అధత్వ నివారణకే కంటి వెలుగు

Wed,September 19, 2018 01:50 AM

-112 గ్రామాలు, 9 మున్సిపల్ వార్డుల్లో సంపూర్ణం
- జిల్లాలో మొత్తం 1,17,279 మందికి కంటి పరీక్షలు
- ఎస్సీలు 26,022, ఎస్టీలు 15,480, బీసీలు 54,175,
- ఓసీలు 19,613, మైనార్టీలు 1,989 మందికి వైద్యసేవలు
- 29,683 మందికి అత్యాధునిక కళ్లద్దాలు ఉచిత పంపిణీ
- ఆపరేషన్లకు 13,309 మందిని సిఫారసు చేసిన వైద్యారోగ్యశాఖ

ఖమ్మం, నమస్తేతెలంగాణ : అందత్వ రహిత తెలంగాణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో సెంచరీ కొట్టింది. ఇప్పటి వరకు జిల్లాలోని 112 గ్రామాలు, తొమ్మిది మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసింది. మరో 24 గ్రామాల్లో నేడో, రేపో పూర్తికానుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ కొండల్‌రావు వెల్లడించారు. కాగా 32 వైద్యశిబిరాల పరిధిలో మంగళవారం ఒక్కరోజే 5,341 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం గమనార్హం. గత పంధ్రాగస్టు నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా కంటి పరీక్షలు జరిపించుకున్న వారి సంఖ్య మొత్తం 1,17,279 మందికి చేరుకుంది. వారిలో మహిళలు 65,895, పురుషులు 51,374 మంది ఉన్నారు. కులాల వారీగా లెక్కించగా ఎస్సీలు 26,022, ఎస్టీలు 15,480, బీసీలు 54,175, ఓసీలు 19,613, మైనార్టీలు 1,989 మంది వైద్యశిబిరాల వద్దకు వెళ్లి కంటి పరీక్షలు జరిపించుకోవటంతో పాటు సంబందిత వ్యాధులకు నయాపైసా ఖర్చులేకుండా సేవలు పొందారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్యాధికారులు పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సైతం కంటి వెలుగు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించి వైద్యశిబిరాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

29,683 మందికి కళ్లద్దాలు పంపిణీ..
కంటి వెలుగు కార్యక్రమానికి పూర్వం ప్రతిఒక్కరూ కండ్లు బాగానే కనిపిస్తున్నాయనే భ్రమల్లో జీవించారు. కేవలం అవగాహనా రాహిత్యంతో అరకొర చూపుతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఎప్పుడైతే సీఎం కేసీఆర్ తన స్వగ్రామంలోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజలు ఎదుర్కొంటున్న అందత్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత నెలరోజులుగా జిల్లాలో శరవేగంగా కొనసాగుతున్న కంటి పరీక్షల ప్రక్రియలో వెలుగు చూస్తున్న వాస్తవాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటి వరకు దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న 27,621 మందికి అత్యాధునిక కళ్లద్దాలను, మందులను ఉచితంగా అందజేశారు. దూరపు చూపు సమస్యకు గురైన మరో 27,621 మందికి కళ్లద్దాలు అవసరం ఉన్నాయని ఆన్‌లైన్‌లో నివేదించారు. దీనినిబట్టి చూస్తే కేవలం దృష్టిలోపంతో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 55వేలకు చేరుకుంది. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులకు గురైన 13,309 మందికి ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తేల్చారు. వారిలో 9,844 మందిని ఖమ్మంలో ఎంపిక చేసిన దవాఖానాలకు, మరో 3,508 మందిని హైదరాబాద్ హాస్పిటల్స్‌కు రిఫర్ చేశారు. కాగా..! కేవలం నెలరోజుల వ్యవధిలో కంటి చూపు సమస్యతో జిల్లాలో దాదాపు 68 వేల మంది బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. వారందరి జీవితాల్లో కంటి వెలుగు కార్యక్రమం నూతనోత్తేజాన్ని తీసుకువస్తున్నదనటంలో ఎలాంటి సందేహం లేదని అధికారులు అంటున్నారు.

235
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles