ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

Sat,November 10, 2018 12:05 AM

-చెక్‌పోస్టులను మరింత పటిష్టపరచాలి
-అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
-పోలీస్ అధికారుల సమావేశంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం క్రైం, నవంబర్ 9: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో రాష్ట్ర, జిల్లాలోని చెక్‌పోస్టులను మరింత పటిష్టపరచాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన ఆయన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడానికి, ఓటర్లలో విశ్వాసాన్ని పెంచడానికి జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడడం, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని వారికి నచ్చిన వారికి ఓటు వేసే విధంగా ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవడానికి అధికారులు అప్రమత్తతతో పనిచేయాలని సీపీ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణా నియంత్రించేందుకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో చెక్‌పోస్టులలో భద్రతపర చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీస్ అధికారులకు, సిబ్బందికి అప్పగించిన భాద్యతను ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని విధులను నిర్వహించాలని సూచించారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్‌లను విధిగా సందర్శించాలన్నారు. నిరంతర నిఘా, సత్వర స్పందన, ముందస్తు సమాచార సేకరణతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదన్నారు. శాంతిభధ్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పాత నేరస్ధులను, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను, అనుమానితులను బైండోవర్ చేయాలన్నారు. అదేవిధంగా పోలీస్ వాహనాలు వారికి నిర్ధేశించిన రూట్లలో ప్రతిరోజు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వెహికిల్ చెకింగ్ నిర్వహించాలన్నారు. అనంతరం ఎన్నికల రోజున అధికారులు తీసుకోవల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఐటీబీపీ అధికారి ఉదయ్‌వీర్‌సింగ్, నగర ఏసీపీ ఘంటా వెంకట్రావు, రూరల్ ఏసీపీ రామోజీ రమేష్, వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, కల్లూరు ఏసీపీ ఆంజనేయులు, ట్రాఫిక్ ఏసీపీ సదానిరంజన్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సదానిరంజన్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రహమాన్, ఏఆర్ ఏసీపీలు విజయ్‌బాబు, రియాజ్, ఎస్బీ సీఐ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

305
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles