కేటీఆర్ సమక్షంలో చేరిన నామా..

Fri,March 22, 2019 01:39 AM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గురువారం మధ్యాహ్నం హైదబాద్‌లోని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వగృహంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ కండువా కప్పి నామాను పార్టీలోకి చేర్చుకున్నారు. కేటీఆర్‌తో పాటు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఉన్నారు. గులాబీ కండువాలను అజయ్ అందించగా టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులకు కేటీఆర్ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వనించారు. నామాతో పాటు టీడీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ మద్దినేని బేబీ స్వర్ణకుమారి, రాష్ట్రపార్టీ ఉపాధ్యక్షుడు ఎం అమర్‌నాథ్‌బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లూరి రమాదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి అనూషారామ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొడ్డేటి మధవరావు, ఖమ్మం కార్పొరేషన్ కన్వీనర్ చిత్తారు సింహాద్రియాదవ్, తెలుగు యువత జిల్లా ప్రెసిడెంట్ గొల్లపూడి హరికృష్ణ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు.

జిల్లాలో టీడీపీ ఖాళీ..
ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కోల్పోయింది. ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని నాయకులుగా చలామని అయిన తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావులు ఆ పార్టీని వీడటంతో చుక్కాని లేని నావలా టీడీపీ తయారైంది. 2014 ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరడంతోనే జిల్లాలోని టీడీపీలో ఉన్న ప్రధాన నాయకత్వం, ప్రజాప్రతినిధులు గంపగుత్తగా గులాబీ గూటిలో చేరారు. తుమ్మలతో పాటు అపట్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్‌బాబులతో పాటు అనేక మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఎంపీటీసీలు, సోసైటీ డైరెక్టర్లు తుమ్మలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరి చేరిక తరువాత ఆ పార్టీకి నామా నాగేశ్వరరావు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. గత ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను నామా నాగేశ్వరరావు చక్కదిద్దారు. కాస్తోకూస్తో ఉన్న క్యాడర్ కూడా నామాను ఆధారంగా చేసుకుని ఉన్నావారే.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి తరుపున ఖమ్మం శాసనసభ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ చేతిలో ఘోరపరాజయం చెందారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి తరుపున సత్తుపల్లిలో పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే గెలుపొందారు. ఎన్నికల తరువాత రెండు నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ వెంటనే నామా కూడా టీడీపీకి రాజీనామ చేయడం, కారు ఎక్కడం చకచక జరిగిపోయాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లాలో ఆనవాళ్లను కోల్పోయింది.

309
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles