జిల్లా పరిషత్ ఎన్నికలకు సమాయత్తం

Thu,February 21, 2019 12:16 AM

-జిల్లాలో తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు
-ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
-రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి మార్గదర్శకాలు
-జిల్లా పరిషత్ విభజన దిశగా అడుగులు
-పునర్విభజనతో రెండు జిల్లా పరిషత్‌లు

మామిళ్లగూడెం: ఖమ్మం జిల్లాలో మరోసారి ఎన్నిక కోలాహలానికి గ్రామాలు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనుండటంతో పల్లెల్లో రసవత్తరమైన చర్చలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలు వాటికి రిజర్వేషన్లు, ప్రధానంగా మండల పరిషత్‌లో కీలకంగా వ్యవహరించే ఎంపీపీ స్థానం రిజర్వేషన్లపై లెక్కలు వేస్తున్నారు. అదేవిధంగా మండల, జిల్లాస్థాయి నాయకులు మండలస్థాయిలో జడ్పీటీసీ స్థానం రిజర్వేషన్లు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ స్థానం రిజర్వేషన్లపై లెక్కలు కట్టడంతోపాటు పోటీకి అనుకూలంగా ఉండే మండలాలపై పట్టు సాధించేందుకు ప్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. పెద్ద నాయకులకు పార్లమెంటు ఎన్నికలు, చిన్న నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలు గుండెల్లో రైళ్లు పరుగెత్తించనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది. దీంతో స్థానిక సంస్థలలో పోటీ చేసే ఆశావహులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. జిల్లాలో 583 పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు 348 మంది విజయం సాధించారు.

దీంతో రానున్న పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలలోను టీఆర్‌ఎస్ ఆధిపత్యం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రామపంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్- 117, టీడీపీ-25, సీపీఎం-24, బీజేపీ-01, సీపీఐ-18, ఇతరులు-50 గ్రామాల్లో గెలిచిన్నప్పటికీ రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు మరోసారి భంగపాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో 20 గ్రామీణ మండలాల్లో అత్యధికంగా ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని, మండల పరిషత్‌లో కీలకంగా వ్యవహరించే ఎంపీపీ సీటుపై టీఆర్‌ఎస్ గురిపెట్టింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే పక్కా వ్యూహాలతో ముందుకెళ్లాలని గ్రామ నాయకత్వాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వస్తే ఒకేసారి ప్రజల్లోకి టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రెండు ఎన్నికల్లోనూ విజయం ఢంకా మోగించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జిల్లా పరిషత్ అధికారులు

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా ప్రజాపరిషత్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు, రిజర్వేషన్ల ప్రక్రియ, ఓటర్ల జాబితా వంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. అందుకు అనుగుణంగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతోపాటు ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాల రిజర్వేన్లను గ్రామపంచాయతీ ఎన్నికల మాదిరిగానే 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలులోకి తీసుకొచ్చిన నూతన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం రిజర్వేషన్ల అమలును వరుసగా రెండు పర్యాయాలు (10 ఏండ్లు) ఒకే సామాజిక వర్గానికి కొనసాగించనున్నారు.

గ్రామస్థాయిలో జరిగే ఎంపీటీసీ, మండలస్థాయిలో జరిగే జడ్పీటీసీ స్థానాలను రిజర్వేషన్లు కేటాయించడంతో అధికారులు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 20 గ్రామీణ మండలాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఎంపీటీసీ స్థానాలను నిర్ణయించనున్నారు. ఎక్కువ జనాభా కలిగిన పెద్ద గ్రామం పేరుతో ఎంపీటీసీ స్థానం ఉంటుంది. ఒకే ఎంపీటీసీ స్థానంలో చుట్టు పక్కల గ్రామపంచాయతీలూ కలిసి ఉండటంతో ఆ గ్రామాలను జనాభా లెక్కల ప్రకారం పెద్దగా ఉంటుందో అదే పేరుతో ఎంపీటీసీ స్థానాన్ని పిలుస్తారు.

తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజించారు. జిల్లాల దస్ర్తాన్ని కేంద్ర ఆమోదంతో పాటు రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం పంపించారు. అయితే జిల్లాల ఏర్పాటుకు రాష్ట్రపతి నుంచి త్వరలోనే ఆమోదం రానున్నట్లు ప్రభుత్వం వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా తెలంగాణ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీటీసీ స్థానాల ఖరారు, జడ్పీటీసీల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నప్పటికీ త్వరలోనే జిల్లా పరిషత్‌ల విభజన పూర్తి కానుండటంతో ప్రస్తుతం ఉన్న జిల్లాలో గతంలో కంటే 18 ఎంపీటీసీ స్థానాలు తగ్గనున్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ విభజన పనులూ అధికారులు చకచకా కానిస్తున్నారు.

ఇటీవల వైరా పంచాయతీని నగర పంచాయతీగా ఏర్పాటు చేయడంతోపాటు ఖమ్మం నగరంలో పక్కనే ఉన్న ఖమ్మం రూరల్ మండలంలోని గ్రామాలను విలీనం చేయడంతో, మధిర మున్సిపాల్టీలో కొన్ని గ్రామాలు విలీనంచేయడంతో 18 ఎంపీటీసీ స్థానాలు తగ్గనున్నాయి. ప్రస్తుతం ఉన్న 20గ్రామీణ మండలాల్లో 306ఎంపీటీసీ స్థానాలు ఉన్నా.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మాత్రం 289ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 20జడ్పీటీసీ స్థానాలతో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక జరగనుంది. పురపాలక, నగరపాలక సంస్థలో గ్రామాలు వీలీనమైన కారణంగా ఖమ్మంరూరల్ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు, వైరా మండలంలో-6, కొణిజర్ల మండలంలో-3 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి.

250
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles