రేపు నోటిఫికేషన్ విడుదల

Sun,March 17, 2019 01:05 AM

-హెలీకాప్టర్ అనుమతికి 48 గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి..:
-కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
ఖమ్మం, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 18న నోటిఫికేషన్ పబ్లిష్ చేయడం జరుగుదుందని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. శనివారం వివధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. సాయంత్రం 3 తర్వాత స్వీకరించబడవని అందుకే ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నామినేషన్ పత్రం సమర్పించే అభ్యర్థులు తాము సమర్పించే ఫొటోలకు సంబంధించి పార్టీ కండువాలు, టోపీలు, పార్టీ చిహ్నాలతో కూడిన దుస్తులు ధరించిన ఫోటోలను సమర్పించకూడదని తెలిపారు. పోటీచేసే అభ్యర్థిని ప్రతిపాదించేందుకు గాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఒకరు, గుర్తింపు పొందని రాజకీయపార్టీలకు సంబంధించి పదిమంది ప్రతిపాదించాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రతిపాదించే వారు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తప్పనిసరిగా ఓటరు అయి ఉండాలని పేర్కొన్నారు. పోటీచేసే అభ్యర్థి నేరచరిత్రకు సంబంధించిన వివరాలను అభ్యర్థి తరపున, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సంబంధిత పార్టీ తరపున మూడుసార్లు స్థానిక దినపత్రికలలో ప్రచురణ, టీవి చానల్స్‌లో ప్రసారం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల వ్యయంపై అకౌంటింగ్ బృందాలు, అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు మూడుసార్లు తప్పనిసరిగా తనిఖీ చేస్తారని దీనికి అభ్యర్థులు సహకరించాలన్నారు.

ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులు 24 గంటల ముందు సువిధ పొర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని, హెలీకాప్టర్‌కు సంబంధించిన అనుమతిని 48 గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ప్రచారాలకు సంబంధించిన ప్రచార అనుమతులకుగాను దరఖాస్తులను పార్లమెంటు నియోజవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. శాసనసభ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలోని రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించాయని, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలను కూడా విజయవంతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. నోడల్ అధికారులు వీ రాజు, కే శ్రీరామ్, వీ మదన్‌గోపాల్, సీహెచ్ రమణీ, కె సాయికిరణ్, పీ దుర్గాప్రసాద్, ఎన్నికల విభాగపు డిప్యూటీ తహశీల్దారు రాంబాబు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనుంచి హన్మంతరెడ్డి, బీజేపీ పార్టీ నుంచి విద్యాసాగర్, సీపీఎం నుంచి పొన్నం వెంకటేశ్వరరావు, సీపీఐ నుంచి తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నుంచి గోపాల్‌రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

250
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles