జిల్లాలో తొలిరోజు మూడు నామినేషన్లు


Mon,November 12, 2018 11:53 PM

ఖమ్మం సిటీ/ వైరా, నవంబర్ 12: శాసనసభ ఎన్నికల పురస్కరించుకొని సోమవారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సోమవారం తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన అభ్యర్థి ఏ.విజయ్‌ప్రసాద్ ఖమ్మం రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి బాణోత్ మదన్‌లాల్, సీపీఐ(ఎం) నుంచి భూక్యా వీరభద్రంలు తమ నామినేషన్లను వైరా రిటర్నింగ్ అధికారికి అందజేసినట్లు చెప్పారను. పాలేరు, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో మొదటి రోజు నామినేషన్లు ఏమీ దాఖలు కాలేదని వివరించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించిన మొదటి రోజైన సోమవారం వైరాలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వైరాలోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ల కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. సోమవారం స్థానిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో టీఆర్‌ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్, బీఎల్‌ఎఫ్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రంలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మదన్‌లాల్ మొత్తం మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఒక సెట్‌లో టీఆర్‌ఎస్ నాయకుడు మచ్చా వెంకటేశ్వరరావు, మరో సెట్‌లో కట్టా కృష్ణార్జున్‌రావు, ఇంటో సెట్‌లో వనమా విశ్వేశ్వరరావులు మదన్‌లాల్‌ను బలపరిచారు. అదేవిధంగా సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రం వేసిన నామినేషన్‌ను జేవీవీ నాయకుడు, చైతన్య విద్యాసంస్థల కార్యదర్శి మల్లెంపాటి వీరభద్రరావు బలపరిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవితతో కలిసి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయేషా మస్రత్‌ఖానంకు అందజేశారు. మంగళవారం సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రం తమ పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ నెల14న బీజెపీ అభ్యర్థి రేష్మా రాథోడ్ నామినేషన్ వేయనున్నారు.

181
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...