టీడీపీ ఖాళీ..

Thu,March 21, 2019 12:36 AM

- ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి మిగిలింది మెచ్చా ఒక్కడే
- రెండు జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్
- నామా బాటలో తుళ్లూరి బ్రహ్మయ్య, స్వర్ణకుమారి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దుకాణం దాదాపుగా ఖాళీ అయింది. అందలం ఎక్కిన చోటే అధఃపాతాళానికి దిగజారింది. మారిన రాజకీయ సమీకరణాలు, తెలంగాణ ఏర్పాటు వంటివి ఆ పార్టీ భవిష్యత్తును పూర్తిగా కనుమరుగు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినప్పటికీ కేవలం సత్తుపల్లి స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అయితే అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉంది. జిల్లాలో అభివృద్ధి పనుల కోసం టీఆర్‌ఎస్ అవసరం ఉందని భావించిన మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు దాదాపు 75 శాతం టీడీపీ కార్యకర్తలు, నాయకులతో 2014 శాసనసభ ఎన్నికల తరువాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు తుమ్మల, నామా వర్గాలుగా పనిచేసిన ఆ పార్టీ కార్యకర్తల్లో బలమైన వర్గంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వర్గం టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరిపోవడంతో మిగిలిన కొద్దిమంది నాయకులు, కార్యకర్తలతో నామా నాగేశ్వరరావు ఇన్నాళ్లూ పెద్దదిక్కుగా టీడీపీని నడిపించారు. జిల్లాలో జరిగిన వివిధ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు.

(ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
టీఆర్‌ఎస్ కారు దూకుడు ముందు టీడీపీ సైకిల్‌కి చక్రాలు ఊడిపోయాయి. దీంతో ఐదేళ్లపాటు టీడీపీని నడిపించిన నామా నాగేశ్వరరావు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ చేతిలో ఓటమి చెందారు. దీంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి తీవ్ర గందరగోళంగా ఉండటంతో పాటు గ్రామస్థాయిలో ప్రభావితం చేయగల నాయకులు కూడా లేకపోవడంతో నామా నాగేశ్వరరావు క్రమేణా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావించినప్పటికీ రాజకీయ కారణాలతోపాటు తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రా పార్టీగా ముద్రపడటంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇక్కడి నాయకులంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉన్న కొద్దిమందితో పార్టీని నడిపించాలని భావించిన చంద్రబాబు.. నామా వంటి నాయకులకు పార్టీలో కీలక పదవులను అప్పగించారు. అయినా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి నాయకులెవరూ లభించే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే జిల్లాలోని కీలక నాయకులంతా టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఉన్న కొద్ది మంది కార్యకర్తలను కాపాడుకునే నాయకుడే లేకుండాపోయాడు.

ముందే నిర్ణయించుకున్న సండ్ర..
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సత్తుపల్లి ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికైనప్పటికీ జిల్లాలో అభివృద్ధి పనులు విజయవంతంగా కొనసాగాలన్న ఆకాంక్షతో సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్ చేరేందుకు ముందే నిర్ణయించుకున్నారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకే తగిలింది. దీనిని నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగులుతోంది. నామా తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఇప్పటికే జిల్లాలో కొట్టుమిట్టులాడుతున్న తెలుగుదేశం పార్టీ ఉనికి గాలిలో కలిసిపోయింది. జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తన పదవులకు రాజీనామా చేయడంతో మిగిలిన కొద్దిమంది నాయకులు కూడా ఆయన వెంటే పయనించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి కూడా తమ పదవులకు రాజీనామ చేయనున్నారు. వీరితోపాటు జిల్లాలోని గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు నామా వెంట రాజీనామా చేసేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కానుందనే చెప్పవచ్చు.

అంతర్మధనంలో మెచ్చా..
అశ్వారావుపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు అంతర్మథనంలో పడ్డారు. ఉమ్మడి జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు సైతం టీఆర్‌ఎస్ పార్టీలో చేరనుండటంతో ఇప్పుడు తాను ఏమి చేయాలో తేల్చుకోలేక తర్జనభర్జన పడుతున్నారు. సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నప్పుడే మెచ్చా నాగేశ్వరరావు కూడా చేరుతారనే ప్రచారం జరిగింది. అప్పుడు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు.. మెచ్చా నాగేశ్వరరావుతో చర్చించి తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు.

కానీ మారిన రాజకీయ సమీకరణల్లో అదే నామా నాగేశ్వరరావు ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడటంతో ఎటుపోవాలో తెలియని పరిస్థితులలో మెచ్చా నాగేశ్వరరావు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావు వర్గంగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేస్తున్న పలువురు కీలక నేతలు సైతం నామా వెంట టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు కూడా మెచ్చాపై ఒత్తిడి పెంచుతున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా టీఆర్‌ఎస్‌లో చేరాలని, జిల్లాలో కనుమరుగువుతున్న తెలుగుదేశంలో ఉండటం కంటే టీఆర్‌ఎస్‌లోనే చేరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం మేలని మెచ్చాకి సూచిస్తున్నారు. కానీ సండ్రతోపాటే టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగిన తర్వాత వెనుకడుగు వేసిన మెచ్చా.. తిరిగి ఇప్డుపు మళ్ళీ టీఆర్‌ఎస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు. పైకి మేకపోతు గాంభీర్యంతో పార్టీ మారడం లేదని ప్రకటిస్తున్నా.. లోలోపల మాత్రం ఆలోచన మార్చుకొని త్వరలోనే ఆయన కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని సన్నిహితులు, తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడుతున్నారు.

488
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles