గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషిచేశా..

Wed,November 14, 2018 01:12 AM

-మారుమూల తండాలకూ రోడ్లు వేశాం..
- నియోజకవర్గంలోని అన్నిగ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగే వరకు విశ్రమించను..
-కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు
తిరుమలాయపాలెం: గడిచిన రెండేళ్లలో నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధికి విస్తృతంగా కృషిచేసినట్లు పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తిరుమలాయపాలెం మండలం రమణతండ, బాలాజీనగర్‌తండ, బలరాంతండ, బీచరాజుపల్లితండ, వెదుళ్లచెరువు, తెట్టెలపాడు, దమ్మాయిగూడెంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో తుమ్మల మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమగ్ర అభివృద్ధి జరిగే వరకు విశ్రమించనన్నారు.. మారుమూల తండాలకు సైతం బీటీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. తండాల్లో విద్యుత్, తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పడు రమణతండా ప్రజలు రోడ్డు కావాలని అడిగారని, వారి హామీ మేరకు రోడ్డు వేసిన తర్వాతే మళ్లీ ఇక్కడికి వచ్చినట్లు గుర్తుచేశారు.. ఈ ప్రాంతంలో చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా బాగు చేయించి భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా నీటితో నింపినట్లు పేర్కొన్నారు.

తిరుమలాయపాలెం నుంచి రమణతండ మీదుగా బీచరాజుపల్లి వరకు బీటీ రోడ్డు మంజూరు చేస్తానని, అన్ని తండాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు.. ఇంటింటికీ నల్ల ద్వారా తాగునీటి సమస్య పరిష్కరిస్తామని, ప్రజల విజ్ఞప్తి మేరకు బీచరాజుపల్లి వద్ద ఆకేరుపై బ్రిడ్జీ నిర్మిస్తామని చెప్పారు. తెట్టెలపాడు నుంచి గోపాలపురం వరకు బీటీరోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. తెట్టెలపాడు, దమ్మాయిగూడెంలో రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తానన్నారు. మిగతా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ప్రకటించారు. అన్నిరకాల వృత్తిదారులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకున్నట్లు చెప్పారు. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అర్హులైన పేదలందరికీ సొంత స్థలాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. డ్వాక్రా మహిళల రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వికలాంగులకు రూ.3016లు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016లకు పింఛన్లు పెంచనున్నట్లు ప్రకటించారు.

అత్యంత కరువు పీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలం సస్యశ్యామలం కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తోడ్పాటు ఎంతో ఉందన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా కరువు ప్రాంతంలో సిరులు కురుస్తున్నాయని పేర్కొన్నారు. సీతారామా ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేయడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తుమ్మలకు గిరిజన తండాలు, గ్రామాల్లో మహిళలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. తిలకం దిద్ది డప్పువాయిద్యాలతో గ్రామాల్లోకి ఆహ్వానించారు. తెట్టెలపాడులో యాదవులు గొర్రె పిల్లను బహుకరించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఆర్.నరేష్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, ఎంపీపీ కొప్పుల అశోక్, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షకార్యదర్శులు బోడ మంగీలాల్, కొండబాల వెంకటేశ్వర్లు, పుసులూరి రమేష్‌బాబు, చిర్రా కృష్ణయ్య, ఆలిస్యం నాగేశ్వరరావు, ఆలదాసు ఆంజనేయులు, నేరడ సత్యం, సైదా, కస్నా, పంతు, బాలు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

207
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles