నాలుగేళ్లలో నలబైఏళ్ల అభివృద్ధి..

Tue,October 9, 2018 12:35 AM

ఖమ్మం వ్యవసాయం : గడిచిన నాలుగేళ్లలోనే నలబైఏళ్ల అభివృద్ధిని మైమరపించే విధంగా కృషి చేశానని ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 37 డివిజన్ గాంధీచౌక్ సెంటర్‌లో, 26వ డివిజన్ రేవతి సెంటర్‌లో కొండబాల కోటేశ్వరరావుతో కలిసి డివిజన్ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే గెలిచిన రోజునుంచి నగర అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకొని పనిచేశానన్నారు. నగర అభివృద్ధికి నావంతు కృషి చేయాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయలకు వచ్చానన్నారు. అందుకు ప్రజలు సమ్మతించి నాకు అవకాశం కల్పించారన్నారు. గడిచిన నాలుగేళ్లుగా ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా చిత్తశుద్ధితో పని చేశానని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ పరిష్కారం చూపెట్టానన్నారు. రూ.1326 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వేలాది కోట్ల నిధులు వెచ్చించి నగర అభివృద్ధికి కృషి చేశానన్నారు. గతంలో గెలిచిన ఏ ఎమ్మెల్యే అయినా నిత్యం ప్రజల మధ్య ఉండి వారి ఇబ్బందులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం అయ్యాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.

పక్కా ప్రణాళికతో పని చేయడం వలనే అనతి కాలంలోనే నగరం సుందర నగరంగా తయారు అయ్యిందన్నారు. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీరును అందివ్వాలనే లక్ష్యంతో మిషన్‌భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రతి ఇంటికి ప్యూరిఫైడ్ వాటర్ అందివ్వడం జరుగతుందన్నారు. రానున్న రోజుల్లో నగరం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుల, మతాలకు సంబంధం లేకుండా పని చేసిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నారు. సమాజంలోని సబ్బండ వర్గాలను సముచిత స్థానం కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాలలో మేయర్ పాపాలాల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కార్పొరేటర్ పోతుగంటి వాణీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నాయకులు పసుమర్తి రాంమోహన్‌రావు, ఆకుల సతీష్, పులిపాటి ప్రసాద్, కొత్తా వెంకటేశ్వరరావు, మాటేటి రామారావు, మాదిరాజు వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

186
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles