అనుమతుల్లేకుండా ‘బాలపేట’లో వెంచర్.!

Wed,February 20, 2019 01:13 AM

- ప్లాట్లు చేసి విక్రయిస్తున్న రియల్టర్లు
- అనుమతిలేని ప్లాట్ కొంటే ఇక అంతే
- క్రయవిక్రయాలపై అవగాహన ముఖ్యమంటున్న నిపుణులు
రఘునాథపాలెం, ఫిబ్రవరి19: రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నేడు చాలా ఈజీ అయిపోయింది. కూసింత భూమి ఉంటే చాలు..దానికి రోడ్లు పోసి, ప్లాట్లు చేసి, రాళ్లకు రంగులేసి, చుట్టూరా రంగు రంగు జెండాలు పెడితే చాలు వెంచర్ తయారైనట్లే. ఇంకేముంది అందమైన బ్రోచర్ తయారు చేయించి మార్కెట్‌లో పెడితే చాలు అమ్మకాలు ఇట్టే జరిగిపోతాయి. వ్యవసాయం చేసినప్పుడు లక్షల్లో పలికిన భూమి.. వెంచర్‌గా కోట్లు సంపాదించి పెడుతుంది. ఇదీ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై నేటి రియల్టర్లు చేస్తున్న ఆలోచన. వెంచర్ ఏర్పాటులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నింబంధలకు తిలోదకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

తీరా లే-అవుట్ లేకుండా ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు కొన్నాళ్లకు అయ్యో..రామచంద్రా అంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన సంఘటనలు ఖమ్మం అర్బన్ పరిధిలో కోకొల్లలు. ఇలాంటి ప్లాట్లు కొన్నసమయంలో వ్యాపారులు మోసాలు చేశారని పోలీస్ స్టేషన్‌లోనూ అనేక ఫిర్యాదులు సైతం నమోదయ్యాయి. ప్రస్తుతం ఖమ్మం నగర శివారు బాలపేట తండాకు ఆనుకొని కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్‌లోనూ స్థిరాస్థి వ్యాపారులు నిబంధనలు మరిచారనే విమర్శలు ఉన్నాయి. లే-అవుట్ తీసుకోకుండానే వెంచర్ చేసి ప్లాట్ల అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్లాట్లు కొనుగోలు చేసే ముందు.. కొనుగోలు చేసే ముందు స్థలం ఎలాంటిదో ముందుగా తెలుసుకోవాలి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి భూమి విలువలో పది శాతం పన్ను చెల్లించి ఆర్డీవో నుంచి అనుమతి పొందాలి. ఆ తరువాత వెంచర్‌ను ఏర్పాటు చేసిన వారు డివిజన్ పంచాయతీ నుంచి లే అవుట్ అనుమతి తీసుకున్నారో, లేదో తెలుసుకోవాలి. మొత్తం భూమిలో 10 శాతం భవిష్యత్తు అవసరాల కోసం డివిజన్ పంచాయతీ పేరున రిజిస్ట్రేషన్ చేయించారో లేదో తెలుసుకోవాలి. అనుమతి లేని వెంచర్లలోని స్థలాలు కొనుగోలు చేస్తే ఆ భారం కొనుగోలు చేసిన వారిపై పడుతుంది. వ్యక్తిగతంగా అనుమతులు తీసుకోవడం కష్ట సాధ్యమౌతుంది.

ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి చేసే స్థలాల గురించి సమక్షిగంగా తెలుసుకోవల్సిన అవసరం ఉంది. కానీ బాలపేట తండాకు అనుకుని బల్లేపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 141/1లో ఏర్పాటైన వెంచర్ విషయంలో రియల్టర్లు లే-అవుట్‌కు అవసరమైన నిబంధనలు మరిచి అమ్మకాలు మొదలు పెట్టినట్లు స్థానికుల ద్వారా తెలియవచ్చింది. ఇక్కడ ఆరున్నర ఎకరాల్లో ఏర్పాటైన వెంచర్‌లో పది శాతం గ్రీన్ బెల్ట్‌గా కేటాయించాల్సి ఉండగా మొత్తంగా ప్లాట్లు చేసి అమ్మకాలు సాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఖమ్మం నగర పరిధిలోనే కోట్ల విలువ చేసే భూములు వెంచర్‌గా మారి రహస్య అమ్మకాలతోప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా సంబంధిత అధికారులు అటుగా కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

248
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles