ప్రజలకు సేవ చేయడమే నా జీవిత ఆశయం

Sat,October 13, 2018 12:55 AM

-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-టీఆర్‌ఎస్‌లో 200 కుటుంబాలు చేరిక
ఖమ్మం రూరల్ : నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజలకు నిస్వార్థమైన సేవ చేయడమే నా జీవిత ఆశయం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం రూరల్ మండలం పెద్దతండాలో కార్పొరేటర్ దరావత్ రామ్మూర్తినాయక్ ఆధ్వర్యంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 200కుటుంబాలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాలేరులో గడిచిన 60సంవత్సరాల కాలంలో చేయలేని అభివృద్ధిని స్థానిక ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ర్టానికే మోడల్‌గా తీర్చిదిద్ధినట్లు తెలిపారు. పాలేరు రూపురేఖలు మార్చడేమ కాకుండా వారి జీవన ప్రమాణాన్ని సైతం పెంచినట్లు తెలిపారు. నాకు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధే లక్ష్యం అని స్పష్టం చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పేదల సంక్షేమ కోసం రూ.43వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆసరా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యరక్ష, హెల్త్‌కిట్స్, ఆరోగ్య శ్రీ, గొర్రెల పంపిణీ పథకాలు ఇంకా అనేకం ఉన్నట్లు తెలిపారు. రైతాంగ సమస్యలు తీర్చడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ప్రవేశపేట్టినట్లు తెలిపారు. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.4వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.ఒక వైపు నియోజకవర్గంలో చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతలు, రహదారులు నిర్మించి కష్టాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణకు కేసీఆర్ మరోసారి సీఎం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

పెద్దతండా రూరల్ మండలానికే గుండెకాయాలంటిది..
పెద్దతండా పంచాయతీ రూరల్ మండలానికి గుండెకాయలాంటిదని అటువంటి పంచాయతీ నుంచి భారీగా చేరికలు జరగడం మంచి శుభపరిణామం అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి నా శక్తివంచనలేకుండా కృషి చేస్తానన్నారు. నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కార్పొరేషన్‌లో వీలినం చేశామని, వీలీనం వల్ల కోట్ల వ్యయంతో సీసీరోడ్లు, డ్రైన్‌లు, తాగునీరు పథకాలను నిర్మాణం జరుగుతాయన్నారు.

రాష్ట్రంలో వందసీట్లు ఖాయం..: రాష్ట్రంలో గడిచిన నాలుగు ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు అన్నివిధాలుగా న్యాయం జరిగిందని ప్రజల రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరికి గెలిచేది టీఆర్‌ఎస్ పార్టీయేనని అన్నారు. రాష్ర్టాన్ని అదోగతిపాలు చేసిన కాంగ్రెస్ కూటమికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. సీఎం కేసీఆర్‌ను ఢీకొనే దమ్ము, ధైర్యం ఎవరికిలేదన్నారు. పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, జిల్లా నాయకుడు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు బెల్లం వేణు, సొసైటీ చైర్మన్ మంకెన నాగేశ్వరావు, పాప్యానాయక్, ఎంపీటీసీ బానోత్ సుజాత, నాయకులు తోట వీరభధ్రం, పంతులు, ఫారెస్ట్ రిటైర్డ్ ఆఫీసర్ మూడ్ రామ్మూర్తినాయక్, క్రిష్ణ తదితరులు ఉన్నారు.

195
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles