ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం భరోసా..

Mon,February 18, 2019 01:22 AM

-సర్పంచ్‌లకు శిక్షణ తరువాత ప్రోత్సాహక నిధులు విడుదల
-నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాలనకు మార్గదర్శకాలు
-ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చిన మాటను నెరవేర్చనున్న సీఎం కేసీఆర్
-పల్లెలో అభివృద్ధికాంతులు వెల్లువిరిసేలా ప్రణాళికలు
ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాల్లో అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏకగ్రీవంగా పంచాయతీల్లో పాలకవర్గాలను ఎన్నుకుంటే ఆయా గ్రామాల్లో ప్రజలకు మౌళిక వసతులు, గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు జిల్లాలో ప్రజలు తమ గ్రామాల పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఆసక్తి చూపించారు. దీనికి అనుగుణంగానే జనవరి నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో జిల్లావ్యాప్తంగా 73 గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో తమ గ్రామాల అభివృద్ధికి ప్రజలు ప్రగతిశీల భావాలతో పాలకవర్గాలను ఏకగ్రీవంగా ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుకు పెద్దఎత్తున స్పందించారు.

గ్రామ సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పల్లెలో ప్రగతికాంతులు పూయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసిన పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అవసరాలు, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నూతన పంచాయతీరాజ్ చట్టం-2018ని అమలులోకి తెచ్చారు. దీని ప్రకారంగానే గ్రామాల్లో పరిపాలన కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో చట్టం అమలుచేయాలంటే గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైనా ప్రజాప్రతినిధులకు చట్టం పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు ఎన్నికల ముగిసిన వెంటనే జిల్లా అధికారులు పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణ పొందేందుకు 10మంది సమన్వయకర్తలను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణకు పంపించారు. ఇప్పటికే వారు శిక్షణ ముగించుకుని జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగిన 583పంచాయతీల సర్పంచ్‌లకు ఈనెల 18 నుంచి ఐదు దశలలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

ఒక్కో బ్యాచ్‌కు ఐదురోజుల చొప్పున సర్పంచ్‌కులకు వసతితో కూడిన ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణ తరగతులు ముగిసిన తరువాత వారికి పల్లెపాలనపై అవగాహన, గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు సర్పంచ్‌ల బాధ్యత, గ్రామ కార్యదర్శుల విధులు వంటి వాటిపైన పూర్తిస్థాయి అవగాహనకు రానున్నారు. ఈవిధంగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు చట్టంపై పూర్తి పట్టు సాధించిన తరువాత ముందుగా ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన ప్రకారం ఏకగ్రీ పంచాయతీల్లో జనాభా లెక్కల ప్రకారం ఆయా పంచాయతీలకు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు నిధులు విడుదలకు ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. జిల్లాల వారిగా ఏకగ్రీవ పంచాయతీల వివరాలను ఎన్నికల కమిషన్ నుంచి తీసుకున్న రాష్ట్ర ఉన్నతాధికారులు ఆయా గ్రామాల జనాభాల లెక్కలు, కేటగిరిల వారిగా విభజన చేసి నిధులు మంజూరుకు దస్త్రం సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

నూతన చట్టం ప్రకారమే పాలన...
గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం పాలన కొనసాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. దీని ప్రకారం మే గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గాలు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, చట్టంలో ఉన్న నిబంధనలు విడుదల చేశారు. ప్రధానంగా ప్రజలు ఆశించిన స్థాయిలో గ్రామాల్లో మౌళికల వసుతుల కల్పన, ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు మార్గదర్శకాలను విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల పాత్ర, వారి విధులు, అలాగే ఉప సర్పంచ్‌ల బాధ్యతలను నూతన పంచాయతీ చట్టంలో స్పష్టంగా ఉంది. దీనికి అనుగుణంగానే పాలన కొనసాగించాలని రూపొందిచిన మార్గదర్శకాలను ఇప్పటికే జిల్లా అధికారులకు విడుదల చేశారు. గ్రామ కార్యదర్శులకు దాదాపు 30రకాల విధులను కేటాయిస్తూ ఇప్పటిక ఉత్తర్వులు జారీచేశారు. దీంతో గ్రామాలలో అభివృద్ధి కాంతులు వెల్లు విరిసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అదేవిధంగా వరస ఎన్నికలు జరుగనున్న నేపధ్యం, సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు ఉన్న కారణంగా నిధులు విడుదల కొంత సమయం పడుతుంది. దీంతో జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసా ప్రకారం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయనున్నారు.

271
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles