భూసేకరణలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలి

Sun,March 17, 2019 01:03 AM

-సీతారామా ప్రాజెక్టుపై కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే సీతారామా ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నిర్మాణ పనులకు అవసరమైన భూ సేకరణ పక్కాగా జరగాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే పరిష్కరించి భూములు కోల్పోయిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన సీతారామా ప్రాజెక్టు భూసేకరణ పనులకు సంబంధించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సీతారామా ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేసేందుకు భూసేకరణ పనులు కూడా అంతకంటే వేగంగా చేయాలన్నారు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు, అశ్వాపురం, బూర్గంపాడు, ముల్కలపల్లి, పాల్వంచ తదితర మండలాలకు చెందిన రెవెన్యూ, నీటిపారుదల, అటవీశాఖ అధికారులకు భూసేకరణపై పలు సూచనలు చేశారు. భూ రికార్డుల శుద్దీకరణ జరిగిన తరువాత ఉన్న రికార్డుల ఆధారంగా ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలన్నారు.

భూసేకరణ విషయంలో వాస్తవాలను వెలికితీయాలని, రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. భూసేకరణలో ప్రధానంగా రెండు అంశాలపై ఆయన సమగ్రంగా విశదీకరిస్తూ ఎవరైతే ఆర్‌వోఎఫ్‌ఆర్, పట్టా భూములు కలిగి ఉంటే ఆ భూములు సాగు చేయకపోయినప్పటికీ వారికి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆక్రమిత భూములలో రైతులు సాగు చేస్తుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి కూడా చెల్లింపులు జరపాల్సి ఉంటుందన్నారు. ఏది ఏమైనప్పటికీ నిబంధనలకు అనుగుణంగా పరిహారం చెల్లింపులు చేయాలన్నారు. జూలూరుపాడు మండలంలో ఏడు ఎకరాల భూమి ఎలైన్‌మెంట్ మార్చడంతో తొలుత నిర్ణయించిన ప్రకారం ఇప్పుడు తీసుకోవడం లేదని ఆ మండల తహసీల్దార్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూసేకరణ జరుగుతోన్న మండలాల తహసీల్దార్లు భూసేకరణ ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సలహాలను, సూచనలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా వాస్తవ హక్కుదారులు ఉంటే వారి పూర్తి వివరాలు సేకరించాలని, సాధ్యమైనంత వరకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో జిల్లా అటవీశాఖ అధికారి శివాల రాంబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, జిల్లా సర్వే అండ్ ల్యాండ్స్ అధికారిణి కుసుమకుమారిలు పాల్గొన్నారు.

233
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles