ఎస్‌బీఐ ఉద్యోగి ఆత్మహత్య

Thu,March 14, 2019 12:22 AM

వైరా, నమస్తే తెలంగాణ, మార్చి 13 : 15రోజుల్లో వివాహం చేసుకోవాల్సిన ఎస్‌బీఐ ఉద్యోగి బుధవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా తొందూరులోని విజయభారతి కాలనీ అంబేద్కర్ జంక్షన్‌కు చెందిన బూడేపు నవీన్‌కుమార్(26) ఖమ్మం జిల్లా వైరా పాత బస్టాండ్ సెంటర్‌లోని ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచ్‌లో నెల రోజుల క్రితం క్లర్క్‌గా ఉద్యోగ బాధ్యతల్లో చేరాడు. తన సహ ఉద్యోగి నవీన్‌కుమార్‌తో కలిసి స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లో అద్దెకు ఉంటున్నాడు. కాగా పొండ్రంగి గ్రామానికి చెందిన ఒక యువతితో ఈ నెల29వ తేదీన గరివిడిలోని సీతారామ కళ్యాణ మండపంలో నవీన్‌కుమార్ వివాహం జరగాల్సి ఉంది. అయితే అర్ధాంతరంగా నవీన్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పోలీసులు మాత్రం మృతుడు నవీన్‌కుమార్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మంగళవారం తన పెళ్లికార్డులను తోటి బ్యాంకు అధికారులకు పంపిణీ చేసిన నవీన్ బుధవారం వైరా రిజర్వాయర్‌లో శవంగా కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నవీన్‌కుమార్ తాను పెళ్లి చేసుకోబోయే యువతితో ప్రతిరోజు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండేవాడని సహచర ఉద్యోగులు తెలిపారు. అయితే కారణం తెలియదు కాని మంగళవారం రాత్రి 7గంటల సమయంలో నవీన్‌కుమార్ సెల్‌ఫోన్‌ను రూమ్‌లోనే వదిలేసి బయటికి వెళ్లాడు.

ఆ తర్వాత తిరిగి రూమ్‌కు రాలేదు. బుధవారం మధ్యాహ్నం వైరా రిజర్వాయర్‌లో తేలియాడుతున్న శవాన్ని మత్స్యకారులు, స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో రిజర్వాయర్‌లోని మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. శవాన్ని పరిశీలించిన అనంతరం అతను వైరాలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం వైరా ఎస్సై తాండ్ర నరేష్ తన సిబ్బందితో కలిసి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవీన్‌కుమార్ మృతి చెందిన విషయాన్ని ఆయన తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. వైరా ఎస్సై తాండ్ర నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

254
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles