పుచ్చపండు.. పోషకాలు మెండు..

Thu,March 14, 2019 12:23 AM

ఖమ్మం క్రైం: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆకలి కాదు అన్నం తినాలనిపించదు. బయటకు వెళ్లి వస్తే చాలు ఏదో ఒక చల్లని పదార్థ్దం తినాలనిపిస్తుంది. ఎక్కువశాతం చల్లని నీళ్లతోనే కడుపు నింపేస్తాం. ఇలా వేసవి వచ్చిందంటే చాలు ఆహారం విషయంలో చాలా సమస్యలు ఎదురౌతుంటాయి. అందుకే ఎక్కువశాతం తాజాపండ్లను ఆహారంగా తీసుకోవాలి. పండ్లలో పుచ్చకాయను తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అతిదాహం, చెమట ద్వారా వచ్చే ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం కాకుండా పుచ్చకాయ కాపాడుతుంది. వేసవి కాలంలో విరివిగా దొరికే పచ్చకాయ వలన అనేక రకాల ప్రయోజనాలున్నాయి. వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించే పుచ్చకాయ పోషకాల గని..

వేసవిలో ఎంతో మేలు..
- ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలలో పుచ్చకాయ ఒకటి. మృదువుగా, తియ్యగా, రసపూరితంగా ఉండే పుచ్చకాయ వేసవికి చాలా ఉపయోగకరమైనది. కొవ్వు తక్కువ, పీచు పదార్థ్దాలు ఎక్కువ.. విటమిన్-ఏ, ఫోలేట్, విటమిన్ -సి ఎక్కువ. దీనిలో నీళ్ల శాతం ఎక్కువ ఉంటుంది.
- పుచ్చపండులో ఉన్నన్ని నీళ్లు మరే పండులోగానీ, కాయలోగానీ లేవు.. కాబట్టి దీనిని వాటర్ మిలాన్ అని అంటారు. పుచ్చకాయలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు లభిస్తాయి. మూత్రం సరిగారాని వారు, మూత్ర విసర్జనలో మంట, మూత్రపిండాలలో, మూత్రకోశంలో చిన్నచిన్న రాళ్లు ఉన్న వారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
- గ్లాసు పుచ్చకాయ రసంలో కొంచెం తేనే కలుపుకొని ప్రతిరోజు తాగితే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి.
- వేసవిలో అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గాలంటే పుచ్చకాయ తింటే నివారిస్తుంది. అన్నిరకాల జ్వరాలలో పుచ్చకాయ రసంలో తేనే కలిపి తీసుకుంటే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది.
- మలబధ్దకం ఉన్నవారు ప్రతిరోజు ఫుచ్చకాయ తింటే తగ్గిపోతుంది.. ఎండిపోయే పెదవులను తడిగా ఉంచుతుంది. పుచ్చకాయ తన క్షార గుణంతో శరీరంలో ఎక్కువగా ఉన్న ఆమ్లాలను, వ్యర్థ పదార్థ్దాలను తగ్గిస్తుంది.
- శరీరంలోని కాల్షియం నిల్వ సామర్థ్యాన్ని పెంచి కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జు రాస్తే తిరిగి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
- పుచ్చపండు గింజలను కూడా తినవచ్చు. ఈ గింజలను తినడం వల్ల కూడా అనేక లాభాలున్నాయి. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె విధిని, రక్తపీడనాన్ని సమతుల్య పరుస్తుంది. ఇవేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు, హైపర్‌టెన్షన్ తగ్గి జీవక్రియ సజావుగా సాగుతుంది.
- హార్ట్‌బర్న్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కొంతమేరకు బయటపడవచ్చు. వాటర్ మిలాన్‌లో ఎక్కువ నీరు ఉండడంతో పాటు డ్యూరియాటిక్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తాయి. అదేవిధంగా కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌ను నివారిస్తుంది.
- లివర్‌ను శుభ్రం చేయడమే కాకుండా, రక్తంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకతను పెంచడంలో పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.
- అధిక రక్తపోటు ఉన్న వారికి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉండడమే కారణం. పుచ్చకాయలో 92శాతం వాటర్ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
- టమాటాలలో మాదిరిగా దీనిలో లైకోఫిన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులకు, పేగు క్యాన్సర్‌కు అలానే మధుమేహానికి చాలా మంచిదని వెద్య నిపుణులు చెపుతున్నారు.
- పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే పదార్థ్దం పురుషులలో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఈ లైకోపిన్ వీర్యకణాలు ఎక్కువ సేపు సజీవంగా ఉండేలా చేస్తుంది. ఇంకా పుచ్చకాయ వేసవిలో చర్మాన్ని కాపాడుతుంది.

పుచ్చకాయతో అనేక లాభాలు..
వేసవికాలంలో అధికంగా లభించే పుచ్చకాయతో అనేక రకాల ప్రయోజనాలున్నాయి. దీంట్లో కాల్షియం అధికంగా ఉండి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అదేవిధంగా మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండి బ్లడ్‌ప్రెషర్ (బీపీ)ని, గుండె జబ్బులను రాకుండా చూస్తుంది. దీనిలో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగు పరచడంలో దోహదం చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడటంలో పుచ్చకాయది ప్రధాన పాత్ర. అదే విధంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడే తత్వాన్ని పుచ్చకాయ దూరం చేస్తుంది. రానున్న వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అధికంగా ఉండటంతో ప్రజలు ప్రతిరోజు పుచ్చకాయను తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
- డాక్టర్ తోట శ్రీకాంత్ (ఎండీ జనరల్ మెడిసిన్, శ్రీసాయి మారుతి వైద్యశాల)

461
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles