కేసీఆర్ ఆదేశమే.. శిరోధార్యం

Sun,March 24, 2019 12:37 AM

ఖమ్మం, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఏది చెప్పితే అది చేయడమే నా కర్తవ్యమని పార్టీ ఆదేశమే శిరోధార్యమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును నియమించానని, ఆయన గెలుపు కోసం పనిచేయాలని చెప్పారని, నామా గెలుపు చారిత్రాత్మక అవసరమని ఆయన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఖమ్మంలోని రోటరీనగర్‌లోని అజయ్‌క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించి మాట్లాడారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆరు నియోజకవర్గాల కంటే ఖమ్మం నియోజకవర్గంలోనే నామాకు అత్యధిక మెజార్టీని సాధించాలని ఆ దిశగా ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేసినప్పుడే సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరుతుందని ఎమ్మెల్యే పువ్వాడ అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని ఓటర్లు చైతన్యవంతులని, ఉద్యోగులు, వ్యాపారులు అధికంగా ఉన్నారన్నారు. పోలింగ్ శాతం తక్కువ అయ్యే అవకాశం ఉన్నందున ప్రతీ కార్పొరేటర్, సర్పంచ్, ఎంపీటీసీలు, బూత్ కన్వీనర్లు ప్రతీ ఓటరును కలిసి కారు గుర్తుకు ఓటు వేసేలా అభ్యర్థించాలన్నారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, అప్పుడే మనపై సీఎం పెట్టుకున్న నమ్మకం నెరవేరుతుందన్నారు. రాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాల్లో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ రావాలన్నారు. లోక్‌సభ పరిధిలోని 7 నియోజకవర్గాలలో ముందుగా ఖమ్మంలోనే సన్నాహక సమావేశం జరగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

సీఎం మాటను నిలబెట్టాలి: తుమ్మల
గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పోయిన పరువుని, పోయిన మర్యాదను కాపాడుకోవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారానే సాధ్యమవుతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తన 35 ఏండ్ల రాజకీయ కష్టాన్ని మొత్తం నామా గెలుపునకు ఉపయోగిస్తామని తుమ్మల అన్నారు. ఖమ్మంలో గెలిచింది ఒక్కరైనా చాలా మంది పార్టీలో చేరారన్నారు. ఖమ్మానికి నామా నాగేశ్వరరావు సరిపోతారని కేసీఆర్ నిర్ణయించారన్నారు. సమయం తక్కువగా ఉన్నందున్న ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని తుమ్మల పిలుపునిచ్చారు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరని, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అన్నారు. అన్ని పార్టీలకు బలం ఉన్న జిల్లా కావడం వల్ల నష్టం జరిగిందని, అవకాశం వచ్చిన ప్రతీసారి టీఆర్‌ఎస్ బలాన్ని పెంచేందుకు కృషి చేశానన్నారు. సొంతగా గెలవలేని పార్టీలన్ని ఏకమయ్యాయని, ఓటమికి ఎవరిని తప్పు పట్టవద్దని నాదే పూర్తి బాధ్యత అని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో నామాకు మెజార్టీ రావాలన్నారు. తెలంగాణలోని 16ఎంపీ స్థానాలను గెలుచుకుంటే ఢిల్లీ మెడలను వంచి నిధులను రాబటవచ్చు అని తద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు. ఓడిపోయినంత మాత్రాన జిల్లా అభివృద్ధి వెనుకబడి ఉండవద్దని, జిల్లా ప్రజలు ఆశలు వమ్ముకావదని తుమ్మల అన్నారు. ఏ స్థానంలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ టర్మ్‌లోనే పూర్తి చేసి జిల్లా ప్రజలను మెప్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి దగ్గర పోయిన గౌరవం, మర్యాదను తిరిగి కాపాడుకుంటామన్నారు. నామా గెలుపు జిల్లా ప్రజల గెలుపుకావాలని తుమ్మల అన్నారు.

అందరికీ అందుబాటులో ఉంటా: నామా
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అందరివాడిగా అందరికీ అందుబాటులో ఉంటానని నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిడ్డగా, రైతు బిడ్డగా తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఎన్నికలలో తనకు అవకాశం ఇచ్చారని, కొన్ని అనివార్య పరిస్థితుల వలన సద్వినియోగం చేసుకోలేదన్నారు. ఇప్పుడు మళ్లీ అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాధాలు తెలుపుతున్నానన్నారు. ముఖ్యమంత్రి పిలిచి అజయ్ ఒక్కడే ఖమ్మం నియోజకవర్గంలో 50వేల మెజార్టీ తెస్తాడని చెప్పాడని, 2009 ఎన్నికల్లో రేణుకచౌదరిపై గెలిచినప్పుడు కూడా ఖమ్మం నియోజకవర్గం నుంచే అత్యధిక మెజార్టీ వచ్చినందునే అప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం వచ్చిందన్నారు. ఇప్పుడు ఖమ్మంలో మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వచ్చే మెజార్టీ కంటే ఖమ్మంలో అత్యధిక మెజార్టీ వచ్చేలా ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో దాదాపు 2 లక్షల 60 వేల దరఖాస్తులను పరిష్కరించామన్నారు. అప్పుడున్న పరిస్థితులకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను గెలుచుకుని కేసీఆర్ కోరిక నెరవేర్చాలని నామా అన్నారు. అనంతరం నామాను ఎమ్మెల్యే అజయ్‌కుమార్ సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. సమావేశంలో టీఆర్‌ఎస్ లోక్‌సభ ఇన్‌చార్జి నూకల నరేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మాజీ ఏఎంసీ చైర్మన్ గుండాల కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఖమ్మం మేయర్ జీ పాపాలాల్, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, తుళ్లూరి బ్రహ్మయ్య, ఖమ్మం కార్పొరేషన్ కార్పొరేటర్లు, రఘునాథపాలెం మండల టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

265
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles