గూడెం కూటమిలో ముసలం


Fri,November 16, 2018 12:23 AM

(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ) మహాకూటమిలో కొత్తగూడెం టిక్కెట్‌పై ఇంకా అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గురువారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి నుంచి కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్‌లోని ఎడవల్లి వర్గం, సీపీఐ, టీడీపీలు వనమాకు దూరంగా ఉన్నాయి. తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌కు సహకరించేది లేదని, కొత్తగూడెం టిక్కెట్‌ను టీడీపీకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇప్పటికే వనమా అభ్యర్థిత్వంపై పార్టీ వైఖరిని ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో పొత్తుల ప్రకారం జరుగుతోన్న పరిణామాలు, ఇంకా ఒకటి రెండు సీట్లపై స్పష్టత రానందున పార్టీ ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని చెప్పారు. పినపాక , కొత్తగూడెం నియోజకవర్గాల్లో సీపీఐ కూటమిలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎలాంటి మద్దతును, సహకారాన్ని ఇచ్చిన పరిస్థితి లేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, కొత్తగూడెం టిక్కెట్‌ను ఆశించిన ఎడవల్లి కృష్ణ గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బహుజన లెప్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)లో చేరారు. తొలుత మాజీ మంత్రి వనమా తనయులు రాఘవేందర్‌రావు, రామకృష్ణ, మరికొందరు పాల్వంచలోని ఎడవల్లి కృష్ణ నివాసానికి వెళ్లారు.

ఈ విషయం తెలుసుకున్న ఎడవల్లి కృష్ణ, సుశీల దంపతులు వారిని ఇంట్లోకి రావొద్దని తలుపులు మూసేశారు. తమకు రావాల్సిన టిక్కెట్‌ను అవినీతి, అక్రమాలతో పొందినందున, గతంలో తమను ఎన్నో అవమానాలకు గురి చేసి తమ అనుమతి లేకుండా తమ ఇంటికి ఎలా వచ్చారంటూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎంతకూ వెళ్లకపోవడంతో కృష్ణ సతీమణి సుశీల ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వనమా తనయులతోపాటు వారి వెంట వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించేశారు. వనమా తనయులు గూండాలతో తన ఇంటికి వచ్చి తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారని, అవసరమైతే తనను చంపేందుకు కూడా వెనకాడబోరని, వనమా తనయులు రాఘవేందర్‌రావు, రామకృష్ణలతో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎడవల్లి కృష్ణ మీడియాకు చెప్పారు. ఈ వ్యవహారం పూర్తికాగానే జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీకి అక్కడే రాజీనామా లేఖను తయారు చేసి పంపారు. బీఎల్‌ఎఫ్‌లో చేరారు. తాను కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లను అమ్ముకుంటున్నారని, కష్టకాలంలో జిల్లాలో పార్టీలో ఎవరూలేని సమయంలో తాను కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సహకారంతో కార్యకర్తలకు అండగా నిలిచానని, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా సుమారు 25 వేల ఓట్లు పొందినప్పటికీ పార్టీ మారి తిరిగి వచ్చిన వనమాకు టిక్కెట్ ఇచ్చారని మనస్థాపం చెందిన తాను బీఎల్‌ఎఫ్‌లో చేరి ప్రజల తీర్పును కోరనున్నానన్నారు.

ఇలా ఉండగా పినపాక నియోజకవర్గానికి చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై రోశిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతో పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే పార్టీతో అనైతిక పొత్తు పెట్టుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని, టీడీపీతో కలిసి పనిచేయడానికి తన మనస్సు అంగీకరించడం లేదని, తాను కాంగ్రెస్ పార్టీకి, పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఒకటి రెండ్రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఇల్లెందు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇప్పటికే బానోత్ హరిప్రియ నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, హరిప్రియ, భూక్యా దళ్‌సింగ్‌ల మధ్య సీటు కోసం గట్టిపోటీ నెలకొంది. రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో టిక్కెట్ పొందేందుకు హరిప్రియ గురువారం ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. అబ్బయ్య తనకే టిక్కెట్ వస్తుందని దీమాతో ఉన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ అభ్యర్థికి టిక్కెట్ కేటాయింపుపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి సున్నం నాగమణి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...