గులబీ గుమ్మం..!

Thu,March 14, 2019 12:25 AM

- పక్కా ప్రణాళికతో సిద్ధమైన టీఆర్‌ఎస్..
- పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం
- ఎన్నికల ఇన్‌చార్జ్‌గా సీఎం కేసీఆర్ కావడంతో శ్రేణుల్లో జోష్
- టీఆర్‌ఎస్‌కే జై కొడుతున్న ప్రజలు
- కనీస పోటీ ఇవ్వలేమనే స్థితిలో కాంగ్రెస్
- కూటమి పక్షాల్లో ఐక్యత కనుమరుగు
- మెజార్టీయే లక్ష్యంగా కేడర్‌ను సిద్ధం చేస్తున్న నాయకులు


ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగా: ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి., ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగరవేయనుందనే చెప్పవచ్చు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ పుంజుకుని మెజార్టీని సాధించే దిశగా ఇప్పటికే కిందిస్థాయి నాయకత్వానికి టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రేణులను అనుసరించిన విధానాలను కాకుండా పక్కా ప్రణాళికతో ప్రతీ ఓటు టీఆర్‌ఎస్‌కు పడేవిధంగా ప్రజలను చైతన్యం చేసే దిశగా కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తమ వ్యూహాలకు పదును పెట్టి గ్రామస్థాయిలో టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేని బలం ఉందని నిరూపించేందుకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో 75శాతం పంచాయతీలను చేజిక్కించుకుని జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గుంపుగా కూటమి కట్టిన ప్రతిపక్ష పార్టీలు ఆ తరువాత ఎకాకులై గ్రామపంచాయతీ ఎన్నికల్లో చతికిల పడ్డాయి. అక్కడక్కడ పొత్తు పెట్టుకున్నప్పటికీ అవి వికటించి వెన్నుపోట్లు ముందు పోట్లకు తెరతీయడంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో ప్రతిపక్షాల నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు సైతం ఎవరూ సాహసం చేసి ముందుకు రావడంలేదంటే ప్రతిపక్ష పార్టీలు జిల్లాలో ఎంత బలహీనపడ్డాయో అర్థమవుతుంది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం వెనుకడుగు వేస్తున్నారు.

ఇక వామపక్షాల పరిస్థితి అయితే అంపశయ్యపై ఉన్న శవానికి తులసితీర్థం పోసి బతికించుకోవాలన్న ఆరాటంలో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే వామపక్ష సిద్ధ్దాంతాలను దూరం పెట్టి అభివృద్ధిని కాంక్షించేందుకు ప్రజలందరూ ఏకమై టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు నైరాశ్యంలో కొట్టుమిట్టులాడుతుంటే టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం కారు జోరుకు స్పీడ్ పెంచి ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీల పోటీ నామమాత్రంగానే ఉంటుందని చెప్పవచ్చు. టీఆర్‌ఎస్‌కు పోటీనిచ్చే సత్తా ఆ పార్టీల్లో కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే స్పష్టత సైతం లేదు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం సాధించి జిల్లాలో ప్రతిపక్షాలు కనుమరుగు అయ్యేలా చేయాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉవ్విలురుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీని సాధించి టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉందని చెప్పేందుకు ఇప్పటి నుంచే కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉమ్మడి ఎన్నికల సమయంలోనూ పార్టీకి ఎలాంటి ఆదరణలేదు. కానీ మారిన రాజకీయ కారణాలతో జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో భారీ ఆదరణ పెరిగింది. గతంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించింది. జిల్లాలో ఎన్నడూలేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టడంతో టీఆర్‌ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలికారు.

పక్కా ప్రణాళికతో సిద్ధమైన టీఆర్‌ఎస్..
జిల్లాలో ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ఇప్పటికే సిద్ధమయింది. స్వయంగా సీఎం కేసీఆర్ ఖమ్మం పార్లమెంటు ఎన్నికల ఇంచార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా గెలుపునకు వ్యూహరచన చేసే ముఖ్య నేతలను రంగంలోకి దించేందుకు సర్వం సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన దూకుడును పార్లమెంటు ఎన్నికల్లో సైతం పెంచాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో గతంలో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కూటమి నుంచి గెలిచి టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య తదితరులతో పార్లమెంటు ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేశారు. దీంతో ఖమ్మం పార్లమెంటు పరిధిలో జరగనున్న ఎన్నికల వ్యూహరచనలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పనుంది. ఇప్పటికే జిల్లాలోని

ముఖ్య యువనాయకులు, ఇతర కీలకమైన నాయకులతో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లాలో నిర్మాణం చేస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, రానున్న ఖరీఫ్ నాటికి సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నారు. అలాగే తండాలను గ్రామపంచాయతీలుగా చేస్తామని ప్రకటించిన హామీని నిలబెట్టుకుని ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని గిరిజన గ్రామాలను, తండాలను గ్రామపంచాయతీలుగా చేసి ఎన్నికల్లో స్థానిక గిరిజనులకే సర్పంచ్ పదువులు దొరికే విధంగా అమలు చేశారు. జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు టీఆర్‌ఎస్‌వైపు నిలుస్తారని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. ప్రధానంగా రైతుకు ముందస్తు పెట్టుబడిలో భాగంగా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి సీజన్‌కు రూ. 5వేల చొప్పున అర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా రైతులు చనిపోతే రైతుబీమా పథకం కింద వారి కుటుంబానికి రూ. 5లక్షల బీమా అందజేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజారంజక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. ఆసరా పింఛన్‌ల పథకంలో రూ. 1000, రూ. 1500ల వరకు పెంచి పింఛన్ బాధ్యులను ఆదుకున్నారు. రెండోసారి అధికారంలోకి వస్తే దానిని రూ. 2016, వికలాంగులకు రూ. 3016లు పింఛన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా అధికారులకు మార్గదర్శకాలను జారీచేశారు. పేద ఇంటిలో ఆడబిడ్డల పెళ్లికి కానుకగాను రూ. 1,16,000 కల్యాణలక్ష్మిచ షాదీముబారక్ పథకాల ద్వారా అందిస్తున్నారు. ఇలా గురుకుల పాఠశాలలు, విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రుణ సహాయం వంటి పథకాలను అమలుచేసి ప్రజల్లో మన్ననలు పొందుతున్నారు. దీంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎజెండాగా ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు విజయం సాధించాలని సిద్ధమవుతున్నారు.

28 రోజుల గడువులో టీఆర్‌ఎస్‌దే విజయం..
పార్లమెంటు ఎన్నికలకు జిల్లాలో మొదటి విడతలో జరగనున్న ఎన్నికల తేదీ ఏప్రిల్ 11 నాటికి 28 రోజులే గడువుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి ప్రచారం వరకు తక్కువ సమయమే ఉంది. కానీ ఇప్పటికే ప్రజల్లో ఎవరికి ఓటు వేయాలనే స్పష్టత వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు సామాన్యులు సైతం సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల నగారా మోగిన నాటినుంచి జిల్లాలో రాజకీయ వేడి ప్రారంభమవుతుందని భావించినప్పటికీ ప్రతిపక్షాలు చల్లగా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం, టీఆర్‌ఎస్ మాత్రం గెలుపే లక్ష్యంగా కార్యరంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిలో నిమగ్నమయ్యాయి. ఖమ్మం పార్లమెంటు పరిధిలో పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ ఆ తరువాత గ్రామపంచాయతీ ఎన్నికల్లో తీవ్రంగా ఓటమి పాలయ్యారు. ఖమ్మం నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఖాతాలో ఉంది. సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య అభివృద్ధి నినాదంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. అలాగే వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో పార్లమెంటు పరిధిలోని మూడు ప్రధాన శాసనసభ నియోజకవర్గాలు టీఆర్‌ఎస్‌కే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కేవలం మధిర, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాలు మాత్రమే ఎమ్మెల్యేలున్నారు. అశ్వారావుపేట నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థి ఎటు తేల్చుకోలేక ఊగిసులాడుతున్నారు. పాలేరు నుంచి గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి అనారోగ్య కారణంతో గెలిచిన నాటి నుంచి కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారే లేరు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే అనుసరించి పార్లమెంటు ఎన్నికల్లో గెలుపును సాధించాలనే లక్ష్యంతో కార్యకర్తలు పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించి ప్రకటించినా, గెలిచితిరాలన్న లక్ష్యంతో కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు.

ప్రతిపక్షాల పోటీ నామమాత్రమే..
ఖమ్మం పార్లమెంటు పరిధిలో ప్రతిపక్షాలకు పోటీ నామమాత్రంగానే ఉంటుందని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి కట్టి పోటీచేసిన పార్టీలు అన్నీ ఇప్పుడు కుంపట్లు పెట్టే పరిస్థితులు ఏర్పడాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీనుంచి బయటికి పోకుండా వారిని కాపాడుకునేందుకే సమయం సరిపోవడంలేదు. దీనికి తోడు మాజీ ఎంపీ రేణుకచౌదరి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గతంలో ఖమ్మం సీటు ఆశించి వరంగల్ జిల్లాలో పోటిచేసిన గాయత్రి రవిలు పోటీకి ఉన్నప్పటికీ రేణుకచౌదరీ ఖమ్మం సీటు తనకే కావాలంటూ పట్టుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతీ జిల్లాస్థాయి నాయకుడికి ఒక వర్గం ఉండటంతో ఎన్నికల్లో కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో దాదాపుగా కనుమరుగైనట్లుగా చెప్పవచ్చు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో గెలిచిన రెండుస్థానాల్లో సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఊగిసులాడుతున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన నామా నాగేశ్వరరావు మళ్లీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ కూటమి కుంపట్లు కావడంతో నామా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వామపక్షాలు మేము పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన ఏ ఒక ఎన్నికల్లోనూ పొత్తు పొడవలేదు. కాకపోగా మిత్రపక్షాలుగా పోటీ చేసినప్పటికీ సైదాంతిక వైరాలతో గ్రామస్థాయిలో నాయకులు ఆయా పార్టీలకు ఓట్లు వేయకుండా వారిని వారే ఓడించుకున్న సందర్భాలు అనేకం. అదేవిధంగా బీజేపీ, తెలంగాణ జనసమితి, ఇతర వామపక్ష పార్టీల ఉనికి పెద్దగా లేదు. దీంతో జిల్లాలో ప్రతిపక్షాలు కుంపట్లుగా వీడిపోవడంతో టీఆర్‌ఎస్ గెలుపు నల్లేరు మీద నడకగానే చెప్పవచ్చు.

303
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles