వేల మంది వైద్యులను మమత వైద్యవిద్యా సంస్ధలు సమాజానికి అందించాయన్నారు.ప్రస్తుతకాలంలో వైద్యుల కొరత ఉందని మంచి సమాజనిర్మాణంలో కీలకపాత్ర పోషించేది తప్పకుండా వైద్యులేనన్నారు. మమత వైద్యవిద్యాసంస్థల నుంచి అనేక మంది వైద్యవిద్యను పూర్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా వైద్యసేవలను అందిస్తున్నారన్నారు. అందుకు మీ వంతు కృషిగా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత తీసుకుని ముందుకుసాగాలన్నారు.అనంతరం 352 మంది పట్టభద్రులకు డాక్టరేట్‌లను ప్రధానం చేశారు.పీహెచ్‌డీలు-2, యండీలు-20, యంబీబీఎస్-153, బీడియస్-94, పీజీ (యండీ,డెంటల్)-23, నర్సింగ్-60, మొత్తం 352 మందికి పట్టాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మమత విద్యాసంస్థల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు, సంస్థ డైరెక్టర్లు పువ్వాడ జయశ్రీ, మెడికల్, డెంటల్, నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపల్‌లు జయశ్రీ, వెంకటేశ్వరరావు, రత్నకుమారీ ఫిలిప్, వైస్ ప్రిన్సిపల్ బండారిపల్లి నవీన్‌కుమార్, డాక్టర్ అనురాధ, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ వినయ్‌కుమార్‌రెడ్డి, మమత డిప్యూటీ సూపరిండెంట్ భాగం కిషన్‌రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తా..

ఖమ్మం ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎన్నో పోరాటాలు, త్యాగాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ పాలనను మెచ్చి ఆయనతో కలిసి నడిచేందుకే టీఆర్‌ఎస్‌లో చేరానని, సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఖమ్మంలోని టీఆర్‌ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎంపీగా పని చేసిన సమయంలో ఖమ్మం జిల్లా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశానని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా పనిచేశానన్నారు. బయ్యారం స్టీలుప్లాంట్, కొవ్వూరు రైల్వే లైన్‌ను తన హయాంలోనే సాధించుకున్నామన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వల్లే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని నామా స్పష్టం చేశారు. అందరి వారిగా ఉంటానని, మళ్లీ ఒకసారి అవకాశం ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో తనకు భాగస్వామ్యాన్ని కల్పించాలని నామా కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని ఒక నెల నా కోసం కష్టపడితే 5 ఏండ్లు ప్రజలందరిని కాపాడుకుంటానని, అందరికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని, అంతా కేసీఆర్ గ్రూపేనని, సీఎం డైరెక్షన్‌లోనే ముందుకు వెళ్తామన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ, ఖమ్మం జిల్లా అభివృద్ధిలో భాగస్వామిగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో అందరినీ కలుపుకుని ఐకమత్యంతో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

కేసీఆర్‌తోనే దేశ రాజకీయాలలో మార్పు..
తెలంగాణ బిడ్డగా 15వ లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొదటిగా తానే ఓటు వేశానని, ఆనాడు టీఆర్‌ఎస్‌కు ఇద్దరే ఎంపీలు ఉన్నప్పటికీ వారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పోరాడారన్నారు. తాను కూడా లోక్‌సభలో తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, తాను చేసిన కృషిని ఆనాడు సీఎం కేసీఆర్ దగ్గరుండి చూశారన్నారు. దేశ రాజకీయాలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న రాజకీయ శక్తులకు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం దేశంలో ఉందని, అది కేసీఆర్ వలనే సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కేసీఆర్‌కు ఉన్న విజన్‌తో ముందుకు వెళ్తే దేశం అగ్రగామిగా నిలుస్తారన్నారు. 16 ఎంపీ స్థానాలను గెలవడం ఖాయమని, ఖమ్మంలో మంచి మెజార్టీ సాధించుకోవాలన్నారు. తెలంగాణ రాకముందు సాగునీటి కోసం ఎంతో కష్టపడ్డామని, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.

అత్యధిక మెజార్టీతో నామాను గెలిపించాలి..: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన చారిత్రత్మక అవసరం ఉందని, దానికి అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ నిర్ణయాన్ని పెద్దఎత్తున సమర్థిస్తున్నామని, ఖమ్మం ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తామన్నారు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో ముఖ్య నాయకులమందరం సమావేశమై ప్రచార పర్యటనలు, నియోజకవర్గాలస్థాయిలో సమావేశాలు, నామినేషన్ తదితర అంశాలను చర్చించడం జరిగిందన్నారు. ప్రతీ కార్యకర్త పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి బూత్‌లో మెజార్టీ రావాలని, ఖమ్మం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ సాధిస్తామని పువ్వాడ అన్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులుండరని, ఎన్నికల వరకే రాజకీయాలని, శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో వివిధ పార్టీ నుంచి గెలుపొందిన అనేక మంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతమైనవారని, ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వచ్చే మెజార్టీ కంటే ఖమ్మంలో అత్యధికంగా రావాలన్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామన్నారు.

నామా గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..: నూకల నరేష్‌రెడ్డి, తాతా మధు
పార్లమెంటు ఎన్నికల్లో నామా గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తామని టీఆర్‌ఎస్ ఖమ్మం లోక్‌సభ ఇంచార్జీ నూకల నరేష్‌రెడ్డి అన్నారు. జిల్లా రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ అన్ని విషయాలను అర్థం చేసుకుని, వివిధ సర్వేలు, ఓటర్ల మనోభావాలు, ఖమ్మం జిల్లా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నామా నాగేశ్వరరావును ఎంపిక చేశారన్నారు. గతంలో ఎంపీగా పని చేసిన నామా జిల్లా ప్రజలకు సుపరిచితుడేనని, సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో కొనసాగుతున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. అన్ని విధాలుగా ఆలోచించి నామాను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని, ఆయన ఘన విజయం సాధించేలా కృషి చేస్తామని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు అన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను మెచ్చి 89 సీట్లలో గెలిపించారని, ఖమ్మం జిల్లాలోనే ఫలితాలు భిన్నంగా వచ్చాయన్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం ఖమ్మం జిల్లాలో మహాకూటమి తరుపున గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. తద్వారా ఖమ్మం పార్లమెంటు పరిధిలో బలమైన పార్టీగా టీఆర్‌ఎస్ అవతరించిందన్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ అనేక ఘనవిజయాలు సాధిస్తుందన్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ.. నామాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన గెలుపు నల్లేరు మీద నడకేనన్నారు. ఖమ్మం నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, అన్ని నియోజకవర్గాల కంటే వైరా నియోజకవర్గం నుంచి అత్యధిక కృషి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశ రాజకీయాలలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పాలన, అభివృద్ధిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక మార్పు సాధించారని, ఈ నేపథ్యంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం అవసరమన్నారు. దేశ పరిపాలనా విధానంలో మార్పులు రావడానికి టీఆర్‌ఎస్ కారణమవుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం మేయర్ జీ. పాపాలాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, మధిర నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు లింగాల కమల్‌రాజు, బొమ్మెర రామ్మూర్తి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, తుళ్లూరి బ్రహ్మయ్య, బెల్లం వేణుగోపాల్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, జలగం రామకృష్ణ, బిచ్చాల తిరుమలరావు, ఇంటూరి శేఖర్, తాళ్లూరి సృజన్ తదితరులు పాల్గొన్నారు.

202
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles