సప్తవర్ణ శోభితం..

Fri,March 22, 2019 01:39 AM

ఖమ్మం కల్చరల్: రంగుల పండుగ సప్తవర్ణ శోభితం చేసింది.. వసంతోత్సవం, కాముని పున్నమి జిల్లా అంతటా ఆనందవర్ణాలు విరబూసింది.. అంతా రంగులమయమైంది.... వేనవేల ఇంద్రధనుస్సులు రంగుల రూపంలో విరజిమ్మాయి.. ఏడు రంగులు అనేక మిశ్రమాలతో ఆడుకున్నాయి.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆ రంగులను చల్లుకోవడంలో, పూసుకోవడంలో ఆనందాన్ని పంచుకున్నారు. జీవితంలోని అనేక అనుభూతుల మిశ్రమంగా హోలీ పండుగ ప్రతీకగా నిలిచి ఆనందమయం చేసింది. హోలీర రంగ హోలీ.. చమ్మ కేళీల హోలీ.. అంటూ చిన్నాపెద్దా అందరూ రంగులతో ఆనందోత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. వసంత కాలానికి స్వాగతంగా వసంతోత్సవంగా, హోలికా పూర్ణిమగా, కాముని పున్నమిగా, డోలికా ఉత్సవంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుంటూ యువతీ, యువకులు కేరింతలు కొట్టారు.. మహిళలు సైతం రోడ్లెక్కి సంబురాలు జరుపుకున్నారు.. పాల్గుణ శుద్ధ పౌర్ణమి గురువారం జిల్లావ్యాప్తంగా హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

బుధవారం అర్ధరాత్రి జిల్లావ్యాప్తంగా పలు కూడళ్లల్లో కాముడి దహనం చేశారు. మనిషిలోని కామాన్ని దహించడానికి ప్రతీకగా కామదహనం చేసి గురువారం ఉదయం నుంచి హోలీ వేడుకలు ప్రారంభించారు. ఖమ్మంతోపాటు మధిర, సత్తుపల్లి, పాలేరు, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వాడవాడలా ఈ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. వర్ణాలు, కులాలు, మతాలకు అతీతంగా నిర్వహించుకున్న ఈ హోలీ వేడుకలు మానవీయ సంబంధాలను మరింత పెంచాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలన్నింటికీ సెలవు రావటంతో ఇంటిల్లిపాది హోలీ వేడుకల్లో మునిగితేలారు. ప్రధానంగా యువతులు, మహిళలు వారివారి వాడల్లో రోడ్లమీదకు వచ్చి రంగులు పూసుకుంటూ నృత్యాలు చేయటం విశేషం. యువకులు ద్విచక్ర వాహనాలపై కేరింతలు కొడుతూ రంగులతోపాటు కోడి గుడ్లను తలలపై పగుల కొట్టుకుంటూ ఉత్సాహపూరిత వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు.

ఖమ్మం నగరంలోని పలు డివిజన్ల వాసులు, ప్రధానంగా మార్వాడీ మహిళలు రంగులను చల్లుకుని ఉత్సాహంతో నృత్యాలు చేశారు. ఖమ్మం నగరంలో టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలు బాణోతు చంద్రావతి స్వగృహం వద్ద తన కుటుంబ సభ్యులతోపాటు, మామిళ్లగూడెంలోని వాసులతో రంగులను చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. అదేవిధంగా 16వ డివిజన్‌లో కార్పొరేటర్ కమర్తపు మురళి ఆధ్వర్యంలో అత్యంత ఆనందోత్సాహాల నడుమ హోలీ సంబురాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో యువత ఈ వేడుకల్లో పాల్గొని పరస్పరం రంగులు చల్లుకుని కేరింతలు కొట్టారు. కమర్తపు మురళిని రంగుమయం చేసి నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో డివిజన్ నాయకులు తాజుద్దీన్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎస్‌పీ ఆఫీస్ రోడ్‌లోని కృష్ణప్రసాద్ మెమోరియల్ పాఠశాల విద్యార్థులు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌ను కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు.

212
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles