విజయీభవ...

Sat,March 16, 2019 12:36 AM

- నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

(ఖమ్మం ఎడ్యుకేషన్) టెన్త్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల అనంతరం విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించని విధంగా నిబంధన అమలు చేయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు రెగ్యులర్‌గా 17,960, ప్రైవేట్‌గా 1,415 మంది విద్యార్థులు కలిపి మొత్తం 19,375 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ పరీక్షలకు 45 జోన్లను, ప్రైవేట్‌కు 3 జోన్లను కలిపి మొత్తం 48 జోన్లుగా విభజించారు. పరీక్షల కోసం 89 రెగ్యులర్ కేంద్రాలు, 5 ప్రైవేట్ కేంద్రాలు కలిపి మొత్తంగా 94 కేంద్రాలు ఉన్నాయి. సిట్టింగ్ స్కాడ్స్‌లో 94 మందితో బృందాలు, ఫ్లయింగ్ స్కాడ్స్‌లో 8 మందితో ఉన్న బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. 840 మందికి పైగా ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించనున్నారు.

వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లు..
విద్యార్థులు నేరుగా విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి హాల్‌టిక్కెట్లను పొందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టిక్కెట్‌పై ఫొటో అతికిస్తే సరిపోతుందని, గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించాలనే నిబంధన లేదని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో వైద్య సౌకర్యం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లనూ, ఏఎన్‌ఎంలనూ కేంద్రంలో అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటరుతోపాటు చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సహా మొబైల్ ఫోన్లు వాడకూడదని స్పష్టం చేశారు. కేంద్రాల్లో ఇబ్బందులుంటే హెల్ప్‌లైన్ 8331851510లో ఫిర్యాదు చేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు డీఈఓ మదన్‌మోహన్ నమస్తే తెలంగాణకు తెలిపారు.

పరిశీలకుడిగా జేడీ శ్రీనివాసచారి
విద్యాశాఖ జేడీ శ్రీనివాసచారి టెన్త్ పరీక్షలకు జిల్లా అబ్జర్వర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. శుక్రవారం పరీక్షల నిర్వహణాధికారులతో జిల్లా అబ్జర్వర్, జేడీ శ్రీనివాసచారి సమావేశం నిర్వహించారు. ఫ్లయింగ్ స్కాడ్స్, సీఎస్, డీఓలు ఇతర సిబ్బందితో సమావేశమై సూచనలు అందించారు. నగరంలోని ఎన్‌ఎస్‌సీ క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ మదన్‌మోహన్ తనిఖీ చేశారు.

నిత్యం పర్యవేక్షిస్తున్న డీఈఓ..
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు డీఈఓ మదన్‌మోహన్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాల మొదలు నుంచి ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా కేటాయించే ప్రక్రియలో నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నెల రోజుల ముందు నుంచే సంబంధిత మండల విద్యాశాఖాధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించి లోపాలను సరిదిద్దారు.

సహాయకులుగా 30 మందికి అనుమతి..
పరీక్షలు రాసే వారిలో మూగ, చెవిటి, అంధ విద్యార్థులకు సహాయకుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతిచ్చారు. మూగ, చెవిటి కేటగిరీలో 20 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంధత్వ విభాగంలో 10 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ డీఈఓ అనుమతులిచ్చారు.

239
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles