రాజకీయం రసవత్తరం

Wed,March 20, 2019 12:58 AM

-ఖరారు కాని ప్రధాన అభ్యర్థులు
-ఆయా పార్టీల క్యాడర్‌లో ఉత్కంఠ
-సోషల్ మీడియాలో హల్‌చల్
-కమ్యూనిస్టుల ఐక్యత ఫలించేనా?
ఖమ్మం ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ :లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. వేసవి తాపాన్ని మించిన వేడి రగిలిస్తున్నది. అయితే, ఈ నెల 25న నామినేషన్లకు గడువు ముగియనుండగా.. ఇంకా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నామినేషన్లు దాఖలుకు ఆరు రోజులే గడువు ఉండగా.. ఇందులో మూడురోజులు ప్రభుత్వ సెలవు దినాలే కావడం విశేషం.. అంటే.. గురు, శని, ఆదివారం సెలవులుండటంతో ఈ మూడురోజులు నామినేషన్లు స్వీకరించరు. బుధ, శుక్ర, సోమవారాల్లో మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా మంగళవారం రాత్రి వరకూ ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది తేలకపోవడం ఆసక్తిరేకెత్తిస్తున్నది. ఇక టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసేందుకు కసరత్తు చేస్తుండగా.. బరిలో ఎవరు నిలుస్తారనేది ఇంకా స్పష్టం రాలేదు.

ఖమ్మం లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నుంచి ఏ అభ్యర్థి పోటీ చేయనున్నారో ఇంత వరకూ స్పష్టత లేదు. ఇంకా ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 లోక్‌సభ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును మాత్రం ఇంకా పెండింగ్‌లో పెట్టింది. ఆ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ఆ పార్టీ ఎవరినీ ప్రకటించలేదు. ఇకపోతే టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరు పోటీ చేస్తారనే విషయం ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపోమపో ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించే అవకాశం ఉంది. సీపీఎం, సీపీఐ మధ్య పొత్తు చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. సీపీఎం తన అభ్యర్థిని ఖమ్మం లోక్‌సభలో పోటీకి దింపే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గీయులు పేర్కొంటున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి ఖమ్మం నుంచి పోటీ చేసినందున్న ఈ దఫా ఎన్నికల్లో సీపీఎంకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై మూడు రోజులు కావస్తున్నా ఇంత వరకూ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.

సోషల్‌మీడియా హల్‌చల్..
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17 లోక్‌సభ స్థానాలలో 16 స్థానాలకు కొన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఖమ్మం మాత్రం మినహాయించడం పలు చర్చలకు తావిస్తోంది. ఇదే అదునుగా సోషల్‌మీడియా వేదికగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఫలానా వ్యక్తికి టికెట్ ఇచ్చారని, కాంగ్రెస్ నుంచి ఫలానా వారికి సీటు ఖరారైందని గంటగంటకు పేర్లు మార్చుతూ ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. దీంతో పార్టీల అభిమానులు, కార్యకర్తలు సీటు ఎవరికి ఖరారయిందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. బుధవారం కానీ, గురువారం కానీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ప్రధాన అనుచరురాలుగా కొనసాగుతున్న గాదెల ఝాన్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.

339
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles