అన్ని రాజకీయ పార్టీలు

Sat,October 13, 2018 12:55 AM

-ఎన్నికల నియమావళి పాటించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాలని జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ ప్రకటించినందున జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని, అందువలన పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించామన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలపై జిల్లా మానిటరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాలని, కరపత్రాలు ముద్రణకు సంబంధించి ముందుగానే నాలుగు ప్రతులు జతచేసి, ఇద్దరు సాక్షుల సంతకాలతో కమిటీ ఆమోదం తీసుకోవడంతో పాటు కరపత్రాలు ముద్రణ చేయించుకునే వారి చిరునామా, సెల్ నంబర్లు, ప్రింటింగ్ ప్రెస్ చిరునామా, సెల్‌ఫోన్ నంబర్లను తప్పక తెలపాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల పరిధిలో ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులు తీసుకోవాలన్నారు.

ప్రజల వ్యక్తిగత జీవితాలకు ఆటంకాలు లేకండా అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతించిందని, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అభ్యర్థులు చేసే ప్రతీ కార్యక్రమంపై డేగకన్ను తరహాలో పరిశీలన చేయనున్నామన్నారు. నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆయా రిటర్నింగ్ అధికారుల ద్వారా సులభంగా అనుమతి పొందేందుకు సువిధ యాప్‌ను ఎన్నికల సంఘం అందుబాబటులోకి తెచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా అనుమతి తీసుకోవడానికి ఒక రోజు ముందు తీసుకోవాలన్నారు. సిటికేబుల్స్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించే అభ్యర్థులు తాము చేయనున్న ప్రచారానికి సంబంధించిన సీడీని జతచేస్తూ మీడియా కమిటీ ఆమోదం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్తులపై ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ఎటువంటి పోస్టర్లు, వాల్ రైటింగ్స్ చేయరాదని వివరించారు. పక్క రాష్ట్రల నుంచి ప్రచార సామగ్రి వచ్చే అవకాశమున్నందున పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని, ఎవరైనా అక్రమంగా ప్రచార సామగ్రిని తరలిస్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులకు సంబంధించి సీ విజిల్ యాప్ అందుబాటులోకి తెచ్చామని, ఈ యాప్‌లో తక్షణం ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. డీపీఆర్‌వో శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ నుంచి ఏమునూరి లక్ష్మీబాయి, సీపీఐ నుంచి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నుంచి జీ కృష్ణ, బీజేపీ నుంచి రమేష్, సీపీఎం నుంచి అన్నవరపు సత్యనారాయణ, ప్రింటర్స్ అసోసియేషన్ కొత్తగూడెం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పాల్వంచ అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

192
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles