ప్రలోభాల పర్వం

Sun,January 20, 2019 01:52 AM

-ఓటర్లకుఅభ్యర్థుల గాలం
-డబ్బులు, మద్యంతో ఎర..
-ఒక్కో ఓటుకు వెయ్యిపైనే
-మేజరు పంచాయతీల్లో రూ.2వేలు..
భద్రాచలం, నమస్తే తెలంగాణ: గ్రామ పంచాయతీ తొలి విడుత ఎన్నికల సమరానికి ఒక రోజు మాత్రమే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి విడుత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21న జరగనున్నాయి. తొలి విడుత ఎన్నికలు జిల్లాలోని అశ్వాపురం, బూర్గంపహాడ్, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో జరుగనున్నాయి. ఇప్పటికే 22 సర్పంచ్, 321 వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ బరిలో 450 మంది, వార్డు సభ్యుల బరిలో 2,815 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రచార గడువు శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇక అందరి దృష్టి ఓటింగ్ ఉంది. జిల్లాలోని కొన్ని పట్టణ, పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో అభ్యర్థులూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ కావాలనే ఆకాంక్షతో ఖర్చుకూ వెనుకాడటంలేదు. కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు కోసం ఒక్కో ఓటు రూ.వెయ్యికి పైనే చెల్లించేందుకు అభ్యర్థులు ముందుకొస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, పల్లెలన్నీ మద్యంతో జోగుతున్నాయి.

జోరుగా కుల, ఇతర సంఘాలకూ ఎర..
స్థానిక ఎన్నికలు కావడంతో కుల, ఇతర సంఘాలకు ఎర వేసేందుకు అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కుల సమీకరణాలు రోజు రోజుకూ మారుతున్నాయి. తమ కులానికి చెందిన వారిని గెలిపించుకునేందుకు కొందరు రహస్య సమావేశాలూ నిర్వహిస్తున్నారు. ఈ సారి ఉప సర్పంచ్ పంచాయతీలో సర్పంచ్ జాయింట్ చెక్కు పవర్ ఉండటంతో ఉప సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కొందరు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తమతో కలిసొచ్చే వారితో ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారు. ఇక వార్డు మెంబర్లు సైతం గెలుపుపై సీరియస్ దృష్టిసారించారు. ఉప సర్పంచ్ ఎన్నుకునేందుకు వార్డు మెంబర్లూ కీలకం కావడంతో ఎలాగైనా గెలుపొందాలనే ఆకాంక్షతో వార్డులో బరిలో ఉన్న వారూ ఖర్చుకు వెనుకాడటం లేదు. ఎక్కడికక్కడ తమ కులానికి చెందిన వారికి తాయిలాలు ఇస్తూ తమవైపే మొగ్గుచూపేలా కొందరు అభ్యర్థులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
దళారులదే మళ్లీ హవా
అసెంబ్లీ ఎన్నికల్లోలాగానే పంచాయతీ ఎన్నికల్లోనూ దళారులే మళ్లీ చక్రం తిప్పుతున్నారు. సర్పంచ్, వార్డుమెంబర్లుగా బరిలో నిలిచిన వారికి తాము అండగా ఉంటామంటూ ఓట్లు వేయించే బాధ్యతను తీసుకుంటున్నారు. తమ చేతులమీదుగా ఓటర్లకు మళ్లీ నగదు పంపిణీ జరిగేలా అభ్యర్థులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దళారులుగా ఉన్నవారు కొందరు ఓటర్లకు డబ్బులు పంచకుండానే దాచుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో దళారులను నమ్ముకుంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన అభ్యర్థులను వేధిస్తోంది. అయినప్పటికీ దళారులు తమ లబ్ధికోసం అభ్యర్థులను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.
వేడెక్కిన ‘పంచాయతీ’ సమరం..
పల్లెల్లో ఎముకలు కొరికే చలిలోనూ ఎన్నికల వేడితో సెగలు పుట్టిస్తున్నది. ఏ ఊరెళ్లినా.. ఏ వీధికెళ్లినా.. ఎన్నికల ముచ్చట్లే. ఎవరు గెలుస్తారోనన్న ఆందోళనే.. అభ్యర్థులు మాత్రం గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. అయితే, అధికారులు ఎన్నికల నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు పోలీస్ భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల 21 వ తేదీ సాయంత్రం నాటికి ఫలితాలూ వెలువడనుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

446
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles