స్వేచ్ఛాయుత వాతావరణానికే ఫ్లాగ్‌మార్చ్

Mon,March 18, 2019 11:47 PM

-ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి
-పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
-ఐటీబీపీ పారా మిలటరీ బలగాలతో నగరంలో కవాతు
ఖమ్మం క్రైం, మార్చి 18: ప్రజలు తమ ఓటుహక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడతలో జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా మరింత నమ్మకాన్ని పెంపొందించడానికి సోమవారం నగర ఏసీపీ ఘంటా వెంకట్రావు ఆధ్వర్యంలో ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (ఐటీబీపీ) పారామిలటరీ బలగాలు, స్థానిక పోలీస్ సిబ్బంది కలిసి నగరంలోని ప్రధాన ప్రాంతాలలో పోలీస్ కవాతును నిర్వహించారు. ఈ కవాతును చర్చి కాంపౌండ్‌లో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ జెండా ఊపి ప్రారంభించి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సీపీ తెలిపారు. అందులో భాగంగానే ఐటీబీపీ పారామిలటరీ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మార్గదర్శకాలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా ఫ్రీ అండ్ ఫేయిర్ ఎన్నికల నిర్వాహణే లక్ష్యంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

గత ఎన్నికల తరహాలోనే పోలింగ్‌స్టేషన్ వారీగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం నేరచరితులను బైండోవర్ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. చట్టవ్యతిరేక, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడేవారిని ఉపేక్షించేదిలేదన్నారు. బైండోవర్ అయి నిబంధనలు అతిక్రమించిన 80 కేసులలో నిందితులకు న్యాయస్థానాలలో శిక్షపడిందన్నారు. అదేవిధంగా అక్రమ మద్యం, నగదు రవాణాకు చెక్‌పెట్టేందుకు జిల్లాలో 22 చెక్‌పోస్టుల ద్వారా నియంత్రించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి అల్లర్లకు, అలజడికి అవకాశం లేకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పకడ్భందీగా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. జిల్లా పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ పాట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ బృందాలు బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.

నగరంలోని చర్చి కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్‌మార్చ్ ఆదిత్య థియేటర్, జడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా ఎన్‌టీఆర్ సర్కిల్, బైపాస్‌రోడ్డు, శ్రీశ్రీ విగ్రహం ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ మీదుగా టూటౌన్ పోలీస్‌స్టేషన్, కలెక్టరేట్, మయూరిసెంటర్, జూబ్లీక్లబ్, గాంధీచౌక్, వ్యవసాయ మార్కెట్, ప్రకాష్‌నగర్ మీదుగా చర్చ్‌కాంపౌండ్ వరకు కొనసాగింది. ఈ ఫ్లాగ్‌మార్చ్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ జంజిరాల సదానిరంజన్, సీఐలు బరుపాటి రమేష్, రావుల నరేందర్, మహ్మద్ అబ్ధుల్ షుకూర్, సాయిరమణ,చిట్టిబాబు, కరుణాకర్, తిరుపతిరెడ్డి, ఆర్‌ఐ నాగేశ్వరరావు, సీపీ పీఆర్‌ఓ రామారావు, ఐటీబీపీ అధికారులు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

262
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles