31,122 మందికిస్పష్టమైన చూపు..!

Thu,September 20, 2018 12:37 AM

-జిల్లాలో జోరుగా కొనసాగుతున్న కంటి వెలుగు..
-114 గ్రామాలు, 10 వార్డుల్లో వందశాతం పూర్తి..
-ఇప్పటి వరకు 1,23,912 మందికి కంటి పరీక్షలు..
-ఆపరేషన్లకు 13,609 మంది కి సిఫారస్..
ఖమ్మం, నమస్తేతెలంగాణ: ఇంతకాలం సమస్య తెలియలేదు. అంతా బాగుందనే గుడ్డి నమ్మకంతో జీవితాన్ని నెట్టుకొచ్చారు. తీరా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు ద్వారా అంధత్వాన్ని తెలుసుకున్నారు. నయాపైసా ఖర్చులేకుండా అందించిన కళ్లద్దాలు, మందులతో స్పష్టమైన చూపును పొందారు. సీఎం కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ఖమ్మం జిల్లాలో వేలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటివరకు మొత్తం 31,122 మంది కంటి సమస్యలకు పరిష్కారం పొంది, ప్రతీఅంశాన్ని తేలిగ్గా చూడగలుగుతున్నారు. బుధవారం ఒక్కరోజే జిల్లాలోని 32 వైద్యశిబిరాల పరిధిలో 5,594 మంది కంటి పరీక్షలు నిర్వహించుకోవటం గమనార్హం.

ఉద్యమనేత ఆశయం జిల్లాలో సత్ఫలితాలనిస్తుండటంతో ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి నేటి వరకు 114 గ్రామాలు, 10 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల ప్రక్రియ వందశాతం పూర్తికాగా, వైద్యసాయం పొందిన వారి సంఖ్య 1,23,912కు చేరుకోవటం గమనార్హం. మరో 24 గ్రామాలు, 8 మున్సిపల్ వార్డులు చివరిదశలో ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎడతెరిపి లేకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం పనిచేస్తున్నాయి. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ కొండల్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు..

కంటి పరీక్షల్లో మహిళలే అధికం..
అంధత్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సర్కార్ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో మహిళలే ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. ఇప్పటి వరకు కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో పురుషులు 54,467 మంది ఉండగా, మహిళల సంఖ్య 69,435గా నమోదుకావటం విశేషం. కులాల వారీగా లెక్కించగా ఎస్సీలు 27,395, ఎస్టీలు 16,526, బీసీలు 57,401, ఓసీలు 25,351, మైనార్టీలు 2,053 మంది ఉన్నారు. వారందరికీ కండ్ల పరీక్షలు నిర్వహించిన వైద్యారోగ్యశాఖ యంత్రాంగం మొత్తం 31,122 మందికి ఉచితంగా అత్యాధునిక కళ్లద్దాలను, మందులను అక్కడికక్కడే అందించటం గమనార్హం.

దూరపుచూపు సమస్య కలిగిన 28,624 మందికి కళ్లద్దాలు అవసరం ఉన్నాయని ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. కంటి పరీక్షల నిమిత్తం ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, మమత, అఖిల కంటి దవాఖానలకు 10,099 మందిని, హైదరాబాద్‌కు చెందిన వైద్యశాలలకు 3,556 మందిని సిఫారసు చేశారు. వీరిలో పలువురు కేటాయించిన దవాఖానలకు వెళ్లి ఆపరేషన్లు చేయించుకున్నారు. ఆ క్రమంలో అన్నిరకాల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుండటంతో సంబంధిత వైద్యశాలల యాజమాన్యాలు రోగుల నుంచి నయాపైసా తీసుకోవటం లేదు. నేడు కూడా జిల్లాలో కంటి పరీక్షల ప్రక్రియ కొనసాగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏ కొండల్‌రావు కోరారు.

269
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles