ప్రశాంతంగా గ్రూప్-4 రాత పరీక్ష

Mon,October 8, 2018 01:58 AM

ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 7 : వివిధ విభాగాల్లో గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆదివారం జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 80 కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్-4 రాత పరీక్షకు 28,206 మంది అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించిన జనరల్ నాలెడ్జ్ పరీక్షలో 28,206 మందికి 20,294 మంది హాజరై 7,912మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షలో 20,181 మంది హాజరై 8,025 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ అయోషా తెలిపారు. డిగ్రీ విద్యార్హతగా జరిగిన పరీక్షలో ఉదయం కంటే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 113 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.

గంట ముందుగానే కేంద్రాలకు... : ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పరీక్షలు రాస్తుండటంతో సూచించిన సమయం కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష కాగా గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన అ భ్యర్థులు కేంద్రాల గుర్తింపులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉదయం 8.30 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్న 2.30గంటలకు పరీక్ష ప్రారంభం కానుండటంతో 1.30గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలనే జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో యంత్రాంగం పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించింది. ముందుగా పోలీస్ శాఖ అధికారులు ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవడంతో ట్రాఫిక్ సమస్యలు తప్పాయి.

క్షుణ్ణంగా తనిఖీలు... : పరీక్షలు రాసేందుకు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యాసంస్థల ప్రధాన ద్వారం వద్ద నుంచే అభ్యర్థులను ఆయా విద్యాసంస్థల సిబ్బంది, పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది తనిఖీ చేశారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌పోన్లు వంటి వాటిని అనుమతించలేదు. అభ్యర్థితో పాటు హాల్‌టిక్కెట్ గుర్తింపు కార్డులను మాత్రమే అనుమతించారు. అత్యధిక విద్యాసంస్థల్లోనూ సీసీ కెమెరాలు ఉండటం వంటి వాటితో పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు దోహదపడింది. జిల్లాలో జరుగుతున్న పరీక్షలను పర్యవేక్షించేందుకు 13మంది రూట్ అధికారులు విధులు నిర్వర్తించారు.

పూర్తిస్థాయిలో సౌకర్యాలు... : పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం సక్సెస్ అయింది. ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తాగునీరు, గాలి, వెలుతురు అన్ని ఉండేలా చర్యలు తీసుకుంది. పరీక్షల సమయంలో ఎవరైనా అభ్యర్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలు అందించేందుకు ఆరోగ్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ప్రశ్నాపత్రాలు తరలించే సమయంలో, పరీక్ష ముగిసిన అనంతరం సమాధాన పత్రాలు తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి బందోబస్తు కల్పించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయించారు.

కేంద్రాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్... : జిల్లాలోని పలు కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అయోషా తనిఖీ చేశారు. నగరంలోని న్యూవిజన్ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో ఆయా కేంద్రంలోని హాజరు, గైర్హాజర్ వివరాలకు కేంద్రాల చీఫ్ సూపరిండెంట్‌లను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల హాల్‌టిక్కెట్‌లను, గుర్తింపు కార్డులతో సరిచూశారు. ఎలాంటి సమస్యలు లేకుండా టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో ఆయా నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు జరుగుతున్న సరళీని పర్యవేక్షించేందుకు టీఎస్‌పీఎస్‌సీ ప్రతినిధులు నగరంలోని పలు కేంద్రాలను తనిఖీ చేశారు.

263
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles