ముగిసిన పోలీస్ ఈవెంట్స్

Sun,March 17, 2019 01:03 AM

ఖమ్మం క్రైం, మార్చి 16: పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ముగిసిందని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడా అనుమానాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లలో 28 రోజులుగా కొనసాగిన దేహదారుఢ్య పరీక్షలను 12 సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేసినట్లు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, వైద్యులు, వెయిట్ అండ్ మెజర్‌మెంట్ అధికారుల సమక్షంలో ఎత్తు, ఛాతీ కొలతలు, ఫిజికల్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నిస్పక్షపాతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. చివరి రోజైన 28వ రోజు శారీరక సామర్థ్య పరీక్షలకు 269 మంది అభ్యర్థులతోపాటు ముందస్తు అనుమతి తీసుకున్న మరో 420 మంది అభ్యర్థులు శనివారం హాజరైనట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. పోలీస్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ఫిబ్రవరి 11న ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలకు ఇప్పటి వరకూ పురుష, మహిళా అభ్యర్థులు మొత్తం 23,700 మంది ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌కు హాజరైనట్లు తెలిపారు.

అందులో 21,549 మంది ఎత్తు, ఛాతి కొలతలలో అర్హత సాధించారని, మిగిలిన 2,151 మంది అర్హత కోల్పోయారని అన్నారు. ఎత్తు, ఛాతి కొలతలలో అర్హత సాధించిన పురుష అభ్యర్థులు 800 మీటర్ల పరుగుపందెంలో కచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఎత్తులో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు పందెంలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సిందేనన్నారు. అనంతరం పురుష అభ్యర్థులకు నాలుగు ఈవెంట్లలో (100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్) పాల్గొంటారని, మహిళా అభ్యర్థులు రెండు ఈవెంట్స్‌లో (షాట్‌పుట్, లాంగ్ జంప్) పాల్గొనాల్సి ఉంటుందని విశదీకరించారు. ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచి అభ్యర్థులు గ్రౌండ్‌కు చేరుకోవడంతో బయోమెట్రిక్ నిర్వహించి దేహదారుఢ్య పరీక్షలకు పంపిస్తున్నామన్నారు.

రాష్ట్ర పోలీసుశాఖలోని సివిల్, ఏఆర్, టీఎస్‌పీ, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో స్టయిఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల ఎంపికలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన 27,502 మంది అభ్యర్థులకు గాను 23,700 ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టుకు (పీఎంటీ) హాజరయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మురళీధర్, శ్యామ్‌సుందర్, ట్రైనీ ఐపీఎస్ వినీత్, ఏసీపీలు సత్యనారాయణ, వెంకట్రావు, రామోజీ రమేష్, రెహ్మాన్, రామానుజం, విజయబాబు, రియాజ్, కుమారస్వామి, కమిషనర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జానకిరామ్, భాస్కర్‌రెడ్డి, రహమతుల్లా ఖాన్, ఫిజికల్ డైరెక్టర్‌లు పీఈటీలు పవన్, నాగేశ్వరరావు, వీరభద్రం, నాగప్రసాద్, రాజు, మాలతి, దుర్గాదేవీ, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

227
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles