ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీస్ అధికారులు కృషిచేయాలి..


Fri,September 21, 2018 12:56 AM

ఖమ్మం క్రైం: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలను విజయంవతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్‌ఆర్‌వీ కర్ణన్ అన్నారు. గురువారం పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పోలీసుస్టేషన్ల పరిధిలో గల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి జాబితాను సమర్పించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో అక్రమ ధన, బల, మద్యపానాన్ని నిషేధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలకై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తదుపరి రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచార సభలను ముందస్తుగానే అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. దీనికి గాను ప్రత్యేకంగా సువిధ ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పోలీసు బలగాలను మోహరింపచేయాలని సూచించారు. ఈ సారి జరుగనున్న ఎన్నికల్లో ఎంపీ 3 ఈవీఎంలను వినియోగించనున్నామని, ఇవి ఎటువంటి ట్యాంపరింగ్‌కు ఆస్కారం కలిగి ఉండవన్నారు.

నూతన ఈవీఎంలు జిల్లాకు వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి లెవల్‌చెక్‌ను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ... రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో లైసెన్స్ కలిగి ఉన్న ఆయుధాలు పోలీసు స్టేషన్లలో భద్రపర్చేందుకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన వెంటనే అన్ని బెల్ట్‌షాపులను మూయించాలని, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, వీ.ఐ.పీల పర్యటనల సందర్భంగా అవసరమైన బందోబస్తుకు హెలీప్యాడ్ వంటి ఏర్పాట్లకై ముందస్తుగానే గుర్తించి ఏర్పాటు చేయాలని పోలీసు కమిషనర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికలలో పోలీసుశాఖ పాత్రపై సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా పోలీసు అధికారులకు వివరించారు. అడిషనల్ డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీలు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...