నగరానికి సురక్షిత నీరు

Wed,February 20, 2019 01:16 AM

-అందరికీ ఆరోగ్యమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం
-ఖమ్మంలో శరవేగంగా మిషన్ భగీరథ పనులు
-నగరంలో నిరంతర నీటి సరఫరాకు కసరత్తు
-కొత్తగా 17 వాటర్ ట్యాంకులు, 45 కి.మీ పైపులైన్లు
-పాతవి 31 వేలు, కొత్తగా 45 వేల నల్లా కనెక్షన్లు
-రూ. 230 కోట్లతో కొనసాగుతున్న పనులు
-వచ్చే నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అధికారుల యత్నం
-నిత్యం పర్యవేక్షిస్తున్న ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్
ఖమ్మం, నమస్తే తెలంగాణ:‘‘వచ్చే నెల 31 నాటికి మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి ఇంటింటికీ మంచినీరును అందించే మహత్తర కార్యక్షికమాన్ని పూర్తి చేయాలి.’’

-ఇవీ.. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ఇటీవలి మిషన్ భగీరథ పనుల సమీక్షలో సీఎం ఆదేశాలు..
వలస పాలనలో తాగునీటి కోసం జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఖమ్మం నగర ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా ఉండేది. అదీ అర్ధగంట మాత్రమే వచ్చేవి. ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు నీటి ఎద్దడే. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటింటికీ మంచినీటిని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు సంకల్పించింది.. అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి పట్టణం, పల్లె గొంతు తడిపేందుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే నగరంలోని ప్రతి ఇంటికీ సరిపడా మంచినీటిని అందించే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేసింది. ఖమ్మం కార్పొరేషన్‌ను ఇరవై ఏడు జోన్లుగా విభజించించారు. అన్ని ప్రాంతాలకూ పైపులైన్లు నిర్మాణం చేసే కార్యక్షికమం శరవేగంగా జరుగుతోంది. ఒక్కో కుటుంబానికి రోజుకు 150 లీటర్ల శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేసే నిమిత్తం పనులు జరగుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఖమ్మం నగరం కార్పొరేషన్‌గా అవతరించాక అప్పటికే ఉన్న వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ ప్రాంతాలకు అదనంగా ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాలకు చెందిన తొమ్మిది గ్రామాలు నగరంలో విలీనమయ్యాయి. వాటన్నింటినీ కలుపుకొని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్లుగా ఏర్పడింది. ఆయా ప్రాంతాలన్నింటికీ ఒకే పద్ధతిలో, ప్రజలందరికీ సరిపడా మంచినీటిని సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ సర్కారు భావించింది. ఖమ్మం కార్పొరేషన్‌లోని ఇంటింటికీ మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. మొత్తం రూ.230 కోట్లతో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రూ.115 కోట్లను కేటాయించింది. మిగిలిన మరో రూ.130 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఖమ్మంలోని 50 డివిజన్ల పరిధిలోని అన్ని వాడలకూ శుద్ధమైన జలాల్ని సరఫరా చేసే ప్రక్రియ బాధ్యతను జిల్లా ప్రజారోగ్యశాఖ (పబ్లిక్ హెల్త్)కు అప్పగించింది. ఖమ్మంలో ప్రస్తుతం జరుగుతున్న నీటి సరఫరాకు అదనంగా రాబోయే 15 ఏళ్లలో ఎలాంటి నీటి ఎద్ధటి తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.

27 జోన్లుగా ఖమ్మం విభజన..
నగరపాలకం పరిధిలోని ప్రతి ప్రాంతంలో కనీస మౌలిక వసతులు కల్పించటంలో గత కాంగ్రెస్, సీపీఎం పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. తాగేందుకు సరిపడా మంచినీటిని కూడా అందించలేకపోయారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం రెండు, మూడు రోజులకోసారి అర్ధగంట పాటు మాత్రమే నీటిని సరఫరా చేసి చేతులు దులుపుకునేవారు. మురికి వాడలు, ఎత్తయిన ప్రాంతాల ప్రజలకు వారానికి ఒకసారి మున్సిపల్ నీరు అందినా ఆశ్చర్యమే. కానీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు బిందె పట్టుకొని నీటి కోసం నిమిషం కూడా నిరీక్షించకూడదని సీఎం కేసీఆర్ ప్రతినబూనారు. ప్రతి పల్లెకూ, ప్రతి పట్టణానికీ వచ్చే నెల నుంచి నీటిని అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో నగరంలోని యాభై డివిజన్లకు నీటి సరఫరా అందించేందుకు ఖమ్మం నగరాన్ని 27 జోన్లుగా విభజించింది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షణలో పాత, కొత్త విధానాలను మేళవించి నీటి సరఫరాకు అవసరమైన కార్యాచరణను ప్రారంభించింది.

17 కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం
పాత మున్సిపాలిటీతోపాటు నగరపాలకంలో విలీనం అయిన గ్రామాలను కలుపుకొని రోజుకు ఫిల్టర్‌బెడ్ ద్వారా 37 ఎంఎల్‌టీ, బోరు బావుల ద్వారా మరో 4 ఎంఎల్‌టీ నీటిని కేఎంసీ యంత్రాంగం సరఫరా చేస్తోంది. దీనికిగాను 14 ఓవర్‌హెడ్ ట్యాంకులను వినియోగిస్తూ 31,600 నల్లాలకు నిరంతరం నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం నగర పరిధి ఊహించని రీతిలో పెరిగింది. అధికారుల లెక్కల ప్రకారం జనాభా దాదాపు 4 లక్షలు దాటింది. వారందరికీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం మంచినీటి సరఫరా చేయాలని నగరపాలక అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యపడటం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నగర మంచినీటి అవసరాల కోసం రూ.230 కోట్లు మంజూరు చేసింది.

ఆయా నిధులతో విలీన ప్రాంతాలను కలుపుకొని ఖమ్మంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొత్తగా 17 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. వీటి ద్వారా ప్రతి రోజూ 1 మిలియన్ల నీటిని సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికను రూపొందించారు. అదేవిధంగా ఖమ్మం నగరంలో 50 డివిజన్లను కలుపుకొని దాదాపు 45 కి.మీ. మేర పంపిణీ లైన్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 346 కిలో మీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేశారు. మిగిలిన పైపులైన్ల నిర్మాణం కూడా ఈ నెలాఖరులోగ పూర్తి చేసేలా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో పగలు ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో పనులు రాత్రి వేళలో కొనసాగిస్తున్నారు. రోడ్ల వెంబడి కాలువలు తవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున రాత్రి వేళలో పనులను చేస్తున్నారు. ఈ కారణం వల్ల పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ నిర్దేశించిన లక్ష్యంలోగా పనులను పూర్తిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఖమ్మంలో 76 వేల నల్లా కనెక్షన్లు
నగరంలో ప్రస్తుతం దాదాపు 0 వేల కుటుంబాలు ఉన్నాయని అధికారుల అంచనా వేస్తున్నారు. మంచినీటి సరఫరా విషయానికి వస్తే కమర్షియల్, నాన్ కమర్షియల్ కలుపుకొని 31,600 నల్లా కనెక్షన్‌లు ఉన్నాయి. కాగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఉండాలని, ప్రతిరోజూ సరిపడా మంచినీటి సరఫరా జరగాలనే సీఎం కేసీఆర్ ఆశయంలో భాగంగా ఖమ్మంలోని అన్ని గృహాలకూ నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు పబ్లిక్ హెల్త్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రానున్న పదిహేనేండ్లకు సరిపడా మంచినీటి ట్యాంకులు, మరో 30 ఏండ్ల వరకు ఎలాంటి ఇబ్భందులూ తలెత్తకుండా పంపింగ్‌లైన్స్‌ను ఏర్పాటు చేస్తున్న అధికారులు పాత వాటితో సంబంధం లేకుండా అన్నీ కలుపుకొని 76 వేల నల్లా కనెక్షన్లు ఉచితంగా ఏర్పాటుచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఇంటి యజమానికి నయాపైసా ఖర్చు లేకుండా కేఎంసీకి నల్లా డిపాజిట్లు, రోడ్డు కటింగ్ చార్జీలన్నింటినీ ప్రభుత్వమే భరించనుంది. ఈ క్రమంలోనే పైపులైన్స్‌కు మోటార్లను బిగించి నీటిని దొంగిలిస్తున్న ప్రబుద్ధుల ఆటను కట్టించటంతోపాటు దుబారాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి నల్లా కనెక్షన్‌కూ మీటర్ బిగించబోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ప్రతిరోజూ ఒక్కో మనిషికి 150 లీటర్ల శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయనున్నారు. అయితే ఇప్పటికే ఖమ్మంలో పాత నల్లా కనెక్షన్లు 31 వేలు ఉండగా కొత్తగా మరో 45 వేల నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు కొత్త వాటిలో 13 వేల నల్లా కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన కనెక్షన్లు కూడా త్వరలో ఇచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

జీళ్లచెర్వు నుంచి ఖమ్మానికి సరఫరా
జిల్లా ప్రజలందరికీ మంచినీటిని అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పూర్తయ్యాయి. దీనిలో భాగంగానే ఖమ్మానికి కూడా మంచినీటిని అందించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నవి. తొలుత పాలేరు జలాశయం నుంచి జీళ్లచెర్వు వరకు ‘రా’వాటర్‌ను తరలించి శ్రీవేంక స్వామి ఆలయం పక్కనే నిర్మిస్తున్న ఫిల్టర్‌బెడ్‌లో నీటిని శుద్ధిచేసి ఖమ్మానికి పంపిస్తారు. నగరంలోని ఎన్నెస్పీ కాలువ దాటిన వెంటనే ‘రస్తోగినగర్’నుంచి ఖమ్మం నగరంలోకి మంచినీటిని తరలిస్తున్నారు. ఖమ్మంలోని 50 డివిజన్ల పరిధిలో పాత, కొత్త నీటి ట్యాంకులకు సరఫరా చేస్తారు. దీనికిగాను 3 కి.మీ ఫీడర్ గ్రావిటీ లైన్స్, 45 కి.మీ పంపిణీ లైన్స్‌ను నిర్మిస్తున్నారు.

ఎమ్మెల్యే అజయ్ పర్యవేక్షణ
ఖమ్మం ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారం చూపించే ప్రతిష్టాత్మక మంచినీటి ప్రాజెక్టు పనులను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిర్ణీత గడువులోపు పనులన్నీ పూర్తికావాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని పదేపదే గుర్తుచేస్తున్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణం తదితర విషయాలపై నగరపాలకం, ప్రజారోగ్యశాఖల యంత్రాంగాలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు.

263
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles