పోలింగ్ కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేయాలి

Sun,November 11, 2018 04:23 AM

-13న ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
ఖమ్మం సిటీ, నవంబర్10: పోలింగ్ కేంద్రాలలో అవసరమైన వటసతులను ఈనెల 16 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం టీటీడీసీ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారుల, సహాయ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు వల్లరబిలిటీ మ్యా పింగ్‌ను సోమవారంలోగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ర్యాంపుల మరమ్మతులు, నూతన ర్యాంపుల నిర్మాణపు పనులు ఈనెల 16 లోగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా స్కూల్ భవనాలకు అదనంగా ఉన్న పోలింగ్ కేంద్రాల భవనాలలో విద్యుత్, తాగునీటి సౌకర్యాన్ని నగర పరిధిలో మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ పరిధిలో ఎంపీడీఓలు ఈనెల 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి ఈనెల 13 నుంచి నిర్వహించే శిక్షణా తరగతులకు సిబ్బందితో పాటు సెక్టోరల్ అధికారులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

ఏ నియోజకవర్గానికి సంబంధించి శిక్షణా తరగతులను ఆ నియోజకవర్గ కేంద్రాల్లోనే ఏర్పాటు చేస్తున్నామని, ఈవీఎంలు, వీవీ ప్యాట్స్, కంట్రోల్ బ్యాలెట్ యూనిట్ పనితీరుపట్ల సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. సెక్టోరల్ అధికారులు తమ విధుల ప్రాముఖ్యతను గ్రహించి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. దివ్యాంగ ఓటర్లను గుర్తించడం జరిగిందని అట్టి జాబితాను రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి పొంది పోలింగ్ లోకేషన్ వారీగా రూట్‌మ్యాప్‌లను సిద్ధం చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా దివ్యాంగ ఓటర్లకు అవసరమైన వీల్‌చైర్స్ అవశ్యవతను తెలిపాలని వారు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లను సమకూర్చాలని దివ్యాంగుల వాహానల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాన్ని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. సీ-విజిల్ మోబైల్‌యాప్ వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంలో భాగంగా సెక్టోరల్ అధికారులకు నిర్థేశించిన లక్ష్యాలను ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆయోషా మస్రత్‌ఖానం, సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఇంచార్జ్ రెవెన్యూ అధికారి మదన్‌గోపాల్, రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంపిడిఓలు, మండల విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

265
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles