ప్రశాంతంగా నిర్వహిస్తాం..

Wed,March 13, 2019 12:20 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని నల్లగొండ జిల్లా రిటర్నింగ్ అధికారి గౌరవ్ ఉప్పల్, పోలీస్ నోడల్ అధికారి రంగనాథ్ వెల్లడించారు. ఈనెల 22న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌తోపాటు 26న జరిగే కౌంటింగ్‌కు సైతం ఏర్పాట్లు సిద్ధం చేశామని వివరించారు. వచ్చేనెల 11న జరగనున్న నల్లగొండ ఎంపీ ఎన్నిక పోలింగ్, మే 23న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం కూడా పక్కాగా ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు. రెండు ఎన్నికల ఓట్ల లెక్కింపునూ నల్లగొండ శివార్లలోని దుప్పలపల్లి వేర్ హౌజింగ్ గోదాములలో నిర్వహిస్తామని చెప్పారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడిజిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు నల్లగొండ పార్లమెంట్ ఎన్నికను సైతం పక్కాగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని ఈ రెండు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. మొత్తం 20,888మంది ఓటర్లున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ఈ నెల22న, కౌంటింగ్ 26న జరగనున్న నేపథ్యంలో ఇందుకోసం 2వేల మంది సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లోనూ వీడియో రికార్డ్ చేయడంతోపాటు మైక్రో అబ్జర్వర్లను సైతం నియమిస్తున్నామని చెప్పారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరుగుతుందని.. కౌంటింగ్ కోసం దుప్పలపల్లి గోదాములలో స్ట్రాంగ్ రూంలు సిద్ధం చేశామని కలెక్టర్ వివరించారు.

ఈనెల 15వరకు ఓటరు నమోదుకు గడువు : కలెక్టర్
పార్లమెంట్ ఎన్నికకు సైతం షెడ్యూల్ వెలువడి నేపథ్యంలో.. నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్న ప్రతి అంశాన్ని తొలగిస్తున్నామని.. కోడ్ అమలు కోసం 33 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు చొప్పున 21 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు.. వీటితోపాటు వీడియో, స్టాటిస్టిక్, వ్యయం అంచనా బృందాలను సైతం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు 1950 నంబరు ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలో మొత్తం 15,79,207 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 1990 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. ఓటరు నమోదుకు ఈ నెల 15వరకు అవకాశం ఉన్నందున అందరూ సద్వినియోగం చేసుకోవాలని.. ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్లు కూడా తమ తమ ఓట్లను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. ఎంపీ ఎన్నిక నిర్వహణకు 9 వేల మంది సిబ్బంది అవసరం ఉంటారని గుర్తించామని.. ఇప్పటికే సగం శిక్షణ సైతం పూర్తయిందని తెలిపారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరుగుతుందని.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే వీవీ ప్యాట్లను సైతం వినియోగిస్తామని చెప్పారు. జిల్లాలో సరిపడా ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని.. సూర్యాపేటకు కొన్ని రావాల్సి ఉందని వివరించారు.

4వేల మందితో బందోబస్తు : ఎస్పీ రంగనాథ్
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్‌శాఖ అన్ని ఏర్పాట్లు చేపడుతోందని నల్లగొండ పార్లమెంట్ స్థానం పోలీస్ నోడల్ అధికారి, జిల్లా ఎస్పీ రంగనాథ్ వివరించారు. ర్యాలీలు, సమావేశాలకు ఎక్కడికక్కడే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని.. ఎక్కడి పోలీస్ అక్కడే విధులు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలో మొత్తం 2వేల మంది సిబ్బందితోపాటు 20కంపెనీల పారా మిలిటరీ బలగాలు సైతం వస్తాయని.. కంబాలపల్లి, జాన్ పహాడ్ తండా వంటి సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఏపీ సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీ ఇప్పటికే ప్రారంభమైందని.. రూ.10 లక్షల లోపు నగదు పట్టుబడితే స్క్రీనింగ్ కమిటీకి.. రూ.10 లక్షల పైన పట్టుబడితే ఇన్‌కంట్యాక్స్ అధికారులకు.. పట్టుబడిన డబ్బు ఎన్నికలను ప్రభావితం చేయడానికే తీసుకెళ్తున్నారని తేలితే కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. డబ్బుతోపాటు మద్యం ప్రభావం కూడా లేకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో నిస్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో డీపీఆర్‌ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

222
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles