భళా.. కేసీఆర్..!

Sat,February 23, 2019 01:46 AM

-బడ్జెట్ ప్రవేశంతో మరో రికార్డు..
-తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
-రైతుబంధు కింద ఎకరానికి రూ. 10వేలు
-ఆసరా పింఛన్‌లు రెట్టింపు
-ప్రతీ నిరుద్యోగికి రూ. 3000 భృతి
-సొంత ఇంటి స్థలంలో నిర్మాణానికి ఆర్థిక సాయం
-ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై
-సర్వత్రా హర్షం
ఖమ్మం, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ మరో చరిత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం, రెండోసారి అధికారంలోకి రావడం ఒక చరిత్ర అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది తెలంగాణ రాష్ర్టానికి 6వ బడ్జెట్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ అనుసరిస్తున్న సమగ్ర ప్రగతిప్రణాళిక ఇవ్వాల దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఆయా పథకాలకు నిధులను అత్యధికంగా కేటాయించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధే ధ్యేయంగా నిధులు కేటాయింపు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు మన దగ్గర అమలవుతున్నందున వాటిని కొనసాగిస్తూ నిధులను సమకూర్చారు. దీర్ఘకాలిక అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. రాష్ర్టానికి వచ్చే ఆదాయంతో పాటు ఖర్చులను తగ్గించి సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు అభివృద్ధి పథకాలకు అత్యధికంగా నిధులు కేటాయించి ముఖ్యమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఆసరా పింఛన్ రెట్టింపు..
సీఎం కేసీఆర్ ఆసరా ఫింఛన్‌దారులకు తన బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి పింఛన్ మొత్తాన్ని రూ. 1000 ల నుంచి రూ. 2016 పెంచుతున్నట్లు, ఈ ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల పింఛన్ రూ. 1500ల నుంచి రూ. 3016 లకు పెంచుతున్నామన్నారు. జిల్లాలో వృద్ధులు 63,968, చేనేత కార్మికులు 463, వితంతువులు 65,398, గీత కార్మికులు 3,207, ఒంటరి మహిళలు 7,959, బీడీ కార్మికులు 2, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు 2,338, బోదకాలు బాధితులు 978 మంది. మొత్తం 1,67,983 మంది ఉన్నారు. వీరు కాకుండా దివ్యాంగులు 2630 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ప్రతీనెల ఆసరా పింఛన్‌ల పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రతీనెల రూ.1000 చొప్పున 1,67,983 మందికి మొత్తం రూ.16కోట్ల 79లక్షల 83వేలు అందిస్తున్నారు. ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి రూ. 1000లను రూ. 2016లకు పెంచడంతో ఏప్రిల్ నెల నుంచి ప్రతీ నెల 33కోట్ల 86 లక్షల 53వేల 728 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

పెంచిన పింఛన్ వల్ల ఒక ఖమ్మం జిల్లాలోనే ప్రతి నెల 17కోట్ల 6లక్షల 70వేల 728 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని 2630 మంది దివ్యాంగులున్నారు. వీరికి ప్రతినెల ఇప్పటి వరకు రూ. 1500లు ఇస్తుండగా ఏప్రిల్ మాసం నుంచి రూ. 3016 పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీని ద్వారా ప్రతీ నెల పెంచిన పింఛన్‌తో 79లక్షల 32వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. అదే పాత పింఛన్ ద్వారా 39లక్షల 45వేలు మాత్రమే చెల్లించేవారు. పెరిగిన పింఛన్ వల్ల ఖమ్మం జిల్లాకు దివ్యాంగులపై 39లక్షల 87వేల 080 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో అన్నిరకాల పింఛన్‌దారులు 1,70,613 మంది ఉండగా, వీరికి పెంచిన ఫించన్ వల్ల ప్రభుత్వంపై 17కోట్ల 46లక్షల 57వేల 808 రూపాయలు అదనపు భారం అవుతుంది. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్‌కు కనీస అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. దీని వల్ల జిల్లాలో సుమారు 10 వేలమందికి అదనంగా వచ్చే అవకాశం ఉంది.

సబ్సిడీ బియ్యానికి రూ. 2,744కోట్లు..
రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యంపై గత ప్రభుత్వాలు అమలు చేసిన కోటా పరిమితిని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసిందని సీఎం తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో బియ్యం చొప్పున అంత మందికి బియ్యం సరఫరా చేస్త్తున్నామన్నారు. విద్యార్థులందరికీ హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో వండిన అన్నం పెడుతున్నామన్నారు. బియ్యం సబ్సిడీల కోసం ఈ బడ్జెట్‌లో 2744 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రగతి నిధి చట్టం..
ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేసిన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం రెండు ఏండ్లుగా అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నిధిలో ఒక ఏడాదికి కేటాయించిన నిధులు ఖర్చుకాకుంటే ఆ నిధులను మరుసటి ఏడాదికి బదలాయింపు జరిగేలా చట్టంలో నిబంధన చేశామన్నారు. 2019- 20 బడ్జెట్‌లో ఎస్సీల ప్రగతి నిధికి 16వేల 581 కోట్ల రూపాయలను, ఎస్టీల ప్రగతి నిధికి 9827 కోట్ల రూపాయాలను ప్రతిపాదించడం జరిగిందన్నారు.

మైనార్టీల సంక్షేమానికి అధిక నిధులు..
ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలన్నీ మైనార్టీ వర్గాలకు చెందిన పేదలకు అందించాలని ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి అన్నారు. గత నాలుగు ఎండ్లలో 206 గురుకుల విద్యాసంస్థలను ప్రారంభించామని, కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో గురుకులాల ద్వారా మైనార్టీలకు విద్యను అందిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో ఏడు మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. వీటితో పాటు రంజాన్, క్రిస్మస్ వేడుకలను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ పండుగులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దుస్తువులను పంపిణీ చేస్తుంది. ప్రార్థనా మందిరాల్లో విందులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మసీదులలో ప్రార్థన చేసే ఇమామ్, మౌజన్‌లకు ప్రతినెల రూ. 5వేల చొప్పున భృతిని అందిస్తున్నామని వెల్లడించారు. మైనార్టీల అభివృద్ధికి ఈ వార్షిక బడ్జెట్‌లో 2004కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నామన్నారు.

వ్యవసాయానికి పెద్దపీట..
బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సీఎం పెద్దపీట వేశారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే దిశగా కేటాయింపులు చేశారు. రైతుబంధు, రైతుబీమా, భూరికార్డుల ప్రక్షళన, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన ఉత్సాహాన్ని నెలకొల్పిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 364 గోదాములను నిర్మించి 22.50లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గలిగిన గోదాములను అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు.

రుణమాఫీకి నిధులు..
రైతుల పరిస్థితి చక్కబడేంతవరకు ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని సీఎం అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3లక్షల 56వేల మంది రైతులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1711కోట్ల రూపాయలను మాఫీ చేసింది. ఈ మాఫీని నాలుగేండ్లలో నాలుగు విడతలుగా అమలు చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా రైతు రుణమాఫీకి 6వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

రైతుబీమా ద్వారా రూ. 5 లక్షలు..
దురదృష్టవశాత్తు ఏ రైతు అయినా మరిణిస్తే అతని కుటుంబం వీధిన పడవద్దు అనే ఉద్దేశంతో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణాల వల్ల మరణించినా అతని కుటుంబానికి 5 లక్షల రూపాయలను కేవలం పది రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతుల తరఫున బీమా చెల్లించడం కోసం ఈ బడ్జెట్‌లో 650కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 420 మంది రైతులు చనిపోగా 395 మందికి రూ. 5లక్షల చొప్పున వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు.

మిషన్ కాకతీయ..
మిషన్ కాకతీయ ద్వారా చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి తద్వారా భూగర్భ జలమట్టం ఘననీయంగా పెరిగిందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని చెరువులన్నీ నింపడానికి వీలుగా గొలుసుకట్టు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందన్నారు. మొదటి చెరువు నిండి పారే నీరు క్రమంగా చివరి చెరువుదాక చేరే విధంగా కాల్వలను బాగుపరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాది నుంచే కాలువల ద్వారా చెరువులు నింపే కార్యక్రమం చేపడతామన్నారు.

ఏప్రిల్ నెలాఖరు నాటికి మిషన్ భగీరథ నీళ్లు..
మిషన్ భగీరథ పథకానికి ఇప్పటికే అవిభక్త ఖమ్మం జిల్లాలో రూ. 3,825కోట్లతో భగీరథ పనులు పూర్తయ్యాయి. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ఇంటింటికీ నల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడా నీళ్లను అందించాలన్నదే తన ధ్యేయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి అందరికీ మంచి నీటిని అందిస్తామన్నారు. ప్రతీ ఇంటికి నల్లాలు బిగించి మంచి నీరు అందిస్తామన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లకు అధిక నిధులు..
నీరుపేదలు గృహనిర్మాణ పథకం అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అన్నారు. డబుల్ బెడ్‌రూం పథకం కింద ఇప్పటి వరకు 2లక్షల 72వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

విద్యారంగానికి అత్యధిక నిధులు..
ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. కేజీ టూ పీజీ ఉచిత విద్య విధానంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోరకు రాష్ట్రంలో 542 కొత్త గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించబోతుందని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినీల కోసం 51 డిగ్రీ గురుకులలాను ప్రారంభించామన్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున లక్ష రూపాయలను ఖర్చు చేస్తూ మంచి భోజనం, వసతి, సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అందించేందుకు ఓవర్సీస్ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఈఎన్‌టీ దంత పరీక్షలు..
కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు ఊరూరా నిర్వహిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు చేస్తామన్నారు. దీని కోసం బడ్జెట్‌లో 5536 కోట్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. కేసీఆర్ కిట్టు పథకం ద్వారా నిరుపేద గర్భిణులకు 12వేలు అందిస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రసవాల సంఖ్య 33 నుంచి 49 శాతానికి పెరిగిందన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఐసీయూ కేంద్రాల సంఖ్య పెంచడం జరిగిందన్నారు.

హర్షం వ్యక్తం చేస్తున్న సబ్బండవర్ణాలు..
తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని అహర్నిశలు పాటుపడుతున్న సీఎం కేసీఆర్ 2019-20 వార్షిక బడ్జెట్‌లో అన్నిరంగాలకు తగిన రీతిలో నిధులు కేటాయించారు. దీంతో జిల్లాలోని సబ్బండవర్ణాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్‌ను వేనోళ్ల పొగుడుతున్నారు. ఇప్పటివరకు పైసా పన్ను వేయకుండా తమ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో ఇదే అవుతుందని అంటున్నారు. సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా పాటుపడుతున్న సీఎం కేసీఆర్ పది కాలాలపాటు చల్లంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

రైతుబంధు ద్వారా ఎకరానికి రూ. 10వేలు..
రైతు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి కోసం ప్రతి ఏడాది ఎకరానికి 8వేల రూపాయలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది నుంచి రైతుబంధు పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ. 10వేలకు పెంచుతున్నామన్నారు. ఎకరానికి రూ. 5వేలు చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి 10వేల రూపాయలు ఇస్తామన్నారు. ఈ బడ్జెట్‌లో 12వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగిందన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో 2లక్షల 80వేల మందికి ఎకరానికి 8వేల చొప్పున రూ. 535కోట్లు రైతులకు ప్రభుత్వం చెల్లించింది.

సీతారామకు అనుమతులు తెచ్చాం..
నదీ జలాలలో తెలంగాణ రాష్ర్టానికి ఉన్న వాటాను సమర్థవంతంగా వినియోగించుకుని కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని సీఎం అన్నారు. నాలుగేళ్లలోనే 90శాతం నిర్మాణ పనులను పూర్తి చేశామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు సాధించుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకు నీరు అందివ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులని ఈ 5 ఏండ్లలో పూర్తి చేస్తామన్నారు.

నిరుద్యోగ భృతి రూ. 3వేలు..
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ప్రతీ నెల రూ. 3016 నిరుద్యోగ భృతి అందివాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ పథకం అమలు కోసం విధి విధానాలను రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. నిరుద్యోగ భృతి అందించడం కోసం ఈ బడ్జెట్‌లో 1810 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నట్లు సీఎం తెలిపారు.

288
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles