నేడు జిల్లాకు యువనేత


Wed,November 14, 2018 01:16 AM

-సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర సభల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
-నేడు నామినేషన్లు దాఖలు
-చేయనున్న తాటి, పిడమర్తి, లింగాల
- భారీ ర్యాలీలతో హాజరుకానున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శాసనసభ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఉమ్మడిఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో వివిధ పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని రాజకీయ పార్టీల కంటే టీఆర్‌ఎస్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, బీఫామ్‌లు అందజేయడం జరిగింది. టీఆర్‌ఎస్ తరపున వైరా నుండి పోటీచేస్తున్న బాణోత్ మదన్‌లాల్ అందిరికంటే ముందుగానే నామినేషన్‌ను దాఖలు చేశారు. ఉమ్మడిజిల్లాలోని అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ తరుపున పోటీచేస్తున్న తాటి వెంకటేశ్వర్లు, పిడమర్తి రవి, లింగాల కమల్‌రాజులు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొననున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నేరుగా సత్తుపల్లి చేరుకుంటారు.

అక్కడ పిడమర్తి రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలో యువనేత పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి అశ్వారావుపేటకు వెళ్తారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు నామినేషన్ ప్రక్రియకు కేటీఆర్ హాజరవుతారు. ఆ తరువాత మధ్యాహ్నం 1గంటకు అశ్వారావుపేటలో జరిగే బహిరంగ సభలో యువనేత ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో అశ్వారావుపేట నుంచి మధిరకు చేరుకుంటారు. ఇక్కడ లింగాల కమల్‌రాజు నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3గంటలకు మధిర పట్టణంలో జరిగే నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మూడుచోట్ల జరిగే నామినేషన్లు, బహిరంగ సభలలో మంత్రి కేటీఆర్‌తో పాటు జిల్లాకు చెందిన రోడ్లు భవాలనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు, పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు పెద్దఎత్తున హాజరుకానున్నారు.

పెద్దఎత్తున హాజరుకానున్న జనవాహిని..
ఎన్నికల సంగ్రామం మొదలైన తరువాత యువనేత కేటీఆర్ తొలిసారిగా జిల్లాకు బుధవారం రానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో పర్యటిస్తూ బహిరంగ సభలకు హాజరవుతున్నారు. దీనిలో భాగంగానే మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రలలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. సభలను విజయవంతం చేసేందుకు ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులు కృషిచేస్తున్నారు. ఇప్పటికే గత రెండు నెలల నుంచి అభ్యర్థులు నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రభుత్వ హయాంలో లబ్ధిపొందిన వారి వద్దకు అభ్యర్థులు వెళ్లి కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతిఓటరు కారుకు ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. పోటీ చేసే అభ్యర్థులు అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారు. మహాకూటమి తరుపున పోటీచేసే అభ్యర్థులను నిలదీసేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గ కేంద్రాలలో జరిగే బహిరంగ సభలకు పెద్దఎత్తున జనవాహిని కదిలిరానున్నది.

227
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...