ఏసీబీ వలకు చిక్కిన రెవెన్యూ ఉద్యోగి

Fri,March 15, 2019 01:10 AM

-రూ.ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గంధసిరి వీఆర్వో
ముదిగొండ, మార్చి 14: గంధసిరి గ్రామానికి చెందిన రైతుకు వారసత్వంగా వస్తున్న పొలాన్ని కొత్త పాసు పుస్తకంలో నమోదు చేయడానికి ఆ గ్రామ వీఆర్‌వో రాజేందర్ రూ.10వేలు లంచం డిమాండ్ చేసి ముందుగా రూ.ఐదువేలు తీసుకుంటూ గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గంధసిరి గ్రామానికి చెందిన చెమట నాగేశ్వరరావుకు గ్రామ రెవెన్యూలో 4.12 ఎకరాల భూమి ఉన్నది. అందులో 4.04 కుంటలు వారసత్వంగా వస్తున్న భూమి కాగా మిగిలిన 8కుంటలు తన పొలంలో కలిసే పక్క రైతు నుంచి అగ్రిమెంటు ద్వారా కొనుగోలు చేశాడు. కాగా ఇటీవల సాదాబైనామా ప్రకియ అనంతరం రైతులకు నూతన పాసుపుస్తకాలు అందించారు. నాగేశ్వరావుకు అందించిన పాసుపుస్తకంలో 2.23ఎకరాలు మాత్రమే నమోదైంది. మిగిలిన పొలం తన పాసుపుస్తకంలో నమోదుకాలేదు. దీంతో రైతు నాగేశ్వరరావు కుమారుడు వేణు గంధసిరి వీఆర్‌వో దోమల రాజేందర్‌ను కలిసి కొత్తపాస్‌పుస్తకంలో మిగిలిన భూమిని నమోదు చేయాలని కోరి దరఖాస్తు పెట్టుకున్నాడు. రూ.10వేలు లంచం ఇస్తేనే పని అవుతుందని రాజేందర్ చెప్పాడు. నేను అంత ఇచ్చుకోలేను రూ.5వేలు ఇస్తానని కోరగా పని మొదలుపెడ్తాను మిగిలినవి తరువాత ఇవ్వాలని డిమాండ్ చేశాడు. విసుగుచెందిన వేణు అవినీతి నిరోదకశాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వమని రాజేందర్ ఒక అడ్రస్ చెప్పగా రూ.5వేలు తీసుకొని అక్కడకు వచ్చి రాజేందర్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్‌పీ ప్రతాప్ ఆధ్వర్యంలో సీఐలు రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్‌లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడు రాజేందర్‌ను ముదిగొండ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారించి, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. రాజేందర్‌పై కేసు నమోదు చేసి రిమండ్ చేస్తున్నట్లు డీఎస్‌పీ తెలిపారు.

గంధసిరి అంటేనే రెవెన్యూ
గంధసిరి గ్రామం అంటేనే రెవెన్యూ అధికారులకు మంచి ఆదాయం వచ్చే గ్రామం. ఇక్కడ ఉన్న మున్నేరులో అపారమైన ఇసుక నిల్వలు ఉండగా స్థానిక రైతుల విజ్ఞప్తి మేరకు ఇసుక రవాణాను నిషేదించారు. కానీ స్థానిక అవసరాల కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అవసరాలకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న రెవెన్యూ అధికారులు అక్రమార్జనకు అలవాటు పడి ట్రాక్టరు యజమానుల నుండి ముడుపులు తీసుకొని అక్రమ రవాణాను సక్రమంగా కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక రెవెన్యూ ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అందుకే తమకు అతి సన్నిహితంగా పనిచేయగల నేర్పరులనే ఇక్కడ వీఆర్‌వోలుగా నియమించుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ గ్రామంలో పనిచేసే వీఆర్‌వోలు రైతుల సమస్యలు పరిష్కరించటం కన్నా ఇసుక ముడుపులు ఏ విదంగా వస్తాయి అనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడ్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వందలమందిని ఏడిపించుకుంటున్న అధికారులు
ఇదిలా ఉండగా సాదాబైనామా ప్రక్రియలో మండలంలో అధికారులు పలు అవకతవకతవకలకు పాల్పడగా రైతులు తమ పాసుపుస్తకాలు తీసుకొని ప్రతి నిత్యం ఆఫీసుల చుట్టు తిరగటం పరిపాటు అయింది. ఎంతో కొంత ముడుపులు ఇస్తేనే ఫైలు కదలటంలేదని పుస్తకాల్లో పేర్లు మార్పులు జరగటం లేదని ఆరోపణలు వచ్చాయి. కాగా ఇంకా కొంతమంది రైతుల పాసుపుస్తకాలు వీఆర్‌వోల దగ్గరు ఉంచుకొని రైతులను ఇబ్బందులు పెడ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: డీఎస్‌పీ
ఏ అధికారి లంచం అడిగినా 9440700049 అనే తన నెంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని డీఎస్‌పీ ప్రతాప్ తెలిపారు.

241
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles