అప్పుడే భగభగ..!

Fri,March 15, 2019 01:13 AM

-మార్చి దంచికొడుతున్న ఎండలు..
-జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
-పగటిపూట బయటకి రాలేకపోతున్న ప్రజలు
-ఏప్రిల్, మే నెలలు ప్రమాదకరం అంటున్న నిపుణులు
-శీతల పానీయాలు, ఏసీలు, కూలర్లకు పెరుగుతున్న గిరాకీ
-రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఒంటిపూట బడులు
వేసవి కాలం వచ్చింది.. దండిగా ఎండలను మోసుకువచ్చింది. దీంతో మార్చి నెలలోనే భానుడు భగభగ మండుతున్నాడు. భూమి నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 10గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుండటంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నగర రహదారులన్నీ మధ్యాహ్నం వేళలో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటుతున్నా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించారు. ఇంతకాలం వాడకుండా మూలన పడేసిన ఏసీలు, కూలర్లకు పట్టిన బూజును దులుపుకుంటున్నారు. మార్చిలోనే ఎండ తీవ్రత ఈ విధంగా ఉండటంతో రానున్న ఏప్రిల్, మే నెలలు అన్నిరకాల జీవులకు ప్రమాదకరమని వాతావరణ నిఫుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో వేసవి సీజన్ ప్రారంభమైంది. మార్చి తొలి అంకంలోనే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రరూపం దాల్చుతున్నది. మునుపటికి భిన్నంగా వేసవి ఆరంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదు కావటం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం జిల్లాల్లో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజుల నుంచి ఇలాంటి పరిస్థితులు నెలకొనటంతో ప్రజలు పగలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిరతో పాటు ఇతర పట్టణాల్లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరగటం అన్నివర్గాల వారిని కలవరపెడుతున్నది. సింగరేణి ప్రాంతం మొత్తం వేడెక్కి నిప్పుల కుంపటిగా మారుతుండటంతో స్థానిక ప్రజలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. ఎంతటి అత్యవసర పనులున్నా సాయంత్రానికి వాయిదా వేసుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలకు బదులు ఆటోలు, బస్సులకే జనాలు ప్రాధాన్యత ఇస్తుండటం చూస్తే ఎండ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పల్లెల్లో ఒక్కపూటే పనులు..
పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలైనా ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఎక్కడా కనిపించటం లేదు. అడవులు అంతరించటం, బీడు భూములన్నీ వ్యవసాయ భూములుగా మార్చేందుకు చెట్లను నరికివేయటంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎండ తీవ్రత అధికంగానే ఉంటున్నది. కాగా, వారం రోజుల నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ, ఉపాధిహామీ వంటి పనులన్నీ ఒక్కపూటకే పరిమితం అయ్యాయి. ఉదయం ఏడు గంటలకు పొలాలకు, ఉపాధి పనులకు వెళుతున్న కూలీలు మధ్యాహ్నం 12 గంటలకే ఇల్లు చేరుతున్నారు. వేసవి సీజన్ ఊపందుకోవటం, భానుడి ఉగ్ర రూపానికి పశుగ్రాసం ఎండిపోయి పశువులు, మేకలు, గొర్రెలకు మేత దొరికే పరిస్థితులు దాదాపు దూరమవుతున్నవి. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి.

ఊపందుకున్న శీతల విక్రయాలు..
వేసవి కారణంగా జనం బయటకు రాక బడా వ్యాపార వర్గాలకు నష్టం వాటిల్లినా చిన్నచిన్న వ్యాపారులకు మాత్రం మేలే జరుగుతున్నది. వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతుండటంతో పట్టణాల్లో శీతల పానీయాలు, పండ్ల రసాలు, కొబ్బరి బోండాల వ్యాపారం ఊపందుకుంది. రకరకాల పనుల కారణంగా బయటికి వస్తున్న ప్రజలు మధ్యాహ్న సమయంలో నిమ్మరసం, చెరుకు రసం, కూల్‌డ్రింక్స్ సేవించేందుకు తహతహలాడుతున్నారు. దాహార్తిని పరిష్కరించే పుచ్చకాయల వ్యాపారం సైతం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఇక బార్లు, రెస్టారెంట్స్, వైన్ షాపుల్లో మందుబాబులు బీర్లను తెగ తాగేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఫ్యాన్లను కొనుగోలు చేసేందుకు పేద, మధ్యతరగతి వర్గాలు, ఏసీలు కొనుగోలు చేసేందుకు ఉన్నతవర్గాలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కోతలు లేని కరెంట్‌ను సరఫరా చేస్తుండటంతో పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు హాయిగా సేదతీరుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మధ్య తరగతి ప్రజలు కూలర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేసవి మొదలైన నాటినుంచి విద్యుత్‌కు ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో రెప్పపాటు కూడా కరెంట్ పోవడంలేదు.

భవిష్యత్ ప్రమాదమే..
వేసవి కాలం అంటే ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభమై మార్చి, ఏప్రిల్, మేతోపాటు జూన్ మొదటి వారంలో ముగుస్తుంది. ఈ క్రమంలో తొలుత, చివర తప్పితే మధ్యలో ఉండే మూడు నెలల్లో ఎండలు మండటం సహజం. కానీ సీజన్ ప్రారంభమైన కొన్ని రోజులకే పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకుంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎంతటి దారుణంగా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు. మార్చి ద్వితీయార్థం, ఏప్రిల్, మే నెలల్లో కచ్చితంగా యాభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిఫుణులు పేర్కొంటున్నారు. దీంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, మనుషులు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల సాయంతో ఊరటచెందే అవకాశం ఉన్నప్పటికీ మూగ జీవాల మనుగడ కష్ట సాధ్యమయ్యే ప్రమాదముందంటున్నారు. దీంతో జిల్లాలోని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

278
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles