గులబీ జోష్..!

Wed,March 13, 2019 12:22 AM

- పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అంటున్న టీఆర్‌ఎస్
- కోడ్ కూసినా ఉలుకూ పలుకూ లేని ప్రతి పక్షాలు
- కూటమి కడతరా.. లేకా కుంపట్లు పెడతారా..?
- తేల్చుకోలేక పోతున్న కాంగ్రెస్, తెదేపా, సీపీఐ
- వామపక్షాల ఐక్యతారాగం వినిపిస్తుందా..?
- క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకత్వం

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జోష్ స్పష్టంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో గెలిచిన ప్రతి పక్షాల ఎమ్మెల్యేలు ఆ పార్టీలను వదిలి జిల్లా అభివృద్ధి కోసం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. గతం ఎన్నికల్లో ప్రజలకు కూటమి నాయకులు చేసిన అబద్దపు ప్రచారంతో పబ్బం గడుపుకున్నప్పటికి గెలిచిన తరువాత ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతుండటంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి కోసం కూటమి ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఖంగు తిన్న తేదేపా, కాంగ్రెసు పార్టీలు లోకసభ ఎన్నికల సమరంలో కళ్లు తెలియాల్సిన పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. ఒక్కప్పుడు వామపక్షాల ఖిల్లాగా పేరు పొందిన ఖమ్మం జిల్లాలో ఆ జెండాల రంగులు వెలిసి పోయాయి. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేని ఎర్ర పార్టీలు ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలను గమనించిన ప్రజలు ఆ పార్టీల సిద్దాంతాలకు స్వస్తి పలికి అభివృద్ధిలో రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్న టీఆర్‌ఎస్ వైపు కదులుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఏమి తేల్చుకోలేని స్థితిలో కార్యకర్తలకు ఎన్నికలపై ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే మీమాంసలో కొట్టుమిట్టులాడుతున్నాయి.

పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అంటున్న టీఆర్‌ఎస్
తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. రాజకీయ పార్టీలు ఎన్నికలు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోలాహాలం మొదలైంది. దీంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. దీనికి అనుగుణంగానే టీఆర్‌ఎస్ ఎన్నికల సమరంలో అన్ని పార్టీల కంటే శ్రేణులను అప్రమత్తం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రతి పక్షాలకు సంకేతాలు పంపించింది. జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సమరంలో ప్రతి పక్షాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే రావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్లమెంటు అభ్యర్థి ఖరారు అయిన వెంటనే ఎన్నికల ప్రచారంలోదూసుకుపోయేందుకు పార్టీ నాయకులు ఇప్పటికే కిందిస్థాయి కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో జరిగిన లోపాలను తిరిగి ఈ ఎన్నికల్లో అలాంటి లోపాలు లేకుండా చూసుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలోని ప్రథమశ్రేణి నాయకత్వం నుంచి కిందిస్థాయి నాయకులందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం లోకసభ స్థానాన్ని గెలుచుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఎన్నికలు మొదటి దశలోనే ఉండటంతో కొంత సమయమే లభించడంతో దీనిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రచార ఏర్పాట్లు, సభలు, సమావేశాల ద్వారా పార్టీ శ్రేణులను సిద్ధం చేసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపునకు బాటలు వేసే విధంగా అధినాయకత్వం తెలంగాణ రాష్ట్ర టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులకు దీశానిర్థేశం చేస్తున్నారు. దీంలో జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల కంటే టీఆర్‌ఎస్ పార్టీ జోరు మీద ఉంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం గ్రామ పంచాయతీలలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. దీంతో గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండటంతో పాటు దీనిని ఈ పార్లమెంటు ఎన్నికల్లో సద్వినియోగం చేసుకునే విధంగా పార్టీ ప్రచార వ్యూహాలను, ఎన్నికల్లో ఓటరు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేవిధంగా క్యాడర్‌ను సంసిద్దులను చేస్తున్నారు. జిల్లాలో పార్లమెంటు ఎన్నికలకు టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నప్పటికి ప్రతిపక్షాలలో మాత్రం ఎలాంటి ఉలుకుపలుకు కనిపించడం లేదు.

వామపక్షాల ఐక్యతారాగం వినిపిస్తుందా..
ఎర్రజెండాల ఖిల్లాగా పేరొందిన ఖమ్మం జిల్లాలో ఆపార్టీలు ఉనికిని కాపాడుకునేందుకే ఆపసోపాలు పడుతున్నాయి. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలు అన్ని ఐక్యంగా పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికి ముందస్తుగానే సీపీఏం బీఎల్‌ఎఫ్ పేరుతో చిన్నా చితక సంఘాలు, ఇతర వామపక్ష భావాజాల పార్టీలతో కూటమిగా ఏర్పాటుచేసి ఎన్నికల భరిలో నిలిచింది. ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చిన సీపీఐ జిల్లాలో ఒక స్థానంలో కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్‌తో జత కట్టింది. మిగతా వామపక్ష పార్టీలుగా ఉన్న సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) రెండు వర్గాలుగా చీలిపోయి ఎన్నికల భరిలో నిలిచింది. అయితే ఈ పార్లమెంటు ఎన్నికల్లో అన్ని వామపక్షపార్టీలు కలిసి ఐక్యమత్యంగా పోటీచేయాలనే ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ ఆయా పార్టీల నాయకత్వంలో భిన్న అభిప్రాయాలు ఉండటంతో వామపక్షాల ఐక్యత కొలిక్కి రావడం లేదు. ఆపార్టీలు చెప్పే సిద్దాంతాలు, అభిప్రాయాలు అన్ని ఒకే భావాజాలంతో ఉన్నప్పటికీ నాయకత్వ ఆధిపత్యంకోసం ఏకం కాకపోవడంతో రోజురోజుకు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. గత పంచాయతీ ఎన్నికల్లో ఈ వామపక్ష పార్టీలు ఆశించినంత స్థాయిలో పల్లేలో తమ పట్టును నిలుపుకోలేకపోయాయి. ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వైపు ఉండాలని నిర్ణయించుకోవడంతో వామపక్షాలు చేసిన అసత్య ప్రచారాలకు తల వంచకుండా టీఆర్‌ఎస్‌కు గ్రామాల్లో పట్టం కట్టారు. దీంతో వామపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారో.. లేక ఇతర పార్టీలతో జతకడతారో వేచిచూడాల్సిందే.

క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకత్వం..
జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సమరంలో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేసేందుకు టీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పటికే కేడర్‌ను సమాయత్తం చేస్తుంది. గ్రామ, మండల స్థాయిలో సమావేశాలను పూర్తిచేసుకుని నియోజకవర్గ స్థాయిలో సమన్వకమిటీని ప్రకటించి ఎన్నికల ప్రచారం చేసేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు భరిలో నిలిచే అభ్యర్థిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వెంటనే ప్రచార పర్వంలో దూసుకుపోయేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రచారంలో ముందుండి ఖమ్మం పార్లమెంటు స్థానాని గెలుచుకునేందుకు నాయకులు సమాయత్తమవుతున్నారు.

కూటమి కడతరా... లేకా కుంపట్లు పెడతారా...
రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో జరిగిన తొలిశాసనసభ ఎన్నికల్లో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు అధికారదాహంతో ప్రతిపక్షపార్టీలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కూటమి కట్టారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కళ్లముందే కనిపిస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు మోసం మాటలతో జిల్లాలో ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు. కానీ వారి అబద్దపు మాటలు నమ్మని రాష్ట్ర ప్రజలు మరోసారి ఉద్యమనేత, తెలంగాణ రాష్ట్ర సాధకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీకి పట్టంకట్టారు. దీంతో రాష్ట్రంలో కూటమికి అధికారం రాకపోవడంతో కార్యకర్తలను, ప్రజలను వదిలి తిరిగి అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఏసీ గదుల్లో కూర్చుని ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల అభివృద్ధి కోసం కూటమి పార్టీలను వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కొత్తగూడెం, మధిర, పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను గెలుచుకున్నప్పటికీ ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాత్రం గోరంగా ఓడిపోయింది. తెలుగుదేశం సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గంలో గెలిచినప్పటికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్ టీఆర్‌ఎస్ తీర్థం ఇప్పటికే పుచ్చుకున్నారు.

ఈ నియోజకవర్గంలోను సర్పంచ్‌లను టీఆర్‌ఎస్ అధికంగా గెలుచుకుంది. ఖమ్మం నియోజకవర్గంలో గ్రామీణ మండలంగా ఉన్న రఘునాథపాలెం పరిధిలోని 70 శాతం గ్రామాలు టీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ మాత్రం తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన్నప్పటికి చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా కొన్ని సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. అయితే ప్రస్తుతం జరగనున్న లోకసభ ఎన్నికల్లో ఈ పార్టీలు కూటమి కట్టే పరిస్థితి కనిపించడంలేదు. టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు మరోసారి పోటీ చేసేందుకు ఉవ్విల్లురుతున్నారు. కాంగ్రెస్ పార్టీనుంచి ఇప్పటికే అరడజన్ మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ఎంపీ రేణుకచౌదరి ఖమ్మం పార్లమెంటు సీటు తనకే కావాలని అధిష్టానం వద్ద పట్టుపడుతున్నారు. జిల్లాలో కోదండరామ్ నాయకత్వంలోని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏర్పడిన టీజేఎస్‌కు పార్టీని నడిపించే నాయకులే లేకుండాపోయారు.

520
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles