కూటమిలో నిరసన సెగలు


Sat,November 17, 2018 01:23 AM

-సీపీఐ సమావేశం రసాభాస
-కుర్చీలు విరగ్గొట్టిన కార్యకర్తలు
-కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని కూనంనేనిపై ఒత్తిడి
-పేటలో టీడీపీకి సహకరించబోమని కాంగ్రెస్ నాయకుల స్పష్టీకరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మహాకూటమిలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగూడెం సీటుపై ఆశలు పెట్టుకున్న సీపీఐకి భంగపాటు కలగడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు. శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు , జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, పార్టీ ముఖ్యులు బరిగెల సాయిలు, బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణలతో పాటు ముఖ్య నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశం మధ్యలో ఆపార్టీ కార్యకర్తలు కొత్తగూడెం సీటును కాంగ్రెస్‌కు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదంటూ, పార్టీ పరంగా పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు.

నినాదాలు చేశారు. ఒకానొక దశలో కాంగ్రెస్‌కు సహకరించేది లేదంటూ, పోటీ చేయాలని గొడవ చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశం ప్రకారం నడుచుకుందామని నాయకులు చెప్పినప్పటికీ ససేమిరా అంటూ ఆగ్రహానికి లోనయ్యారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేకూనంనేని సాంబశివరావు సాక్షిగా సమావేశంలో కుర్చీలను విరగ్గొట్టి గందరగోళం సృష్టించారు. సీపీఐ అభ్యర్థిగా కూనంనేని పోటీలో ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని పార్టీ నాయకులు వారిని శాంతింపజేశారు. సీపీఐకి ఇచ్చిన సీట్లలో కాంగ్రెస్ రెబల్స్ నామినేషన్లు వేసినందున రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు కొత్తగూడెం నుంచి నామినేషన్ వేయాలా వద్దా అనే అంశంపై ఆలోచించేందుకు కొంతసమయం ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.

ఇలా ఉండగా అశ్వారావుపేట సీటును కూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించడంపై నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శుక్రవారం నాడు ములకలపల్లి మండలంలోని గుట్టగూడెం గ్రామంలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి టీడీపీకి సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నామినేషన్ వేసిన టీపీసీసీ మహిళా విభాగం కార్యదర్శి సున్నం నాగమణికి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని, లేకుంటే టీడీపీకి సహకరించబోమని తేల్చి చెప్పారు. పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా సున్నం నాగమణి రంగంలో ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. నిర్ణయాన్ని నాగమణికి అప్పగించారు. ఇల్లెందునియోజకవర్గం మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌కు కేటాయించారు.అయినప్పటికీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. నామినేషన్‌కు మూడు రోజులు మాత్రమే గడువు ఉన్నందున శనివారం నాడు అభ్యర్థిని ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన బానోత్ హరిప్రియఇల్లెందు నుంచి పోటీ చేసేందుకు రేవంత్‌రెడ్డి ద్వారాతీవ్రప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న భూక్యా దళ్‌సింగ్, చీమల వెంకటేశ్వర్లు మధ్య పోటీ జరుగుతోంది. హరిప్రియ, చీమల వెంకటేశ్వర్లును పార్టీ అధిష్టానం ఢిల్లీలో వార్ రూంకు పిలిపించి మాట్లాడినప్పటికీ టిక్కెట్ ఎవరికి ఇస్తారనేది తేల్చలేదు. కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కూటమి మద్దతుతో బరిలో ఉన్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు కూటమిలోని సీపీఐ, టీడీపీలు ఇంకా దూరంగానే ఉన్నాయి. సహకరించేందుకు ససేమిరా అంటున్నారు. పరిస్థితులు నామినేషన్ల ఉప సంహరణ తరువాత కొలిక్కివచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...