హోలీ వేడుకల్లో విషాదం

Fri,March 22, 2019 01:35 AM

తిరుమలాయపాలెం, మార్చి 21 : మండలంలోని మేడిదపల్లి గ్రామంలో గురువారం జరిగిన హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ యువకుడు కాల్వలో మునిగి మృత్యువాత పడ్డాడు. దీంతో మేడిదపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... మేడిదపల్లిలో 10మంది యువకులు ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. రంగులు జల్లుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలోని శ్రీరాంసాగర్ కాల్వలో ఈతకెళ్లారు. కాల్వ డ్రాపు వద్ద దూకారు. దీంతో షేక్ వహీద్, నజీర్‌లు డ్రాపు వద్ద నీటి సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోతుండగా వారిని రక్షించేందుకు మరో ఇద్దరు ఆమడ మురళి, తురక అనిల్ కాల్వలో దూకారు. సుడిగుండంలో మునిగిన వహీద్, నజీర్ ప్రాణాలతో బయటపడ్డారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన ఆమడ మురళి నీటిలో మునిగి శవమై పైకి తేలాడు. దీంతో మిగతా యువకులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈక్రమంలో మరో ముగ్గురు యువకులకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మురళి గత ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇతనికి మూడు నెలల పాప ఉంది. మురళిని ఈతరూపంలో మృత్యువు కబళించడంతో తల్లి వెంకటమ్మ, భార్య కళ్యాణి చేస్తున్న రోదనలు పలువురిని కలిచివేశాయి. ఒక్కగానొక్క కొడుకు మృతిచెండటంతో కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. స్నేహితులంతా సరదాగా ఈతకు వెళ్లి ఒకరు మృతిచెందడంతో మేడిదపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెల్సుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంఘటన స్థలం వద్దకు భారీసంఖ్యలో చేరుకున్నారు. మురళిని చూసి కంటతడి పెట్టుకున్నారు. సంఘట స్థలాన్ని ఏఎస్‌ఐ వెంకటాచారీ, సిబ్బంది సందర్శించారు. మురళి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

196
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles