ఆదిపరాశక్తీ నమోస్తుతే..

Fri,October 12, 2018 12:19 AM

(ఖమ్మం కల్చరల్) శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ఆదిపరాశక్తికి భక్తులు అనేక పూజలు చేసి తరించారు. పలు అమ్మవారి ఆలయాలు, చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్‌లలో కొలువుంచిన మండపాలలో భక్తులు రెండో రోజు విశేష పూజలు చేవారు. ప్రధానంగా నగరంలోని గుట్టలబజార్‌లోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, శృంగేరి శంకరమఠం, స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి పారువేట జమ్మిబండ, నిమిషాంబదేవి, కనకదుర్గ ఆలయాల్లో అమ్మవారికి విశేష పూజలు చేశారు.

గాయతీఓఉ అలంకారంలో వాసవీ మాత..
గాయత్రి దేవి అలంకారంలో వాసవీ మాత భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు తమకు సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని సేవించారు. శ్రీవాసవీ మాలాధారులు నిష్టతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. మహిళా భక్తుల లలితా సహస్రనామ పారాయణంతో ఆలయం ఆధ్యాత్మిక, భక్తి భావంతో ఉప్పొంగింది. అమ్మవారికి పంచహారతులు, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి శక్తి స్వరూపిణిని కొలిచారు. సకల సౌభాగ్యాలు ప్రసాదించే సుదర్శన హోమాన్ని అత్యంత శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దేవత అనిల్‌కుమార్, కొత్తమాసు హేమసుందర్‌రావు, గెల్లా అమర్‌నాథ్, గోళ్ల భాస్కర్‌రావు, గోపాలరావు, సురేంద్రనాథ్‌గుప్తా, బిజ్జాల ఈశ్వరరావు, దుగ్గి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బ్రాహ్మి అలంకారంలో శారదామాత..
ట్రంక్‌రోడ్‌లోని శ్రీరామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రం, శ్రీశృంగేరి శంకరమఠంలో నిర్వహిస్తున్న శ్రీశారదా శరన్నవరాత్ర ఉత్సవాలలో భాగంగా గురువారం శారదా అమ్మవారు బ్రాహ్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో సహస్రనామ కుంకుమ పూజలు, బిళ్వార్చనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో యాజ్ఞీకులు రుద్ర, నవగ్రహ హోమం నిర్వహించగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. శ్రీభారతీతీర్థ ప్రవచన మంటపంలో సామూహికంగా భక్తులు చేసిన లలిత సహస్ర నామ పారాయణం మార్మోగింది. వేద పండితుడు వనం వేంకట వరప్రసాదరావు దుర్గా వైభవం గురించి వివరించారు. శక్తి స్వరూపిణి అయిన దుర్గా మాత అనుగ్రహంతోనే భక్తులకు సుఖశాంతులుంటాయన్నారు. వేర్వేరు అవతారాలు, అలంకారాల్లో మాత భక్తులను ప్రసన్నం చేస్తుందని, ప్రత్యేకంగా శరన్నవరాత్రి ఉత్సవాలలో జగన్మాతను సేవించే భాగ్యం అందరికీ కలగాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మాధికారి జూపూడి హనుమత్ ప్రసాద్, చైర్మన్ కూరపాటి సీతారామారావు, గెంటేల విద్యాసాగర్, పర్చా లక్ష్మీనర్సింహారావు, గెల్లా దుర్గాప్రసాద్, ఎంవీడీ నాగభూషణరావు, కె.రాంనాయక్, నామవరపు శ్రీనివాస శర్మ, శ్రీధర్ పాల్గొన్నారు.

పూర్వ జిల్లాలో కొనసాగుతున్న నవరాత్రులు
దేవీ నవరాత్రి వేడుకలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ అమ్మవారికి రోజుకో అలంకారం గావిస్తున్నారు. భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

157
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles