కల్లోల కూటమి..

Thu,November 15, 2018 12:11 AM

వైరా రూరల్ : మహాకూటమి పొత్తులో భాగంగా వైరా సీటును సీపీఐకి కేటాయించడం పట్ల వైరాలోని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావుతో పా టు కాంగ్రెస్ నాయకులు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు బలం ఉన్న వైరా అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకు కేటాయించడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్టానం వైరా సీటును కాంగ్రెస్‌కు కేటాయించకపోతే నాయకులమంతా తమ పదవులకు రాజీనామాలు చేసి పార్టీని వీడతామని హెచ్చరించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పసుపులేటి మోహన్‌రావు, శీలం వెంకటనర్సిరెడ్డి, దాసరి దానియేలు, వేల్పుల జయరాజు, లావుడ్యా రాములునాయక్, పమ్మి అశోక్, గుగులోత్ రాము, చప్పిడి వెంకటేశ్వరరావు, షేక్ జాని, తాళ్ళ వసంతరావు, రాచబండి నాగేశ్వరరావు, పొదిల హరినాధ్ పాల్గొన్నారు.

సీపీఐకూ తప్పని రెబల్ బెడద...
-రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానంటున్న లాల్‌సింగ్
వైరా రూరల్ : మహాకూటమి పొత్తులో భాగంగా వైరా అసెంబ్లీ సీటును సీపీఐకు కేటాయించడంతో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం చేస్తుంటే మరోవైపు సీటు లభించిన సీపీఐ పార్టీకి రెబల్ బెడద తప్పడం లేదు. వైరా నియోజకవర్గ సీపీఐ రెబల్ అభ్యర్థిగా బానోత్ లాల్‌సింగ్ నామినేషన్ వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. వైరాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లాల్‌సింగ్ మాట్లాడుతూ.. తాను గత మూడు సంవత్సరాలుగా నియోజకవర్గంలో సీపీఐ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. తనకు పార్టీ టిక్కెట్టు ఇవ్వకపోవడంతో సీపీఐ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంటానన్నారు. సీపీఐ కుటుంబానికి చెందిన తనకు సీటు కేటాయించకుండా పార్టీ అవమానించిందన్నారు. హఠాత్తుగా సీపీఐ అధిష్టానం మరొకరి పేరు ప్రకటించడంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీపీఐ రెబల్ అభ్యర్ధిగా పోటీ చేసి సత్తా చాటుతానని పేర్కొన్నారు.

సీపీఐకు మా మద్దతు ప్రకటించం ..
-కాంగ్రెస్ మండల కమిటీ ఏకగ్రీవ తీర్మానం
కొణిజర్ల : మహాకూటమి పొత్తుల్లో భాగంగా వైరా నియోజకవర్గ అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ కేటాయించడాన్ని కాంగ్రెస్ మండల కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ నాయకులు సూరంపల్లి రామారావు అధ్యక్షతన స్థానిక శ్రీరామ కళ్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ సీపీఐ అభ్యర్థిని విజయ తండ్రి గుగులోతు ధర్మ సీపీఎం పార్టీకి చెందిన వారని, భర్త జీవన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారని, వీరు మంచిర్యాల జిల్లాకు చెందిన వారని, స్థానికేతరులకు ఓటేసే పరిస్థితి లేదన్నారు. సీపీఐ జిల్లా నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు కనుసన్నల్లో వైరా స్థానాన్ని సీపీఐ కేటాయించడం జరిగిందని, ఆమె విజయం సాధించినా తెరాసలో వెళ్లడం తధ్యమన్నారు. కావున తమంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని ఇండిపెండెంట్ నామినేషన్ వేయించి గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

256
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles