బీసీల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

Tue,February 19, 2019 01:31 AM

-ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్, నమస్తే తెలంగాణ : సాధించుకున్న తెలంగాణలో బీసీల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దానికి అనుగుణంగానే దరఖాస్తు చేసుకున్న వారికి వందశాతం సబ్సిడీ రుణం ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం రూరల్ మండల పరిషత్ సమావేశపు హాల్‌లో మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మండలంలోని 252మంది బీసీలకు గాను రూ.1.20 కోట్ల పూర్తి సబ్సిడీ చెక్కులను ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి దఫా కింద రూ.50 వేల రుణంలోపు వారికి 4వేల మందికి రూ. 20కోట్ల చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి లక్ష, రెండు లక్షలు ఆపైన ఎంపికైన లబ్ధిదారులకు కూడ త్వరలో కొంత సబ్సిడీపై రుణాలను ప్రభుత్వం ఇస్తుందన్నారు. నిరుద్యోగ యువత చిరువ్యాపారులకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రుణాన్ని సద్వినియోగం చేసుకుని బీసీలు ఆర్థికంగా ఎదగాలన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచిలు తమ ప్రజలకు సేవ చేసి మంచిపేరు సాధించాలన్నారు. సేవలను తరతరాలుగా గుర్తుంచుకునే విధంగా పాలన చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడ నూతన సర్పంచిలకు ఫుల్ పవర్ ఇచ్చిందన్నారు. చట్టసవరణ చేసి సర్పంచులకే సర్వధికారులు అప్పగించిందన్నారు. ఈసారి ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిధులు లేకపోవడంతో నిరాశ చెందారని, కేంద్ర ప్రభుత్వం వారికి వచ్చే నిధులను నెరుగా పంచాయతీ అకౌంట్‌లోనే జమ చేయడంతో ఈ సమస్య వచ్చిందన్నారు.

పైసమస్య పలుమార్లు కేంద్రంతో సీఎం కేసీఆర్ కూడా చర్చించారని తెలిపారు. సర్పంచ్‌ల చేతిలోనే గ్రామ భవిష్యత్ ఉంటుందన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం.. నిబంధనలకు లోబడి పాలన సాగించి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. అనంతరం శాఖలవారిగా ఎంపీపీ మేళ్లచెర్వు లలిత అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. తొలిసారిగా సర్వసభ్య సమావేశానికి వచ్చిన నూతన సర్పంచ్‌లు సమస్యలపై గళమెత్తారు. గ్రామంలో పలురకాల మౌలిక వసతులపై అధికారులను నిలదీశారు. పంచాయతీలో పనిచేస్తున్న వర్కర్‌లకు ప్రభుత్వమే జీతం చెల్లించాలని ఎంపీ పొంగులేటికి వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ లతిత మాట్లాడుతూ నూతన సర్పంచ్‌లు సమర్థవంతమైన పాలన అందించి ప్రజల మన్నన్నలు పొందాలన్నారు. ఎంపీ పొంగులేటి చేతులమీదుగా బీసీలకు చెక్కులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. జడ్పీటీసీ ధరావత్ భారతి మాట్లాడుతూ నూతనంగా సర్పంచ్‌లకు హార్థిక శుభకాంక్షలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఎంపీ పొంగులేటి తొలిసారిగా మండల సర్వసభ్య సమావేశానికి వచ్చి లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం మంచిపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ మౌలానా, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ ప్రభాకర్‌రావు, రూరల్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, సొసైటీ చైర్మన్ మంకెన నాగేశ్వర్‌రావు, సర్పంచిలు కళ్లెం వెంకటరెడ్డి, సుదర్శన్, పాండు, సావిడి నాగమణి, యండపల్లి రాధిక, కళ్లెం ముత్తయ్య, పద్మ, ఎంపీటీసీలు ఆనంద్, కాళంగి మోహన్‌రావు, రాములు, మండల అధికారులు ఉన్నారు.

195
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles